Begin typing your search above and press return to search.

స‌చిన్.. కోహ్లి.. సిరాజ్.. రింకూ.. ఒకే బాధ‌.. అయినా జ‌ట్టుతోనే!

క్రీడ‌ల్లో గెలుపుఓట‌ములు ఎంత స‌హ‌జ‌మో.. ఆట‌గాడి జీవితంలో త్యాగాలూ అంతే స‌హ‌జం..! క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ కు అయినా.. కుర్రాడు రింకూ సింగ్ కు అయినా ఇదే విష‌యం వ‌ర్తిస్తుంది.

By:  Tupaki Gallery Desk   |   28 Feb 2026 11:00 AM IST
స‌చిన్.. కోహ్లి.. సిరాజ్.. రింకూ.. ఒకే బాధ‌.. అయినా జ‌ట్టుతోనే!
X

క్రీడ‌ల్లో గెలుపుఓట‌ములు ఎంత స‌హ‌జ‌మో.. ఆట‌గాడి జీవితంలో త్యాగాలూ అంతే స‌హ‌జం..! క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ కు అయినా.. కుర్రాడు రింకూ సింగ్ కు అయినా ఇదే విష‌యం వ‌ర్తిస్తుంది. ఆశ్చ‌ర్య‌క‌రంగా వీరిద్ద‌రితో పాటు టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి, హైద‌రాబాదీ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ సిరాజ్ ల‌కు ఒక విష‌యంలో పోలిక క‌నిపిస్తోంది. ఈ న‌లుగురికీ ఒకే సంద‌ర్భం ఎదురైంది..! అంతేకాదు న‌లుగురూ త‌మ జ‌ట్టు కోసం ఒకే నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇక్క‌డ చెప్పుకోద‌గిన‌ది.. ఆ నాలుగు సంద‌ర్భాలు ఏమంటే?

1999 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్...

క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ కు ఆట ప‌ట్ల ఉన్న ఆరాధ‌న గురించి ప్ర‌పంచానికి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక దేశం గురించి అంటే అంత‌కంటే ప‌దిరెట్లు అభిమానం. అలాంటి స‌చిన్ కు ఇంగ్లండ్ లో జ‌రిగిన 1999 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ సంద‌ర్భంగా విష‌మ ప‌రీక్ష ఎదురైంది. ఆ ఏడాది మే 19న అత‌డి తండ్రి ర‌మేశ్ టెండూల్క‌ర్ స‌రిగ్గా ప్ర‌పంచ క‌ప్ స‌మ‌యంలో గుండెపోటుతో చ‌నిపోయారు. అప్ప‌టికి ఆయ‌న వ‌య‌సు 68. ఇక నాడు టీమ్ఇండియా హైద‌రాబాదీ అజ‌హ‌రుద్దీన్ సార‌థ్యంలో వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడుతోంది. మ‌రోవైపు త‌న‌ను ఎంత‌గానో ప్రోత్స‌హించిన తండ్రి మ‌ర‌ణ వార్తతో స‌చిన్ కుంగిపోయాడు. చివ‌రి చూప కోసం ఇండియాకు బ‌య‌ల్దేరి వ‌చ్చాడు. జింబాబ్వేతో మ్యాచ్ కు దూర‌మ‌య్యాడు.

అంత్య‌క్రియ‌ల అనంత‌రం వెంట‌నే బ‌య‌ల్దేరి ఇంగ్లండ్ వెళ్లాడు. అంతేకాదు.. కెన్యాతో జ‌రిగిన మ్యాచ్ లో 140 ప‌రుగుల అద్భుత సెంచ‌రీ చేశాడు. అనంత‌రం ఆకాశానికేసి చూస్తూ.. త‌న సెంచ‌రీని తండ్రికి అంకిత‌మిచ్చాడు.

2006 డిసెంబ‌రు..

అప్ప‌టికి విరాట్ కోహ్లి అంటే ఎవ‌రికీ తెలియ‌దు. అత‌డికి కేవ‌లం 16 ఏళ్ల వ‌య‌సు... 2006 డిసెంబ‌రులో విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లి అనూహ్యంగా చ‌నిపోయారు. ఆ స‌మ‌యంలో కోహ్లి క‌ర్ణాట‌క‌తో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. 40 ప‌రుగుల‌తో తొలి రోజు నాటౌట్ గా ఉన్న‌ కోహ్లికి.. మ‌రుస‌టి రోజు మైదానంలో దిగే స‌మ‌యానికి తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో మ‌రణించాడ‌న్న వార్త తెలిసింది. కానీ, జ‌ట్టు ప్ర‌యోజ‌నాల రీత్యా బ్యాటింగ్ కొన‌సాగించి 90 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీని ఫాలో ఆన్ నుంచి త‌ప్పించాడు. అనంత‌రం తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యాడు.

202-21 ఆస్ట్రేలియా టూర్..

స‌రిగ్గా ఐదేళ్ల కింద‌ట ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక‌య్యాడు హైద‌రాబాదీ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ సిరాజ్. అప్ప‌టికి అత‌డు జ‌ట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేదు. నాడు కొవిడ్ వ్యాప్తి స‌మ‌యంలో ఆస్ట్రేలియాతో సిరీస్ జ‌రిగింది. భార‌త క్రికెట‌ర్లు క్వారంటైన్ ను ముగించుకుని సిరీస్ కు సిద్ధ‌మ‌య్యారు. ఇంత‌లోనే సిరాజ్ తండ్రి ఆటో డ్రైవ‌రైన మొహ‌మ్మ‌ద్ గౌస్ చ‌నిపోయాడు. కానీ, సిరాజ్ జ‌ట్టు ప్ర‌యోజ‌నాల రీత్యా ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. ఒక‌వేళ ఇండియాకు వ‌స్తే తిరిగి వెళ్ల‌లేని ప‌రిస్థితి. అటు టీమ్ ఇండియాకు కూడా ఇబ్బందే. అందుక‌ని ఆస్ట్రేలియాలోనే ఉండి సిరీస్ ఆడ‌డ‌మే కాదు.. జ‌ట్టు ఆ సిరీస్ గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. ఇప్పుడు టీమ్ ఇండియా ప్ర‌ధాన బౌల‌ర్ గా ఎదిగాడు.

ఇప్పుడు రింకూ..

టీమ్ఇండియా టి20 ఫినిష‌ర్ రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ సింగ్ శుక్ర‌వారం చ‌నిపోయాడు. క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతూ ఢిల్లీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న‌ను చూసేందుకు రింకూ టీమ్ఇండియాను వీడాడు. అయితే, రింకూ తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రై శ‌నివార‌మే టీమ్ ఇండియాతో క‌ల‌వ‌నున్నాడు. ఆదివారం వెస్టిండీస్ తో మ్యాచ్ కు అత‌డు అందుబాటులోకి వ‌స్తాడు. ఇదీ.. ఈ న‌లుగురు క్రికెట‌ర్ల వ్య‌క్తిగ‌త జీవితంలో జ‌రిగిన ఒకే త‌ర‌హా ప‌రిణామం.