Begin typing your search above and press return to search.

ఆంధ్రాకు ఆడ‌న‌ని శ‌ప‌థం.. త్రిపుర‌కు వెళ్లిపోయిన క్రికెట‌ర్

స‌రిగ్గా ఎన్నిక‌ల ముంగిట గ‌త ఏడాది ఆంధ్రా-హైద‌రాబాద్ క్రికెట‌ర్ హ‌నుమ విహారి భారీ సంచ‌ల‌నం రేపాడు

By:  Tupaki Desk   |   28 Aug 2025 12:00 PM IST
ఆంధ్రాకు ఆడ‌న‌ని శ‌ప‌థం.. త్రిపుర‌కు వెళ్లిపోయిన క్రికెట‌ర్
X

స‌రిగ్గా ఎన్నిక‌ల ముంగిట గ‌త ఏడాది ఆంధ్రా-హైద‌రాబాద్ క్రికెట‌ర్ హ‌నుమ విహారి భారీ సంచ‌ల‌నం రేపాడు. అప్ప‌టి అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ చోటా నాయ‌కుడి మీద ఆరోప‌ణ‌లు చేస్తూ.. భ‌విష్య‌త్తులో ఇంకెప్పుడూ ఆంధ్రాకు ఆడ‌ను అని భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశాడు. వాస్త‌వానికి ఆ స‌మ‌యంలో విహారి ఆంధ్రా జ‌ట్టు కెప్టెన్. దేశ‌వాళీ క్రికెట్ లో కీల‌క‌మైన‌ రంజీ ట్రోఫీ జ‌రుగుతోంది. అలాంటి స‌మ‌యంలో విహారి ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ (ఏసీఏ)లో అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కులు, వారి ద‌గ్గ‌రివారు హ‌వా సాగిస్తుండ‌డంతో చివ‌ర‌కు అప్ప‌టి ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌చ్చింది. అదంతా ప‌క్క‌న‌పెడితే... ఏపీలో ప్ర‌భుత్వం మారాక సైతం విహారి నిరుడు ఆంధ్రాకే ఆడాడు. ఇప్పుడు మాత్రం ఆంధ్రాను వీడి వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నాడు.

ఈశాన్య రాష్ట్రం త‌ర‌ఫున‌..

ఆంధ్రాలో పుట్టి హైద‌రాబాద్ లో పెరిగి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్ సీఏ) ద్వారా వెలుగులోకి వ‌చ్చాడు విహారి. తొలుత‌ హైద‌రాబాద్ కు రంజీల్లో ఆడిన అత‌డు.. అనంత‌రం ఆంధ్రాకు మారాడు. 2004 ప్రారంభంలో వివాదం కార‌ణంగా ఆ జ‌ట్టును వీడ‌తాన‌ని ప్ర‌క‌టించినా, గ‌త సీజ‌న్ కూడా ఆడాడు. ఇప్పుడు మాత్రం ఈశాన్యం రాష్ట్రం త్రిపుర‌కు మారుతున్నాడు. 2025-26 దేశ‌వాళీ సీజ‌న్ లో ఆ రాష్ట్రం నుంచి ఆడ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ మేర‌కు ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ... విహారికి నిర‌భ్యంత‌ర ప‌త్రం జారీ చేసింది.

ఏపీఎల్ టాప‌ర్..

టి20 లీగ్ ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్ (ఏపీఎల్) ఇటీవ‌ల జ‌రిగింది. ఇందులో విహారినే ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ. అయినా అత‌డికి టి20 ఫార్మాట్ లో ఆంధ్రా జ‌ట్టులో చోటుపై హామీ ద‌క్క‌లేదు. మూడు ఫార్మాట్ల‌లో ఆడాల‌నేది విహారి కోరిక‌. దీంతోనే త్రిపుర‌కు వెళ్లాడు. వ‌న్డే, టి20 ఫార్మాట్ల‌లో ఏసీఏ యువ ఆట‌గాళ్ల కోసం చూస్తోందని 32 ఏళ్ల విహారి తెలిపాడు. అందుక‌నే అత‌డికి అవ‌కాశాలు ఇవ్వ‌లేమ‌ని ఏసీఏ స్ప‌ష్టం చేసింది.

విహారికి లాస్.. త్రిపుర‌కు బ‌లం...

ఈశాన్య రాష్ట్ర‌మైన త్రిపుర రంజీ ట్రోఫీలో ఎలైట్ సి లో ఉంది. ఆంధ్రా మాత్రం ఎలైట్ ఎలో ఉంది. ఈలెక్క‌న చూస్తే వ్య‌క్తిగ‌తంగా విహారికి న‌ష్ట‌మే అని చెప్పాలి. దేశ‌వాళీల్లో బ‌ల‌మైన ఆంధ్రాకు కూడా న‌ష్ట‌మే. పెద్దగా పేరు లేని త్రిపుర‌కు మాత్రం క‌చ్చితంగా లాభం. విహారి వంటి అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ రాక ఆ జ‌ట్టుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.