Begin typing your search above and press return to search.

గౌత‌మ్ గంభీర్...హెడ్ కోచ్ కాదు.. హెడ్ఏక్?

42 ఏళ్ల‌కే టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి..! స‌హ‌చ‌ర క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఇంకా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతుంటే, గౌత‌మ్ గంభీర్ కు మాత్రం అత్యంత పెద్ద బాధ్య‌త ద‌క్కింది.

By:  Tupaki Desk   |   19 Jan 2026 9:53 AM IST
గౌత‌మ్ గంభీర్...హెడ్ కోచ్ కాదు.. హెడ్ఏక్?
X

42 ఏళ్ల‌కే టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి..! స‌హ‌చ‌ర క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఇంకా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతుంటే, గౌత‌మ్ గంభీర్ కు మాత్రం అత్యంత పెద్ద బాధ్య‌త ద‌క్కింది. ఐపీఎల్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) కెప్టెన్ గా, కోచ్ గా విజ‌య‌వంత‌మైన గంభీర్ కు ఏడాదిన్న‌ర కింద‌ట జాతీయ జ‌ట్టు కోచ్ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ప్పుడు అంతా పాజిటివ్ గా క‌నిపించింది. స‌రిగ్గా దీనికిముందు దిగ్గ‌జ క్రికెట‌ర్ రాహుల్ ద్ర‌విడ్ హెడ్ కోచ్ గా మ‌న జ‌ట్టు టి20 ప్ర‌పంచ క‌ప్ చాంపియ‌న్ గా నిలిచింది. దీంతో గంభీర్ కు శుభ‌శ‌కునాలే అనిపించింది. కానీ, నేడు చూస్తే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స‌రైన నిర్ణ‌య‌మే తీసుకుందా? అనే అనుమాన‌లు వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో టెస్టులు, వ‌న్డేల్లో ఎదురైన ప‌రాజ‌యాలే (ప‌రాభ‌వాలు) దీనికి కార‌ణం అనుకోవాలి. అస‌లు గంభీర్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి వ‌న్డే సిరీస్ (2024 శ్రీలంక టూర్)లోన చేదు అనుభ‌వం ఎదురైంది. స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను ఈ సిరీస్ కు ఎంపిక చేయ‌లేదు. ఎందుక‌నో కార‌ణం చెప్ప‌లేదు. టి20 ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం ఈ ఫార్మాట్ కు వీడ్కోలు ప‌లికి.. శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్ కు దూరంగా ఉందాం అనుకున్న స్టార్ బ్యాట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిల‌ను ఒప్పించి మ‌రీ ర‌ప్పించారు. కానీ, ఫ‌లితం... 0-2తో సిరీస్ ను కోల్పోయింది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ టైగా ముగిసింది. లేదంటే ఫ‌లితం కాస్త అటుఇటు అయి 0-3తో ఓడిపోయేదేమో? అన్న‌ట్లు.. 27 ఏళ్ల త‌ర్వాత శ్రీలంక‌.. భార‌త్ పై వ‌న్డే సిరీస్ గెలిచింది ఈ సిరీస్ లోనే.

ఇన్ని ప‌రాజయాలా?

