బయటివాళ్లకు ఏం తెలుసు బంతి తగిలిన బాధ.. తిలక్ పై హార్దిక్ కామెంట్స్
కాగా లక్నో తో మ్యాచ్ లో తిలక్ వంటి దూకుడైన బ్యాటర్ ను ‘రిటైర్డ్ ఔట్’గా ముంబై వెనక్కుపిలవడం తీవ్ర చర్చనీయాంశం అయింది.
By: Tupaki Desk | 8 April 2025 1:30 PMప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యంత తీవ్రమైన విషయం కంకషన్. అంటే బంతి తలకు తగలడం. 2014లో ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిల్ హ్యూజ్ బంతి తలకు తగిలి అనూహ్యంగా మరణించడం విషాదం నింపింది. అప్పటినుంచి కంకషన్ ను తీవ్రంగా పరిగణించి.. కొత్త నిబంధనలను తీసుకొచ్చారు.
2019లో ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ లో టూర్ చేసినప్పుడు పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ కంకషన్ కు గురయ్యాడు. తరచూ అలాంటివి జరుగుతూనే ఉన్నా.. ప్రస్తుత ఐపీఎల్ లో చర్చనీయాంశం అయింది. ఎందుకంటే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కారణంగా.
బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్ లలో ఓడిన ముంబై ఇండియన్స్ తమ కీలక బ్యాటర్ అయిన తిలక్ ను ఆర్డర్ లో ముందుకు పంపడం లేదు. వాస్తవానికి తిలక్ టి20ల్లో వన్ డౌన్ లో వస్తున్నాడు. అతడి కోసం టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన వన్ డౌన్ ను త్యాగం చేశాడు.
ఐపీఎల్ లో మాత్రం సూర్యనే ముందుగా వస్తున్నాడు. ముంబై సోమవారం నాలుగో మ్యాచ్ లోనూ ఓడిపోయింది. తిలక్ వర్మ (56), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (42) చాలా గట్టిగా పోరాడినా ఫలితం లేకపోయింది. లక్నో పై గత మ్యాచ్ లో తరహాలోనే బెంగళూరుపైనా ముంబై 12 పరుగుల తేడాతోనే ఓడింది. దీన్నిబట్టే ముంబై బ్యాటింగ్ లోనే లోపం ఉందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం. ఇప్పటికే ఒక మ్యాచ్ లో గాయం అని చెప్పి తప్పించి, బెంగళూరుపై ఆడించినా రోహిత్ (17) విఫలం అయ్యాడు.
కాగా లక్నో తో మ్యాచ్ లో తిలక్ వంటి దూకుడైన బ్యాటర్ ను ‘రిటైర్డ్ ఔట్’గా ముంబై వెనక్కుపిలవడం తీవ్ర చర్చనీయాంశం అయింది. హార్దిక్, ముంబై కోచ్ మహేల జయవర్దనె దీనిపై వివరణ కూడా ఇచ్చారు. అదే తిలక్ దూకుడుగా ఆడి సోమవారం బెంగళూరుపై హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో రిటైర్డ్ ఔట్ నిర్ణయం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో హార్దిక్ మరోసారి నోరు విప్పాడు.
ముంబై వాంఖడేలో జరిగిన సోమవారం మ్యాచ్ ను ప్రస్తావిస్తూ. . తమ బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్దగా ఆప్షన్లు లేని సంగతి గుర్త చేశాడు. నమన్ ధిర్ చివర్లో వస్తాడని.. గత మ్యాచ్ లో మాత్రం రోహిత్ లేనందున ముందుగా వచ్చాడని తెలిపాడు. తిలక్ కూడా అద్భుతంగా ఆడాడని.. గత మ్యాచ్ లో చాలా విషయాలు జరిగాయని.. బయటి వ్యక్తులు ఎన్నో మాటలు మాట్లాడారని.. కానీ, లక్నోతో మ్యాచ్ కంటే ముందు రోజు తిలక్ కు బంతి బలంగా తాకిందని పేర్కొన్నాడు. వేలికి గాయం కూడా ఉండడంతో దూకుడుగా ఆడలేకపోయాడని చెప్పాడు. కోచ్ నిర్ణయం మేరకు తిలక్ ను పిలిపించి కొత్త బ్యాటర్ తో దాడికి దిగాలని చూశామని హార్దిక్ తెలిపాడు.