ప్రపంచ క్రికెట్ లో తదుపరి ఫ్యాబ్-4 వీళ్లే... భారత్ నుంచి ఇద్దరు
విలియమ్సన్ అంచనా చాలావరకు కరెక్టే. జైశ్వాల్ ఇప్పటికే తానేమిటో నిరూపించుకున్నాడు. గిల్ కెప్టెన్ కూడా అయ్యాడు.
By: Tupaki Desk | 12 Jun 2025 1:00 AM ISTఏ క్రీడలోనైనా ఒకే సమయంలో ఆడేవారిని సరిపోల్చుతూ ఉంటారు. ఫుట్ బాల్ లో క్రిస్టియానో రొనాల్డో, లయోనల్ మెస్సీ, టెన్నిస్ లో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, జకోవిచ్, క్రికెట్ లో విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్.. మేటి ఆటగాళ్లయిన వీరు సమకాలీనులు. కొన్నిసార్లు ఒకే టైమ్ లో ఇద్దరు దిగ్గజాలు ఉండొచ్చు. కొన్నిసార్లు ఎక్కువ మంది ఉండొచ్చు. ఇప్పుడు క్రికెట్ లో విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లను దిగ్గజాలుగా పేర్కొంటున్నారు. ఫ్యాబులస్ (ఫ్యాబ్) 4గా వీరిని చెబుతారు.
మిగతా ముగ్గురి సంగతి ఎలా ఉన్నా.. కోహ్లి టి20లు, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. జో రూట్ టెస్టుల్లో 16 వేల పరుగులు సాధించేవాడిలా కనిపిస్తున్నాడు. 35 ఏళ్ల స్మిత్ 10 వేల పరుగులు దాటేశాడు. విలియమ్సన్ గాయాల నుంచి కోలుకుని మళ్లీ గాడిన పడ్డాడు. టెస్టుల్లో 9 వేల పరుగులకు చేరుకున్నాడు. ఇతడు 10 వేలు దాటడం ఖాయమే. అయితే, నలుగురూ 35 ఏళ్లకు దగ్గరగా ఉన్నారు. మరో మూడేళ్లు ఆడతారేమో? మరి వీరి తర్వాత ప్రపంచ క్రికెట్ లో ఫ్యాబ్ 4గా నిలిచే సత్తా ఎవరికి ఉంది...? ఈ ప్రశ్నకు విలియమ్సన్ సమాధానం చెప్పాడు.
తొలిసారి ఇద్దరు భారత కుర్రాళ్లు..
విలియమ్సన్ అంచనా ప్రకారం.. టీమ్ ఇండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్ మన్ గిల్, యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ సంచలనం రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ లు తదుపరి ఫ్యాబ్ 4 జాబితాలో ఉన్నారు. గిల్, జైశ్వాల్ ఒకేసారి ఫ్యాబ్ 4 కేటగిరీకి ఎక్కే అవకాశం ఉండడం విశేషం. అయితే, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా వీరి సరసన చోటిచ్చాడు విలియమ్సన్. అప్పుడు ఫ్యాబ్ 5 అవుతుందేమో?
విలియమ్సన్ అంచనా చాలావరకు కరెక్టే. జైశ్వాల్ ఇప్పటికే తానేమిటో నిరూపించుకున్నాడు. గిల్ కెప్టెన్ కూడా అయ్యాడు. బ్రూక్ మహా దూకుడైన బ్యాటర్. రచిన్ రవీంద్ర ప్రపంచ కప్ లు సహా పెద్ద టోర్నీల్లో అదరగొట్టాడు. గ్రీన్ మాత్రం ఇంకా ఎదగాల్సి ఉంది. అయితే, వీరిలో ఎవరు నిజమైన దిగ్గజంగా ఎదుగుతారో తెలియాలంటే కొన్నేళ్ల ఆగాల్సిందే. అంటే.. కాలమే సమాధానం చెబుతుంది అన్నమాట.
