‘GOAT ఇండియా టూర్ 2025’ నిర్వహణ వెనుకున్నదెవరు?
కొన్ని ప్రత్యేక ఈవెంట్లు మొదట్లో అంత ప్రాధాన్యమైనవిగా కనిపించవు. సదరు ఈవెంట్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ దాని స్థాయి ఇట్టే మారిపోవటమే కాదు.. అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది
By: Tupaki Desk | 2 Dec 2025 10:52 AM ISTకొన్ని ప్రత్యేక ఈవెంట్లు మొదట్లో అంత ప్రాధాన్యమైనవిగా కనిపించవు. సదరు ఈవెంట్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ దాని స్థాయి ఇట్టే మారిపోవటమే కాదు.. అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. డిసెంబరు 13న హైదరాబాద్ మహానగరానికి దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీ వస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ ఈవెంట్ ను హైదరాబాద్ కు తీసుకురావటం.. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడించటం.. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యఅతిధిగా హాజరు కావటం లాంటివి షెడ్యూల్ అయ్యాయి.
అనూహ్యంగా ఈ ఈవెంట్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్నచొరవతో ఇప్పుడు ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ రూపురేఖలే మారిపోయిన పరిస్థితి. మెస్సీతో జరిగే మ్యాచ్ కోసం రాత్రిళ్లు సీరియస్ ప్రాక్టీస్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ తీరు చూస్తే.. ఈ మ్యాచ్ విషయంలో ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది అర్థమయ్యేలా చేస్తోంది. GOAT ఇండియా టూర్ 2025 లో భాగంగా కోల్ కతా.. ముంబయి.. ఢిల్లీతో పాటు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పుణ్యమా అని.. ఇప్పుడీ కార్యక్రమం మిగిలిన నగరాలతో పోలిస్తే.. తెలంగాణలో ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది.
ఇంతకూ ఈ భారీ ఈవెంట్ ను నిర్వహిస్తున్నదెవరు? అందులో కీలక భూమిక పోషిస్తున్న వ్యక్తి ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్న వివరాల్లోకి వెళ్లినప్పుడు ఆశ్చర్యకరమైన.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. GOAT ఇండియా టూర్ 2025లో భాగంగా మెస్సీ వెళ్లాల్సిన నగరాల్లో హైదరాబాద్ లేదు. కేరళలో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావటంతో హైదరాబాద్ జాబితాలో చేరటం.. అదిప్పుడు అగ్రస్థానంలో నిలవటం గమనార్హం. ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నది ప్రైవేటు సంస్థ ఇంకేదో కాదు..ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన ‘డిస్ట్రిక్’ అనే స్పోర్ట్స్ టెక్ సంస్థ. దీనికి వ్యవస్థాపకుడు కం సీఈవోగా వ్యవహరిస్తున్న శతద్రు దత్తాకు చెందిన సంస్థనే ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.
సామాన్యులకు సినిమా టికెట్లను..ఈవెంట్ల టికెట్లు బుక్ చేసుకోవటానికి ఉపయోగించే యాప్ గా చెప్పొచ్చు. అయితే శతద్రు దత్తా తన పేరుతోనే ‘‘A Satadru Dutta Initiative’’ అనే పేరుతో మరో సంస్థను నిర్వహిస్తున్నారు. క్రీడా ప్రమోటర్ అయిన ఆయన.. ఈవెంట్ ఆర్గనైజర్ గా మంచి పేరుంది. గతంలో ఆయన తన సంస్థ తరఫున బ్రెజిల్ దిగ్గజ ఫుట్ బాల్ ప్రముఖులు రొనాల్డిన్హోను.. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ ను భారత పర్యటనకు తీసుకొచ్చి.. ఆయా ఈవెంట్లను విజయవంతంగా పూర్తి చేశారు.
ఆ ఈవెంట్లు సక్సెస్ కావటంలో హెచ్ఎస్ బీసీ ఇండియా.. జేఎస్ డబ్ల్యూ గ్రూపు.. దాల్మియా సిమెంట్ వంటి ప్రముఖ భారతీయ సంస్థలు స్పాన్సర్ లుగా వ్యవహరించారు. తాజాగా నిర్వహించే కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ సంస్థను రంగంలోకి దింపి.. ప్రభుత్వం కీలక భూమిక పోషిస్తోంది. ఈ ఈవెంట్ కు అమ్ముడయ్యే టికెట్ల ఆదాయాన్ని సదరు సంస్థ ఖాతాలోకే వెళతాయి.
శతద్రు దత్తా బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే.. థర్టీస్ లో ఉన్న ఈ యువ వ్యాపారవేత్తకు స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్ కం ప్రమోటర్ గా మంచి పేరుంది. ఇతని వ్యక్తిగత వివరాలు బయటకురాకుండా జాగ్రత్తలు తీసుకోవటం శతద్రు దత్తా స్పెషల్ గా చెప్పాలి. అంతర్జాతీయ క్రీడాకారులతో సంప్రదింపులు జరిపి.. ఒప్పందాలు కుదుర్చుకోవటంలో అతడి టాలెంట్ వేరే లెవల్ గా చెబుతారు. క్రీడా ప్రతినిధులతో బలమైన నెట్ వర్కు ఆయన సొంతంగా చెబుతారు.
గతంలో రొనాల్డిన్హో, ఎమిలియానో మార్టినెజ్ వంటి ప్రముఖ క్రీడాకారులతో నిర్వహించిన ఈవెంట్లు సక్సెస్ కావటంతో తన క్రెడిబులిటీని పెంచుకున్న ఆయన.. తన సంస్థకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. దిగ్గజ ఆటగాళ్లతో డీల్ అంటే కోట్లాది రూపాయిలు అవసరం. అయితే.. తన వ్యాపార లావాదేవీలపై పెద్దగా మాట్లాడుకోకుండా ఉండేలా చేయటం.. తాను నిర్వహించే ఈవెంట్ మాత్రమే ఎక్కువ ఫోకస్ అయ్యేలా చేసే టాలెంట్ శతద్రు సొంతంగా చెప్పాలి.
పొలిటికల్ గా ఏ రాజకీయ పార్టీతో ప్రత్యేకంగా అనుబంధం ఉందన్న భావన కలగకుండా చేసుకోవటంలో నేర్పుగా వ్యవహరిస్తుంటారు. తాను ఈవెంట్ ప్లాన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకోవటం.. కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసే విషయంలో ఆయన ప్రదర్శించే దూకుడు.. చురుకుదనం ఇస్పెషల్ గా చెప్పాలి. ఇంత చేసినా.. తాను పెద్దగా ఫోకస్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం శతద్రు దత్తా విలక్షణతగా చెప్పాలి.
