గంగూలీ పిచ్ పై గంభీర్ కు బౌన్సర్.. రిజైన్ కాదు కావాల్సింది రివిజన్
ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) అధ్యక్షుడిగా ఉన్న దిగ్గజ ఆటగాడు సౌరభ్ గంగూలీ కల్పించుకున్నాడు.
By: Tupaki Desk | 20 Nov 2025 12:00 AM ISTకోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం..! టీమ్ ఇండియాకు ఎన్నో మధురానుభూతులున్న మైదానం..! అలాంటిచోట దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 30 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. బ్యాటింగ్ వైఫల్యమే దీనికి కారణంగా అని కూడా స్పష్టంగా తెలిసిపోతోంది. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు మొదలయ్యాయి. గంభీర్ బాధ్యతలు చేపట్టాక టీమ్ ఇండియా 9 టెస్టుల్లో ఓడిపోయింది. ఇందులో స్వదేశంలోనే నాలుగు ఉన్నాయి. అందుకనే అంతా అతడిని నిందిస్తున్నారు. మరోవైపు ఈడెన్ గార్డెన్స్ పిచ్ పైనా విమర్శలు వస్తున్నాయి. దానికి ఐసీసీ పూర్ రేటింగ్ ఇస్తుందనే విశ్లేషణలూ వినిపించాయి. ఇక జట్టు వైఫల్యాలకు బాధ్యుడిని చేస్తూ టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి నుంచి గంభీర్ ను తప్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) అధ్యక్షుడిగా ఉన్న దిగ్గజ ఆటగాడు సౌరభ్ గంగూలీ కల్పించుకున్నాడు.
సొంత పిచ్ పై విమర్శలతో..
గంగూలీ సొంత నగరం కోల్ కతా. అతడు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు కూడా. అందుకనే టీమ్ ఇండియా ఓటమితో విమర్శలు పెరిగాయి. వాస్తవానికి మొదటి టెస్టులో 36 ఏళ్ల దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ స్టీవ్ హార్మర్ మాయాజాలానికి మన బ్యాటర్లు హ్యాండ్సప్ అన్నారు. 6.10 అడుగులకు పైగా పొడుగు ఉండే పేసర్ మార్కొ యాన్సెన్ బంతులను అర్థం చేసుకోలేకపోయారు. కెప్టెన్ శుబ్ మన్ గిల్ వంటి బ్యాటర్ గాయంతో దూరం కావడంతో 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. దీంతో 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా చేరుకోలేక 30 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మళ్లీ రెండో టెస్టు శనివారం నుంచి గువాహటిలో జరగనుంది. అప్పటిలోగా విమర్శలకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేజారుతుందని భావించాడు గంగూలీ. అందుకనే కోల్ కతా పిచ్ ను సమర్థిస్తూ, గంభీర్ కు కూడా అండగా నిలిచాడు.
పిచ్ బాధ్యత మాది కాదు..
వాస్తవంగా ఎక్కడైనా సరే, మ్యాచ్ కు నాలుగు రోజుల ముందే బీసీసీఐ క్యూరేటర్లు వచ్చి వికెట్ ను ఆధీనంలోకి తీసుకుంటారని గంగూలీ తెలిపాడు. అంటే, కోల్ కతా పిచ్ బాధ్యత తమది కాదని చెప్పాడు. బీసీసీఐ క్యూరేటర్ల సూచన మేరకు స్థానిక క్యూరేటర్లు చర్యలు చేపడతారని వివరించాడు. ఒకటి మాత్రం వాస్తవం అని.. ఈడెన్ పిచ్ అసలు బాగోలేదని అంగీకరించాడు. ఇక ఈడెన్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తొలి టెస్టు ముగిశాక పిచ్ పై స్పందించిన సంగతి తెలిసిందే. కోచ్, కెప్టెన్ కోరిక మేరకే పిచ్ ను రూపొందించామన్నాడు. ఇదే విషయాన్ని గంభీర్ కూడా చెప్పిన సంగతి గుర్తు చేశాడు.
గంభీర్ తొలగింపా? అవసరం లేదు..
అసలే గంగూలీ.. ఆపై అతడి సొంతగడ్డపై భారత్ ఓటమి.. కోల్ కతా నైట్ రైడర్స్ మాజీ కోచ్ అయిన గంభీర్. దీంతో గంగూలీ స్పందిస్తూ.. గంభీర్ ను టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ లో మంచి బ్యాటింగ్ వికెట్లపై టీమ్ ఇండియా రాణించిన సంగతిని గుర్తు చేస్తూ.. గిల్ కెప్టెన్సీ కూడా బాగుందని తెలిపాడు.