గంభీర్ మంచి ఆట‌గాడే. దేశం ప‌ట్ల విప‌రీత‌మైన భ‌క్తి క‌ల‌వాడు కూడా. బీజేపీ త‌ర‌ఫున 2019లో ఢిల్లీ నుంచి ఎంపీగానూ గెలిచాడు. కానీ, అవ‌న్నీ వేరు. మైదానంలో ఆట వేరు. అత‌డి కోచింగ్ లో శ్రీలంక‌లో వ‌న్డే సిరీస్ ఓట‌మి త‌ర్వాత బంగ్లాదేశ్ వంటి బ‌ల‌హీన జ‌ట్టుపై రెండు టెస్టుల‌ సిరీస్ గెలిచి ప‌ర్లేదు అనిపించింది టీమ్ ఇండియా. కానీ, ఆ వెంట‌నే జ‌రిగిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్ లో ఎన్న‌డూ లేనివిధంగా 0-3తో ఓడింది. చ‌రిత్ర‌లో తొలిసారి ఓ విదేశీ జ‌ట్టు చేతిలో క్లీన్ స్వీప్ అయింది. అది కూడా ఎన్న‌డూ టెస్టు సిరీస్ గెల‌వ‌ని న్యూజిలాండ్ చేతిలో కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ దెబ్బ భార‌త టెస్టు జ‌ట్టుపై బ‌లంగానే ప‌డింది. 2024 చివ‌ర‌ల్లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో 1-3తో టెస్టు సిరీస్ ను కోల్పోయింది. ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైన‌ల్ కు చేర‌లేక‌పోయింది. దీంతో స్టార్ క్రికెట‌ర్లు స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్, దిగ్గ‌జ బ్యాట‌ర్లు రోహిత్ శ‌ర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లిలు టెస్టుల‌కు గుడ్ బై చెప్పారు. 2025లో ఇంగ్లండ్ టూర్ లో 2-2తో సిరీస్ ను స‌మం చేసుకున్నా.. స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికా చేతిలో 0-2తో ఓట‌మి మాత్రం అంద‌రినీ బాధించింది. తాజాగా న్యూజిలాండ్ చేతిలో 2-1తో వ‌న్డే సిరీస్ ను కోల్పోయింది. చ‌రిత్ర‌లో న్యూజిలాండ్ తొలిసారి భార‌త్ లో వ‌న్డే సిరీస్ గెలిచింది. గ‌త ఏడాది చివ‌ర్లో ఆస్ట్రేలియా టూర్ లోనూ భార‌త జ‌ట్టు వ‌న్డే సిరీస్ ను 1-2 తేడాతో ఓడిపోయిన సంగ‌తి మ‌ర్చిపోకూడ‌దు.

ఆ పోస్టుకు త‌గిన‌వాడేనా?

ఇన్ని చారిత్రక ఓట‌ముల త‌ర్వాత గౌత‌మ్ గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వికి త‌గిన‌వాడేనా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. మైదానంలో జ‌ట్టు ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌కు కోచ్ కు సంబంధం లేద‌ని ఒప్పుకొందాం. కానీ, గంభీర్ తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు అత‌డిని ప్ర‌శ్నించ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి క‌ల్పిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఆట‌గాళ్ల‌ ఎంపిక‌లో కొంద‌రి ప‌ట్ల గంభీర్ మ‌రీ ఇష్టం చూపుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పేస్ ఆల్ రౌండ‌ర్ హ‌ర్షిత్ రాణాను దీనికి ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. కేకేఆర్ స‌భ్యుడైన హ‌ర్షిత్ రాణాకు ప్ర‌తిభ‌కు మించి అవ‌కాశాలు ఇవ్వ‌డం వెనుక గంభీర్ ఉన్నాడ‌ని అంటున్నారు. సీనియ‌ర్ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ ష‌మీ దేశ‌వాళీల్లో నిల‌క‌డ‌గా రాణిస్తున్నా ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై అభిమానులు మండిప‌డుతున్నారు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్ మ‌రీ కుర్రాడు కావ‌డంతో టీమ్ ఇండియా తుది జ‌ట్టులో గంభీర్ ప్ర‌మేయం ఎక్కువైన‌ట్లుగానూ క‌నిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా దేశం త‌ర‌ఫున‌ విజ‌యాలు సాధించ‌డం ముఖ్యం. కానీ, దారుణ‌మైన ఓట‌ములు ఎదుర‌వుతుంటే ఎవ‌రైనా స‌రే నిల‌దీయ‌కుండా ఉండ‌రు.

ముక్కుసూటిత‌నం ముంచేస్తుంది

గంభీర్ ముక్కుసూటి మ‌నిషి. ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హిస్తాడ‌నే పేరున్న‌ప్ప‌టికీ... అది స‌రైన ఫ‌లితం ఇవ్వ‌కుంటే ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ఇప్పుడు అత‌డి హెడ్ కోచ్ ప‌ద‌వి ముప్పులో ప‌డింది. వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ (2027) వ‌ర‌కు గంభీర్ ప‌దవీ కాలం ఉంది. కానీ, వ‌చ్చే నెల నుంచి భార‌త్ లోనే జ‌రిగే టి20 ప్ర‌పంచ క‌ప్ లో నిరాశ ఎదురైతే ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇప్ప‌టికే ద‌క్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓట‌మి త‌ర్వాత గంభీర్ త‌ప్పుకోవాల‌నే డిమాండ్లు బ‌లంగా వ‌చ్చాయి. టి20 ప్రపంచ క‌ప్ లోనూ విఫ‌ల‌మైతే అత‌డు స్వ‌చ్ఛందంగా త‌ప్పుకోవాల్సి రావొచ్చు.