బీసీసీఐ ఫొటో: టీమ్ ఇండియా శిబిరంలో క్రికెటర్ ను పోలిన క్రికెటర్
భారత సీనియర్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి రెండో టెస్టును ఆడనుంది.
By: Tupaki Desk | 2 July 2025 5:00 AM ISTక్రికెట్ విధాన నిర్ణయాలు మాత్రమే కాదు.. క్రికెట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడం.. ప్రాక్టీస్ విశేషాలు.. విజయోత్సవ సంబరాలు.. ప్రత్యేకతలు, రికార్డులు.. ఇలా అన్నీ పంచుకుంటూ ఉంటుంది బోర్డు. ప్రపంచంలోనే ధనిక బోర్డు అయిన బీసీసీఐ ఇప్పుడు ఎంత చెబితే మిగతా దేశాలకు అంత. అలాంటి బీసీసీఐ తాజాగా ఓ ఫన్నీ ఫొటో షేర్ చేసింది. అందులో ఉన్న ఇద్దరు క్రికెటర్లు ఒకేలా ఉండడం దీని ప్రత్యేకత.
భారత సీనియర్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి రెండో టెస్టును ఆడనుంది. తొలి టెస్టులో ఓటమి నేపథ్యంలో టీమ్ ఇండియాకు ఇది చాలా కీలకమైన మ్యాచ్. ఈ నేపథ్యంలో ముమ్మరంగా ప్రీక్టీస్ చేస్తోంది. కెప్టెన్ శుబ్ మన్ గిల్ ప్రత్యేకంగా ఓ స్పిన్ బౌలర్ ను తీసుకొచ్చారు. అతడి పేరు హర్ ప్రీత్ బ్రార్. ఇతడు ఎవరో కాదు పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన చేసిన ఎడమచేతి వాటం స్పిన్నర్. బహుశా వైవిధ్యమైన బౌలింగ్ స్టయిల్ ను పరీక్షించేందుకే గిల్.. తన రాష్ట్రానికే చెందిన బ్రార్ ను పిలిపించాడు అనుకోవాలి.
బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ లో రెండో టెస్టు బుధవారం నుంచి జరగనుండగా.. ట్రయినింగ్ సెషన్ లో ముఖ కవళికలు ఒకేలా ఉన్న ఇద్దరు ఆటగాళ్లు కనిపించారు. ఆ ఇద్దరిలో ఒకరు హర్ ప్రీత్ బ్రార్ కాగా.. మరొకరు జగ్జీత్ సింగ్ సంధు. ఈ జగ్జీత్ సింగ్ ఎవరో తెలియదు కానీ, బహుశా ఇంగ్లండ్ లో స్థిరపడిన సిక్కు కుటుంబానికి చెందినవాడు అయి ఉంటాడు. ప్రాక్టీస్ సెషన్ లో బ్యాట్స్ మెన్ కు బంతులు వేసేందుకు ఇతడిని పిలిచి ఉంటారని భావించవచ్చు. మరోవైపు బుధవారం నాటి మ్యాచ్ లో టీమ్ ఇండియా తరఫున పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ అరంగేట్రం చేసే చాన్సుంది. బీసీసీఐ షేర్ చేసిన ఫొటోలో అతడు కూడా ఉంటే ముగ్గురూ ఒకేలా కనిపించేవారు.