Begin typing your search above and press return to search.

బోల్ట్ను తలదన్నేలా నైటాన్.. అంత సత్తా ఉన్న ఎవరితడు..?

ఎరియన్‌ నైటాన్. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో ఈ అమెరికా స్ప్రింటర్ పైనే అందరి చూపు. నైటాన్ ది అమెరికాలోని ఫ్లోరిడా.

By:  Tupaki Desk   |   24 Aug 2023 8:15 AM GMT
బోల్ట్ను తలదన్నేలా నైటాన్.. అంత సత్తా ఉన్న ఎవరితడు..?
X

ఈ తరంలో పరుగులు వీరుడు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు జమైకా చిరుత ఉసేన్ బోల్ట్. అతడు రిటైరై ఆరేళ్లు అవుతున్నా పేరు మాత్రం మర్చిపోలేకపోతున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అంత గొప్ప అథ్లెట్ బోల్ట్. 100 మీటర్లు.. 200 మీటర్లు.. 400 మీటర్లు.. ఫీల్డ్ ఏదైనా.. అతడి పరుగుకు ప్రపంచ రికార్డులు.. బంగారు పతకాలు దాసోహమయ్యాయి. ఒకటా రెండా? 2008, 2012, 2016లో6 వరుసగా ఎనిమిది ఒలింపిక్ బంగారు పతకాలు కొల్లగొట్టాడతడు. పొడవైన-బలమైన కాళ్లు.. దూసుకెళ్లేందుకు తీరైన శరీర నిర్మాణంతో పరుగుల వీరుడిగా చరిత్రలో నిలిచాడు బోల్ట్. ఇప్పుడు అతడిని తలదన్నేవాడు వచ్చాడని అంటోంది స్ప్రింట్ వరల్డ్.

ఆరాధ్య దైవాన్ని మించిన దుమ్మురేపే వేగం

బోల్ట్ అంటే చిరుతను మించిన వేగం.. ఎందరికో ఆరాధ్య దైవం. ఓ టీనేజీ కుర్రాడికి కూడా.. అందుకే తనకిష్టమైన పరుగుల వీరుడి తరహానే స్ప్రింట్ లో దుమ్ము రేపుతున్నాడు. అంతేకాదు బోల్ట్ రికార్డునే బద్దలుకొట్టాడు. ఇంతకూ అతడు ఎవరంటే.. ఎరియన్‌ నైటాన్. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో ఈ అమెరికా స్ప్రింటర్ పైనే అందరి చూపు. నైటాన్ ది అమెరికాలోని ఫ్లోరిడా.

బాస్కెట్ బాల్ కాదు.. స్ప్రింట్

అచ్చం బోల్ట్ మాదిరే పొడుగ్గా.. సన్నగా ఉండే నైటాన్‌ చూసేందుక బాస్కెట్ బాల్ ఆటగాడిలా కనిపిస్తాడు. అతడు ట్రాక్ మీద పరుగు తీస్తుంటే మిగిలిన వాళ్లు వెనుకే ఉండిపోతారు. నైటాన్ సహజంగా ఫుట్ బాల్ ఆటగాడు. చాలాకాలం కొనసాగాడు. అయితే మెరుపు వేగాన్ని ఆలస్యంగా గుర్తించిన అతడు అప్పటినుంచి పరుగందుకున్నాడు. ఆలస్యంగా వచ్చినా ప్రస్తుత స్ప్రింట్ స్టార్లు నోవా లేల్స్ లాంటి వాళ్లకు దడ పుట్టిస్తున్నాడు. ఫ్లోరిడా యూనివర్సిటీ కోచ్ మైక్ హోలోవె శిక్షణలో రాటుదేలిన నైటాన్ 200 మీటర్ల పరుగులో ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతున్నాడు. 2020లో జూనియర్ ఒలింపిక్‌ క్రీడల్లో 200 మీటర్ల పరుగును 20.33 సెకన్లలోనే పూర్తి చేసి 15-16 వయసు విభాగంలో కొత్త రికార్డు నెలకొల్పాడు. జూనియర్ స్థాయిలోనే ముద్ర వేసిన ఇతడు.. గతేడాది యూజీన్‌లో జరిగిన ప్రపంచ అండర్ 20 అథ్లెటిక్స్ లో 200 మీటర్ల పరుగును 19.49 సెకన్లలోనే పూర్తి చేసి బోల్ట్ పేరిట 18 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. 200 మీటర్ల పరుగును 20 సెకన్లలోపు పరుగెత్తిన తొలి అమెరికా అథ్లెట్ ఇతడే.

రెండేళ్లుగా డైమండ్ లీగ్ 200లో నైటాన్ ఎదురులేదు. ప్రపంచ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్ టూరర్ లోనూ అతడిదే పైచేయి. ఈ వరుస విజయాలతోనే రెండుసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ లో 'రైజింగ్‌ స్టార్' అవార్డును దక్కించుకున్నాడు.

100 మీటర్ల పరుగులోనూ సత్తా చాటుతున్నా నైటాన్ ప్రధాన దృష్టి మాత్రం 200 మీటర్ల మీదే. అండర్‌ -20లో 200 మీటర్ల పరుగులో 11 సార్లు సొంత రికార్డును సవరించడం నైటాన్ సత్తాకు నిదర్శనం. ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌ లో 200 మీటర్ల పరుగు లో ఫేవరెట్ గా బరిలో దిగుతున్నాడు. గతేడాది 19.31 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి మైకేల్ జాన్సన్ రికార్డును బద్దలు కొట్టిన నోవా లేల్స్ కు నైటాన్ తో పోటీపడి గెలవడం కష్టమే. రెండు ఒలింపిక్ స్వర్ణాలు నెగ్గాలనేది నైటాన్ లక్ష్యం. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో 200 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచి 2024 పారిస్‌ ఒలింపిక్స్ కు సగర్వంగా వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.