హైదరాబాద్ క్రికెట్ లో ’కాసుల లీగ్’.. క్లబ్ లకు డబ్బులిచ్చి ఆడుకోవడమే
కానీ, హైదరాబాద్ లో ‘కాసుల ప్రీమియర్ లీగ్’ నడుస్తోంది.. ఇది పేరుగాంచిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)కు చెడ్డ పేరు తెస్తోంది.
By: Tupaki Desk | 27 May 2025 8:00 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే అందరికీ తెలుసు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ అని ఎవరిని అడిగినా చెబుతారు.. ఇందులో రాణిస్తే ఎవరి జాతకమైనా మారిపోతుంది.. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది.. కానీ, హైదరాబాద్ లో ‘కాసుల ప్రీమియర్ లీగ్’ నడుస్తోంది.. ఇది పేరుగాంచిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)కు చెడ్డ పేరు తెస్తోంది.
హెచ్ సీఏ అంటే.. మేటి క్రికెటర్లను అందించిన సంఘం.. అది ఒకప్పుడు. ప్రస్తుతం హెచ్ సీఏ అంటే అనేక అక్రమాలు. అవినీతి ఆరోపణలు. తాజాగా వీటికితోడు సంఘంలోని క్లబ్ కార్యదర్శుల చేతివాటం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో 200 వరకు క్లబ్ లు ఉన్నాయి. హైదరాబాద్ అండర్-19, అండర్-23తో పాటు రంజీ ట్రోఫీ వంటి జట్లకు ఆటగాళ్లు ఎంపికవ్వాలంటే ఈ లీగ్ లలో ఆడి ప్రతిభ చాటాలి. ఈ క్లబ్ లకు సెక్రటరీలు (కార్యదర్శులు) ఉంటారు. ఈ ఏడాది మ్యాచ్ లకు సంబంధించి షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. జూన్ లో షెడ్యూల్ రానుంది. 37, 90 జట్లతో ఈ ఏడాది మూడు రోజులు, రెండు రోజుల లీగ్స్ నిర్వహించాలని హెచ్ సీఏ నిర్ణయించింది. దీనికోసం జట్లు ఫీజులు చెల్లించడం మొదలుపెట్టాయి. అయితే, ఇక్కడే క్లబ్ ల అవినీతి గబ్బు బయటపడుతోంది. కొన్ని క్లబ్ లు తమ జట్లను లీజుకు ఇస్తుండగా.. మరికొన్ని మాత్రం ఆటగాళ్ల నుంచి రూ.లక్షలు గుంజుతున్నాయని తెలుస్తోంది. ఇదంతా ఆయా క్లబ్ ల కార్యదర్శులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఎ-డివిజన్ మూడు రోజులు, రెండు రోజుల లీగ్ లలో ఆడేందుకు ఆటగాళ్ల నుంచి హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో అకాడమీలు నడుపుతున్న కోచ్ లు డబ్బులు వసూలు చేస్తున్నారనేది విమర్శ. వీరు జట్లను లీజుకు తీసుకునేందుకు రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ఆ మొత్తాన్ని ఆటగాళ్ల దగ్గర గుంజుతున్నారు. మూడు రోజుల లీగ్ జట్టుకు రూ.20 లక్షలు, రెండు రోజుల లీగ్ జట్టుకు రూ.10 లక్షలు.. ఇదీ మార్కెట్లోని రేటు. దీనికోసం కోచ్ లు ఆటగాళ్ల వద్ద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు తీసుకుంటున్నారు.
