హార్దిక్ పాండ్యాకు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్.. కొత్త కెప్టెన్ అతడే?
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన.. అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంచైజీలలో ఒకటైన ముంబై ఇండియన్స్ (ఎంఐ) లో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
By: A.N.Kumar | 29 May 2026 11:33 AM ISTఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన.. అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంచైజీలలో ఒకటైన ముంబై ఇండియన్స్ (ఎంఐ) లో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో జట్టు ప్రదర్శన ఘోరంగా విఫలమైన నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ముంబై మేనేజ్‌మెంట్ తీవ్ర స్థాయిలో సమీక్ష చేపట్టినట్లు జాతీయ మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. కేవలం కెప్టెన్సీ మార్పు మాత్రమే కాకుండా హార్దిక్‌ను అసలు ఆటగాడిగా జట్టులో కొనసాగించాలా? లేదా? అనే అంశంపైనా యాజమాన్యం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
ఆశలు అడుగంటిన 2026 సీజన్
రోహిత్ శర్మ స్థానంలో ఎన్నో అంచనాలు, వివాదాల మధ్య ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయాడు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ 2026 సీజన్‌లో ఆడిన 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఏకంగా 10 మ్యాచ్‌ల్లో పరాజయం పాలై పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ముంబై లాంటి స్టార్-స్టడెడ్ జట్టు ఇంతలా చేతులెత్తేయడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
మరోవైపు ఈ సీజన్ ముగిసిన కొద్ది రోజులకే హార్దిక్ పాండ్యా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేయడం క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. జట్టు వైఫల్యం, నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శల వల్లే పెరిగిన ఒత్తిడి తట్టుకోలేక హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టైటాన్స్ టు ముంబై.. మారిన లక్
వాస్తవానికి హార్దిక్ పాండ్యా నాయకత్వ సామర్థ్యాలపై గతంలో ఎలాంటి సందేహాలు లేవు. 2022లో ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, తొలి సీజన్‌లోనే టైటిల్ అందించాడు. ఆ తర్వాత సీజన్‌లో రన్నరప్‌గా నిలిపాడు. ఈ అద్భుతమైన రికార్డును చూసే ముంబై యాజమాన్యం భారీ ట్రేడింగ్ ద్వారా అతడిని తిరిగి జట్టులోకి తెచ్చుకుని మరీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ ముంబై క్యాంప్‌లో పరిస్థితులు హార్దిక్‌కు ఏమాత్రం కలిసిరాలేదు.
2024లో హార్దిక్ కెప్టెన్ అయినప్పటి నుంచే ముంబై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వాంఖడే స్టేడియంలో సొంత అభిమానులే అతడిని బూ కొట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సీజన్‌లో జట్టు పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 2025లో ప్లేఆఫ్స్ చేరి కొద్దిగా కోలుకున్నట్లు కనిపించినా.. మళ్లీ 2026లో ముంబై ఘోరంగా విఫలం కావడంతో హార్దిక్ కెప్టెన్సీ వైఫల్యాలు మరోసారి చర్చకు వచ్చాయి.
సీనియర్ల అసంతృప్తి.. అంతర్గత విబేధాలు?
అయితే ముంబై ఇండియన్స్ వైఫల్యానికి కారణం కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదని అంతర్గత వర్గాల సమాచారం. మేనేజ్‌మెంట్, కోచింగ్ స్టాఫ్ సూచించిన వ్యూహాలను జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు పెద్దగా పట్టించుకోలేదని, గ్రూపిజం వల్లే జట్టు ప్రదర్శన దెబ్బతిన్నదని టాక్ నడుస్తోంది. రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ మైదానంలో జట్టుగా వారు సమిష్టి ప్రదర్శన చేయలేకపోయారు.
రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ భవిష్యత్తు?
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఫ్రాంచైజీ ప్రక్షాళనపై సమగ్ర సమీక్షకు సిద్ధమవుతోంది. హార్దిక్‌ను కెప్టెన్‌గా తొలగించి కేవలం ఆటగాడిగా ఉంచాలా? లేదా మెగా వేలానికి ముందే అతడిని జట్టు నుంచి పూర్తిగా రిలీజ్ చేయాలా? అనే అంశాలపై తీవ్ర చర్చలు నడుస్తున్నాయి.
ఇదే సమయంలో జట్టుకు కొత్త సారథిని ఎంపిక చేసే విషయంలో మాజీ విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయం అత్యంత కీలకంగా మారనుందని ఇన్‌సైడ్ టాక్. రోహిత్ సూచించే సీనియర్ ప్లేయర్‌కే బుమ్రా లేదా సూర్యకుమార్ కెప్టెన్సీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది.
ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గానీ, హార్దిక్ పాండ్యా గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, రాబోయే రోజుల్లో ముంబై జట్టులో ఊహించని మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముంబై ఇండియన్స్ తదుపరి అడుగు ఎటువైపో చూడాలి మరి!
