Begin typing your search above and press return to search.

రోహిత్.. కోహ్లి లేకపోవడం పెద్ద కుదుపే.. కుర్ర కెప్టెన్ గిల్ వ్యాఖ్య

ఈ శతాబ్దంలో చిన్న వయసు కెప్టెన్ గా కఠినమైన పెద్ద బాధ్యత (5 టెస్టుల ఇంగ్లండ్ టూర్)ను మోయబోతున్నాడు శుబ్ మన్ గిల్.

By:  Tupaki Desk   |   7 Jun 2025 12:15 AM IST
రోహిత్.. కోహ్లి లేకపోవడం పెద్ద కుదుపే.. కుర్ర కెప్టెన్ గిల్ వ్యాఖ్య
X

ఈ శతాబ్దంలో చిన్న వయసు కెప్టెన్ గా కఠినమైన పెద్ద బాధ్యత (5 టెస్టుల ఇంగ్లండ్ టూర్)ను మోయబోతున్నాడు శుబ్ మన్ గిల్. ఇప్పటివరకు టెస్టుల్లో తనను తాను నిరూపించుకోని గిల్ కు.. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నట్లు తొలి సిరీస్ కఠినమైనది కానుంది. పైగా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకుండా ఆడాల్సిన పరిస్థితి. గత 15 ఏళ్లలో వీరిద్దరిలో ఒక్కరు కూడా లేకుండా టీమ్ ఇండియా విదేశీ టూర్ చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బయల్దేరుతూనే గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

25 ఏళ్ల వయసులోనే టెస్టు కెప్టెన్ అయి.. ఈ శతాబ్దంలో (2000 తర్వాత) చిన్న వయసులోనే సారథి అయిన వాడిగా గిల్ రికార్డులకు ఎక్కాడు. అయితే, మున్ముందు అతడికి ఏమీ పూల బాట కాదు. ఇంగ్లండ్ వంటి చోట ఒక్క టెస్టు గెలిస్తేనే గొప్ప. రోహిత్, కోహ్లి లేకుండా గిల్ ఐదు మ్యాచ్ ల పెద్ద సిరీస్ ను ఎలా నెగ్గుకొస్తాడో అని ఆసక్తిగా చూస్తున్నారు.

ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే రోహిత్, కోహ్లిలు టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై గిల్ మాట్లాడుతూ వారిద్దరూ దిగ్గజాలని కొనియాడాడు. వారి లోటు కారణంగా జట్టు కుదుపులకు లోనకాకుండా చూస్తానని గిల్ చెబుతున్నాడు.

రోహిత్, కోహ్లి లేనందున అనే కాదు.. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్న గిల్.. దీనిని ఎదుర్కొనడం సవాల్ అని చెప్పాడు.

కాగా, ఇంగ్లండ్ టూర్ లో గిల్ కు సహచరుల నుంచి అందే మద్దతు కీలకం కానుంది. అత్యంత సీనియర్ అయిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు.. పదేళ్లకు పైగా అనుభవం ఉన్న ఏకైక బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్, మేటి పేసర్ బుమ్రా ఏవిధంగా సాయపడతారో చూడాలి. మరోవైపు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ బాధ్యతలు కూడా కీలకం. గిల్ కు అండగా పంత్ రాణిస్తే టీమ్ ఇండియా విజయం సాధించడం తేలికే.

కాగా.. నాయకుడిగా.. ఆటగాళ్ల స్థానాలకు ముప్పు లేదు అని చాటి చెప్పి వారిని స్వేచ్ఛగా ఆడేలా చేస్తానని గిల్ అంటున్నాడు. ఈ క్రమంలో కమ్యూనికేషన్ చాలా కీలకంగా పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం బాగుంటే అంతా బాగున్నట్లేనని తెలిపాడు.