Begin typing your search above and press return to search.

అండర్ 19లో టీమిండియాను దెబ్బకొట్టింది.. 'ఇండియనే'

హర్జాస్ సింగే భారత జట్టు ఓటమికి కారణం. ఆస్ట్రేలియా 99 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఎడమచేతి వాటం బ్యాటర్ హర్జాస్.. దూకుడుగా ఆడాడు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 5:42 AM GMT
అండర్ 19లో టీమిండియాను దెబ్బకొట్టింది.. ఇండియనే
X

పోయింది.. ఇది కూడా పోయింది.. ప్రపంచ చాంపియన్ చాన్స్ మరోసారి పోయింది.. టీమిండియా అండర్ 19 కుర్రాళ్లు తేలిపోయారు. ప్రత్యర్థి చేతిలో ఓడిపోయారు. కచ్చితంగా గెలుస్తారనుకుని.. కప్ కొట్టేస్తారని అనుకుంటే చేతులెత్తేశారు. మన బ్యాటర్ల వైఫల్యం.. ప్రత్యర్థి బౌలర్ల నైపుణ్యం మధ్య జరిగిన పోటీలో ప్రత్యర్థి వారే నెగ్గారు. ఆదివారం నాటి ప్రపంచ కప్ ఫైనల్ ను ఓ బ్యాడ్ మ్యాచ్ అనుకుని ముందుకుసాగిపోవడమే ఇక మనం చేయాల్సింది.

టోర్నీ మొత్తం అదరగొట్టి..

అండర్ 19 ప్రపంచ కప్ లో టీమిండియా కుర్రాళ్లు ఆసాంతం నిలకడ చూపారు. సెమీఫైనల్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఓడించారు. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా ఆల్ రౌండ్ ఆటకు తలొంచారు. వాస్తవానికి సెమీస్ లో పోరాడిన తీరును బట్టి చూస్తే ఫైనల్లో మన జట్టుదే విజయం అనిపించింది. కానీ, ఆస్ట్రేలియా పట్టు విడవలేదు. మొదట బ్యాటింగ్ లో వెనుకబడిన కంగారూలు ఆపై పుంజుకుని భారీ స్కోరు (అండర్ 19 స్థాయికి) చేశారు. ఆపై బ్యాటింగ్ లో భారత కుర్రాళ్లు కుదురుకోకుండా చేశారు. దీంతో టోర్నీ మొత్తం బాగా ఆడిన భారత్ ఫైనల్లో ఓడింది.

అతడు మనోడే..

అండర్ 19 ఫైనల్లో ఆస్ట్రేలియా తరఫున ఏకైక హాఫ్ సెంచరీ సాధించినది హర్జాస్ సింగ్. మ్యాచ్ మొత్తంలోనే ఇతడొక్కడే హాఫ్ సెంచరీ కొట్టాడు. హర్జాస్ సింగే భారత జట్టు ఓటమికి కారణం. ఆస్ట్రేలియా 99 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఎడమచేతి వాటం బ్యాటర్ హర్జాస్.. దూకుడుగా ఆడాడు. మూడు ఫోర్లు, మూడు సిక్స్ లతో 64 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. అప్పటివరకు నెమ్మదిగా సాగుతున్న ఆసీస్ ఇన్నింగ్స్ కు ఇతడే ఊపునిచ్చాడు. హర్జాస్ ను త్వరగా ఔట్ చేసి ఉంటే ఆసీస్ 200 పరుగులకే పరిమితం అయ్యేదనడంలో సందేహం లేదు.

ఎవరీ హర్జాస్..

హర్జాస్ సింగ్ తల్లిదండ్రులది భారత్ లోని చండీగఢ్. తండ్రి ఇంద్రజీత్ సింగ్ పంజాబ్ బాక్సింగ్ చాంపియన్. తల్లి అర్వింద్ కౌర్ లాంగ్ జంప్ అథ్లెట్. ఇద్దరూ రాష్ట్ర స్థాయిలో రాణించారు. అయితే, ఇంద్రజీత్ 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. వారికి 2005లో సిడ్నీలో హర్జాస్ పుట్టాడు. అక్కడి రెవెస్బీ వర్కర్స్‌ క్రికెట్‌ క్లబ్‌లో 8 ఏళ్ల వయసులో చేరాడు హర్జాస్. అలాఅలా.. పదేళ్లలో అండర్ 19 స్థాయికి వచ్చాడు. వాస్తవానికి ప్రపంచకప్‌లో అతడు ఆడింది ఏమీ లేదు. ఫైనల్ కు ముందు కప్ లో అత్యధిక స్కోరు 17 పరుగులే. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 49 పరుగులే చేశాడు. కానీ ఫైనల్లో మాత్రం భారత్ కొంపముంచాడు. విశేషం ఏమంటే.. హర్జాస్ పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు. కాగా, హర్జాస్ బంధువులు పంజాబ్‌ లో ఉన్నారు. చివరగా 9 ఏళ్ల కిందట అతడు భారత్‌ కు వచ్చాడు.