Begin typing your search above and press return to search.

ఇదేం ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ సామీ.. మిగతా టీమ్‌లు ఐపీఎల్ ఆడలేదా ఏంటి?!

రెండు నెలల పాటు క్రికెట్ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన ఐపీఎల్ 2026 ముగిసింది. కప్పు ఎవరు గెలిచారన్న ముచ్చట పక్కన పెడితే.. టోర్నీ ముగిసిన వెంటనే అసలు సిసలైన 'సోషల్ మీడియా' వార్ మొదలైంది.

By:  A.N.Kumar   |   2 Jun 2026 1:00 AM IST
ఇదేం ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ సామీ.. మిగతా టీమ్‌లు ఐపీఎల్ ఆడలేదా ఏంటి?!
X

రెండు నెలల పాటు క్రికెట్ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన ఐపీఎల్ 2026 ముగిసింది. కప్పు ఎవరు గెలిచారన్న ముచ్చట పక్కన పెడితే.. టోర్నీ ముగిసిన వెంటనే అసలు సిసలైన 'సోషల్ మీడియా' వార్ మొదలైంది. ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ 'ఈఎస్.పీఎన్ క్రిక్ ఇన్ఫో' ప్రకటించిన ఐపీఎల్ 2026 ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఈ జట్టును చూసిన క్రికెట్ ఫ్యాన్స్ మొదట ఆశ్చర్యపోయారు, తర్వాత నవ్వుకున్నారు.. చివరకు తలపట్టుకుని “ఇది ఐపీఎల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌నా.. లేక ఎస్.ఆర్.హెచ్ - ఆర్సీబీ కాంబైన్డ్ ఎలెవెనా?” అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.




మిగతా ఎనిమిది జట్లు కేవలం ప్రేక్షకులుగా ఉన్నాయా?

ఈ సెలెక్షన్ కమిటీ అసలు ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ చూసిందా.. లేక కేవలం రెండు టీమ్‌ల మ్యాచ్‌లు మాత్రమే చూసిందా అనే అనుమానం రాక మానదు. ఎందుకంటే.. ఈ జట్టులో సగం కంటే ఎక్కువ మంది సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్.ఆర్.హెచ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నుంచే ఉన్నారు. ఎస్.ఆర్.హెచ్ నుంచి నలుగురు, ఆర్సీబీ నుంచి నలుగురు ప్లేయర్లకు చోటు కల్పించడంతో.. "మిగతా ఎనిమిది ఫ్రాంచైజీలు ఈ సీజన్‌లో కేవలం మ్యాచ్‌లు చూడటానికి.. చప్పట్లు కొట్టడానికే వచ్చాయా?" అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కెప్టెన్‌గా రజత్ పాటీదార్.. ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్!

ఓపెనర్లుగా వైభవ్, విరాట్ కోహ్లీలను ఎంపిక చేశారు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డిలను తీసుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. జట్టు మొత్తానికి కెప్టెన్‌గా రజత్ పాటీదార్‌ను ఎంపిక చేయడం చూసి కొందరు క్రికెట్ పండితులు సైతం అవాక్కవుతున్నారు. "కప్పు గెలిచిన బోనస్ పాయింట్లు ఏమైనా ముందే కలిపేశారా ఏంటి బాస్?" అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఈఎస్.పీఎన్ ప్రకటించిన జట్టు ఇదే

వైభవ్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రజత్ పాటీదార్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, కగిసో రబాడ, జోఫ్రా ఆర్చర్, సకిబ్ హుస్సేన్.

బౌలింగ్ ఓకే కానీ.. మా ప్లేయర్ ఎక్కడ?

ఇక బౌలింగ్ విభాగంలో కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్ వంటి ఆల్‌రౌండర్లతో పాటు భువనేశ్వర్ కుమార్, కగిసో రబాడ, జోఫ్రా ఆర్చర్, సకిబ్ హుస్సేన్‌లకు చోటు దక్కింది. అయితే ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పలువురు స్టార్ బౌలర్ల పేర్లు ఇందులో లేకపోవడంతో.. "మా ఫేవరెట్ ప్లేయర్ ఎక్కడ?" అంటూ కామెంట్ సెక్షన్లలో ఫ్యాన్స్ అప్పుడే యుద్ధానికి దిగిపోయారు.

సోషల్ మీడియాలో మీమ్స్ వరద.. ‘మీటింగ్ ఎక్కడ జరిగింది?’

ఈ సెలెక్షన్ గత్తరపై సోషల్ మీడియాలో మీమ్స్ వరద పారుతోంది. “ఈ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ సెలెక్షన్ కమిటీ మీటింగ్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్‌లోనేనా.. లేక బెంగళూరు పబ్‌లోనేనా?” అంటూ నెటిజన్లు గట్టిగానే చురకలు అంటిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఐపీఎల్‌లో ప్రతి క్రికెట్ అభిమానికి తనదైన ఒక 'సొంత టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్' ఉంటుంది. ఈ ఈఎస్పీఎన్ జట్టుతో ఏకీభవించే వాళ్లు ఎంతమంది ఉన్నారో.. “ఇదేం సెలెక్షన్ రా బాబోయ్!” అని తల పట్టుకునే వాళ్లు అంతేమంది ఉన్నారు.

మరి ఈ 'ఈఎస్.పీఎన్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్' పై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎంపికలతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ దృష్టిలో ఈ సీజన్ బెస్ట్ ఎలెవెన్ ఏంటో కింద కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి!