Begin typing your search above and press return to search.

ఒక్క తప్పు.. దొమ్మరాజు గుకేశ్.. "రాజు" అయ్యే అవకాశం చేజార్చింది

గత వారం గుకేశ్ చేతిలో కార్ల్ సన్ ఓడిపోయిన వీడియోలు హల్ చల్ చేశాయి. ఆ అసహనంలో కార్ల్ సన్ ప్రవర్తించిన తీరు వైరల్ అయింది.

By:  Tupaki Desk   |   7 Jun 2025 7:40 PM IST
ఒక్క తప్పు.. దొమ్మరాజు గుకేశ్.. రాజు అయ్యే అవకాశం చేజార్చింది
X

విశ్వనాథన్ ఆనంద్.. తెలుగు తేజాలు హరిక్రిష్ణ.. కోనేరు హంపి.. తర్వాత ఆ స్థాయిలో భారత చదరంగాన్ని ఏలుతాడని పేరు తెచ్చుకున్నాడు గుకేశ్ దొమ్మరాజు. తమిళనాడులో స్థిరపడిన తెలుగు మూలాలున్న కుటుంబానికి చెందిన ఈ కుర్రాడు ఆరు నెలల కిందట ప్రపంచ చదరంగ తెరపై మెరిశాడు. అత్యంత చిన్న వయసులో (18 ఏళ్ల 8 నెలల 14 రోజులు) ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు. తాజాగా నార్వే చెస్ టోర్నీలోనూ దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్ సన్ ను ఓడించి సంచలనం రేపాడు. దీంతో ఈ టోర్నో గుకేశ్ చాంపియన్ కావడం ఖాయమని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అతడు వెనుకబడ్డాడు.

గత వారం గుకేశ్ చేతిలో కార్ల్ సన్ ఓడిపోయిన వీడియోలు హల్ చల్ చేశాయి. ఆ అసహనంలో కార్ల్ సన్ ప్రవర్తించిన తీరు వైరల్ అయింది. అదే సమయంలో కూల్ గా అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన గుకేశ్ మీమ్స్ సోషల్ మీడియాలో అదరగొట్టాయి. కానీ, ఈ వారం వచ్చేసరికి గుకేశ్ కు షాక్ తగిలింది. అతడి ఆటకు అనూహ్యంగా ’చెక్’ పడింది. దీంతో చాంపియన్ అయ్యే అవకాశం చేజారింది.

నార్వే చెస్ టోర్నీలో గుకేశ్ గెలుపు అంచుల వరకు వెళ్లాడు. చివర్లో చేసిన చిన్న తప్పిదంతో ఓడిపోయాడు. ఈ టోర్నీ పదో రౌండ్ కు ముందు గుకేశ్.. కార్ల్ సన్ మధ్య తేడా అర పాయింటే. గుకేశ్ కనీసం డ్రా చేసినా టైటిల్ కొట్టేవాడు. కానీ, అమెరికా గ్రాండ్‌ మాస్టర్ ఫాబియానో కరువానాతో ఆఖరి గేమ్ లో ఓడిపోయాడు. చివరి క్షణాల్లో తీవ్ర సమయ ఒత్తిడిలో నైట్ ఫోర్క్‌ కు చిక్కిన గుకేశ్ వెంటనే ఓటమి అంగీకరించాడు. దీంతో టైటిల్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ గేమ్‌ అనంతరం తీవ్రంగా దిగులు చెందిన గుకేశ్ కుర్చీలోనే కూర్చుండిపోయాడు. చిన్న తప్పిదమే తనను టైటిల్ కు దూరంచేసిందన్న బాధలో కనిపించాడు. ఇక గుకేశ్ చేతిలో ఓడినప్పటికీ.. మిగతా మ్యాచ్ లలో పైచేయి సాధించిన కార్ల్ సన్ టైటిల్ కొట్టాడు.

కనీసం అమెరికా ఆటగాడితో మ్యాచ్ డ్రా చేసుకున్నా.. గుకేశ్ టైటిల్ కొట్టేవాడు. కానీ, అన్నిసార్లూ మనదే పైచేయి కాదుగా..? ఇక గుకేశ్ ఆటతీరును దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ విశ్లేషించాడు. ప్రత్యర్థి తప్పు చేసేవరకు ఓపికగా ఎదురుచూసి పైచేయి సాధించడంలో గుకేశ్ ది ప్రత్యేక నైపుణ్యం అని కొనియాడాడు. గొప్ప డిఫెన్స్ తో.. పూర్తిగా ఆశలు లేని పరిస్థితుల్లోనూ ఆడుతూ పోవడం గుకేశ్ లోని ఉత్తమ లక్షణం అని అభివర్ణించాడు. నార్వే టోర్నీలో ఇలాగే రెండు గేమ్ లు ఆడాడని.. ప్రతిసారీ ఇలాగే అయితే కుదరదని కూడా హెచ్చరించాడు. తాను కూడా ఆ పద్ధతిని హర్షించనని పేర్కొన్నాడు.