Begin typing your search above and press return to search.

అయ్యో కెప్టెన్.. గొప్ప ప్రపంచ కప్ తెచ్చినా పూలబొకే కూడా లేదు

భారత్ లో మూడు రోజుల కిందట ముగిసిన వన్డే ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా అద్భుత రీతిలో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Nov 2023 12:30 PM GMT
అయ్యో కెప్టెన్.. గొప్ప ప్రపంచ కప్ తెచ్చినా పూలబొకే కూడా లేదు
X

ఒకవేళ.. భారత్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిందనుకోండి.. దేశమంతా ఊగిపోయేది.. ఎయిర్ పోర్టులో మీడియా హడావుడి మామూలుగా ఉండదు.. ఆటగాళ్లు బయటకు రాగానే వేలాదిమంది జనం.. అపూర్వ స్వాగత సత్కారాలు.. అనూహ్య బహుమతులు.. అద్భుతం అంటూ ప్రశంసలు.. ఇక వీధులన్నీ జనంతో నిండిపోయేవి.. ఆ కప్ చేతబట్టుకుని కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గనుక జట్టుతో ర్యాలీగా బయల్దేరితే ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఇలా ఏ నగరానికి ఆ నగరం క్రికెట్ మేనియాలో పిచ్చెక్కిపోయేది. ఇక కప్ గెలిచిన జట్టు సభ్యులకు నజరానాలకు అంతుండదు. వారు సొంత నగరాలకు చేరుకుంటే ప్రభుత్వాలే ఎదురెళ్లి స్వాగతం పలికేవి. అయితే, ఇక్కడ దీనికి విరుద్ధంగా జరిగింది. ఇందులో ఏ ఒక్కటీ ప్రపంచ కప్ గెలిచిన ఆ జట్టుకు అందలేదు. అంతకంటే.. అత్యంత సాదాసీదాగా ఆ జట్టు కెప్టెన్ విమానాశ్రయం నుంచి బయటకెళ్లాడు.

అద్భుత గెలుపుతో..

భారత్ లో మూడు రోజుల కిందట ముగిసిన వన్డే ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా అద్భుత రీతిలో గెలుచుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టూర్ లో వరుసగా మూడు వన్డేలు, భారత్ తో రెండు వన్డేలు (మొత్తం వరుసగా ఐదు) ఓడిపోయి, ప్రపంచ కప్ లో భారత్, న్యూజిలాండ్ తో మ్యాచ్ లతో పరాజయం పాలై ప్రయాణం మొదలుపెట్టింది కంగారూ జట్టు. ఈ పరిస్థితుల్లో ఆసీస్ కప్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, వరుసగా 9 మ్యాచ్ లలో నెగ్గి ప్రపంచ కప్ కొట్టేసింది. అందులోనూ లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్ లలో తమను ఓడించిన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ను మట్టికరిపించి విజేతగా నిలిచింది. ఇదంతా టీమ్ గేమ్ ద్వారా సాధించింది. ముఖ్యంగా లీగ్ దశలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అఫ్ఠానిస్థాన్ ను, సెమీస్ లో దక్షిణాఫ్రికాను ఓడించిన విధానం అద్భుతం. ఫైనల్లో భారత్ ను పక్కా ప్లానింగ్ తో పడగొట్టింది. అందులోనూ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ పాత్ర అత్యంత కీలకం. అర్ధ సెంచరీ చేసి మంచి టచ్ లో ఉన్న విరాట్ కోహ్లిని చక్కటి బంతితో బౌల్డ్ చేశాడు. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ వికెట్ తీసిన బంతి కూడా సూపర్. అసలు ఫైనల్లో పది ఓవర్ల వేసిన బౌలర్లలో అతి తక్కువ ఎకానమీ రేట్ (3.4) కమ్మిన్స్ దే. టోర్నీ మొత్తం కూడా అతడు మంచి ప్రదర్శనే చేశాడు. అఫ్ఘాన్ పై చెలరేగుతున్న మ్యాక్స్ వెల్ కు అండగా నిలిచాడు. న్యూజిలాండ్ పై కీలకమైన 37 పరుగులు చేశాడు. అన్నిటికిమించి ఓటముల్లో ఉన్నప్పటికీ కెప్టెన్ గా స్థైర్యం వీడకుండా జట్టును విజయం దిశగా నడిపించాడు. ఈ విధంగా చూసుకున్నా కమిన్స్ గొప్ప స్వాగతానికి అర్హుడు.

ఎయిర్ పోర్టులో పది మంది కూడా లేరు..

ఆదివారం ప్రపంచ కప్ ముగిశాక సోమవారం స్వదేశానికి బయల్దేరిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు బుధవారం నాటికి చేరుకున్నారు. కానీ, వారికి విమానాశ్రయాల్లో అద్భుత స్వాగతాలు ఏమీ దక్కలేదు. మిగతావారి సంగతి వదిలేస్తే.. కమిన్స్ కూ ఇదే పరిస్థితి ఎదురైంది. తన లగేజీ ట్రాలీ తానే తోసుకుంటూ వెళ్లాడతడు. ఎయిర్ పోర్టులోనూ ఐదారుగురు జర్నలిస్టులే ఉన్నారు. ఓ అధికారి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఎయిర్ పోర్టు బయట అయితే అభిమానులు, అధికారులే లేరు. ఇది ఏమాత్రం ఊహించని పరిస్థితి. కాగా, దీనంతటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అభిమానులు ఆసక్తికర కామెంట్లు, మీమ్స్ జోడిస్తున్నారు. ‘‘సిల్లీ పాయింట్’’ అనే సబ్ స్ర్కైటబర్ అయితే.. ‘‘ప్రపంచ కప్ ఆస్ట్రేలియా టెలికాస్ట్ కానట్టుంది’’ అని కామెంట్ పెట్టాడు. వీటన్నిటినీ చూస్తుంటే.. ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు కనీస స్వాగతమూ పలకకపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది.

కమ్మిన్స్ కు అదేం బ్యాడ్ లక్కో మరి..?

ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో కెప్టెన్ అయిన ఏకైక ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ కెరీర్ భిన్నమైనది. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా లాంటి జట్టుకు ఎంపికైన ఘనత అతడి సొంతం. అయితే, గాయాల కారణంగా మధ్యలో ఆరేళ్లు జట్టుకు దూరమయ్యాడు. ఓ పేసర్ ఇన్నాళ్లు జట్టులో లేకుంటే పునరాగమనం అసాధ్యం. కానీ, కమిన్స్ దానిని సుసాధ్యం చేశాడు. అంతేగాక సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. ఆపై కెప్టెన్ కూడా అయ్యాడు. 55 టెస్టుల్లో 239, 87 వన్డేల్లో 139, 50 టి20ల్లో 55 వికెట్లు పడగొట్టి మేటి బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు. కాగా, కమ్మిన్స్ వయసు ప్రస్తుతం 31. మరో వరల్డ్ కప్ కూడా చాన్సుంది. ఇప్పటికే 2105 కప్ గెలిచిన జట్టు సభ్యుడు అతడు.

కొసమెరుపు: అహ్మదాబాద్ లో ఆదివారం ఫైనల్ అనంతరం భారత ప్రధాని మోదీ .. ప్రపంచ కప్ ను కమిన్స్ కు అందించి వెంటనే స్టేజీ పైనుంచి సీరియస్ గా వెళ్లిపోయారు. కనీసం ఫొటోకు పోజిచ్చేవరకు ఆగలేదు. దీంతో కమిన్స్ కప్ చేతబట్టుకుని నిర్వేదంగా చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.