Begin typing your search above and press return to search.

ఫిఫాకు డబ్బు పిచ్చి పట్టింది.. ఫైనల్ తర్వాత స్టేడియం పిచ్‌ను ముక్కలుగా కోసి అమ్ముతుందట..!

ఫిఫా వరల్డ్‌కప్ 2026 ముగింపు దశకు చేరుకున్న వేళ అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) తీసుకున్న ఒక విచిత్రమైన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  A.N.Kumar   |   11 July 2026 8:47 PM IST
ఫిఫాకు డబ్బు పిచ్చి పట్టింది.. ఫైనల్ తర్వాత స్టేడియం పిచ్‌ను ముక్కలుగా కోసి అమ్ముతుందట..!
X

ఫిఫా వరల్డ్‌కప్ 2026 ముగింపు దశకు చేరుకున్న వేళ అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) తీసుకున్న ఒక విచిత్రమైన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న టికెట్ల ధరలతో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఫిఫా.. ఇప్పుడు ఏకంగా ఫైనల్ మ్యాచ్ జరిగే స్టేడియం పిచ్‌ను ముక్కలుగా కట్ చేసి విక్రయించాలని నిర్ణయించడం క్రీడా లోకంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ నిర్ణయాన్ని పలువురు ఫుట్‌బాల్ అభిమానులు "వాణిజ్యీకరణకు పరాకాష్ట" అంటూ మండిపడుతున్నారు.

రూ. 43 వేలకు పిచ్ ముక్క

జులై 19న అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ 'మెట్‌లైఫ్ స్టేడియం'లో 2026 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో ఆటగాళ్లు ఆడిన అసలు టర్ఫ్ గడ్డి మైదానంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అభిమానులకు విక్రయించనున్నట్లు ఫిఫా అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక్కడే ఫిఫా తన వ్యాపార బుద్ధిని చాటుకుంది. ఒక్కో చిన్న టర్ఫ్ ముక్క ధరను ఏకంగా 450 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 43,000 వరకు ఉంటుంది. అయితే ఈ ధర పలికే టర్ఫ్ ముక్కల పరిమాణం సైజ్ ఎంత ఉంటుందనే విషయంపై ఫిఫా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఆసియా, ఆఫ్రికా అభిమానులకు మొండిచేయి

ఫిఫా అధికారిక స్టోర్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. విక్రయించే ప్రతి టర్ఫ్ ముక్క ఫైనల్ మ్యాచ్‌లో ఉపయోగించిన అసలైన మైదానం నుంచే సేకరించబడుతుందని.. దీనికి సంబంధించిన అథెంటిసిటీ సర్టిఫికెట్ కూడా ఇస్తామని పేర్కొంది. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఇదొక ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఫిఫా సమర్థించుకుంటోంది.

ఈ ప్రత్యేక సేకరణను కేవలం అమెరికా, యూరప్ దేశాల్లోని అభిమానులకు మాత్రమే డెలివరీ చేయనున్నట్లు ఫిఫా తెలిపింది. దీంతో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాల ఫుట్‌బాల్ ప్రేమికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమను కేవలం ప్రేక్షకులుగానే చూస్తూ ఇలాంటి జ్ఞాపకాలను పొందే హక్కు లేకుండా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ల ధరలు వింటే గుండె గుభేలే

కేవలం పిచ్ ముక్కల అమ్మకమే కాదు.. ఈసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ టికెట్ల ధరలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. సాధారణ టికెట్ ధర దాదాపు 32,970 డాలర్లు (సుమారు రూ. 31.5 లక్షలు) గా ఉంది. ఫుడ్ అండ్ డ్రింక్స్ పేరిట మరో 1,600 డాలర్లు (సుమారు రూ. 1.5 లక్షలు) గా ఉంది. ఈ స్థాయి భారీ ధరలు సామాన్య అభిమానులను స్టేడియానికి రాకుండా చేస్తున్నాయని.. ప్రపంచకప్‌ను కేవలం కోటీశ్వరుల ఆటగా మార్చేశారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివాదాస్పద మెట్‌లైఫ్ టర్ఫ్

మరోవైపు ఫైనల్ జరగబోయే మెట్‌లైఫ్ స్టేడియం టర్ఫ్ నాణ్యతపై ఇప్పటికే పలువురు ప్రముఖ కోచ్‌లు, ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్ల గాయాలకు కారణమవుతున్న ఆ పిచ్‌ను మార్చాల్సింది పోయి.. దాన్నే భారీ ధరలకు విక్రయించాలనే ఫిఫా నిర్ణయం మరింత వివాదాస్పదంగా మారింది.

క్రీడా సంబరాలను, భావోద్వేగాలను అభిమానులతో పంచుకోవాల్సిన అంతర్జాతీయ సమాఖ్య.. ప్రతి చిన్న అంశాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదంపై ఫిఫా ఎలా స్పందిస్తుందో చూడాలి.