Begin typing your search above and press return to search.

టీమ్ఇండియాతో 5 టెస్టుల సిరీస్..15 రోజుల ముందే ఇంగ్లండ్ జట్టు ప్రకటన

టీమ్ ఇండియాతో ఈ నెల 20 నుంచి జరగనున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టును గురువారమే ప్రకటించారు.

By:  Tupaki Desk   |   5 Jun 2025 4:31 PM IST
టీమ్ఇండియాతో 5 టెస్టుల సిరీస్..15 రోజుల ముందే ఇంగ్లండ్ జట్టు ప్రకటన
X

మైండ్ గేమ్ లో భాగంగానో.. ప్రిపరేషన్ గురించి గొప్పగా చెప్పుకొనేందుకో.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లు టెస్టుల్లో ప్రత్యర్థితో తలపడే తుది జట్టును ముందు రోజే ప్రకటిస్తుంటాయి. లేదంటే రెండు రోజుల ముందుగానో వెల్లడిస్తుంటాయి. కానీ, టీమ్ ఇండియాతో ఈ నెల 20 నుంచి జరగనున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టును గురువారమే ప్రకటించారు. 14 మంది సభ్యుల ఈ జట్టులోనుంచే తుది 11 మందిని ఎంచుకోనున్నట్లు స్పష్టం చేసింది.

ఐదు టెస్టుల సిరీస్ అంటే మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉండాలి. కనీసం నెలన్నర రోజుల పాటు సాగే సుదీర్ఘ సిరీస్ కావడంతో ఆటగాళ్ల గాయాలనూ చూడాలి. కాగా, టీమ్ ఇండియా- ఇంగ్లండ్ సిరీస్ తోనే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్ మొదలుకానుంది. దీనికిముందే ఇంగ్లండ్ లోనే ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2023-25 సైకిల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం దీనికి వేదిక.

వాస్తవానికి ఈ ఫైనల్ లో టీమ్ ఇండియా ఆడాల్సింది. ప్రస్తుత సైకిల్ లో భారత జట్టే తొలి నుంచి ముందంజలో ఉంది. కానీ, స్వదేశంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో 0-3తో క్లీన్ స్వీప్ కావడంతో దెబ్బపడింది. ఆపై ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్ లోనూ 1-3తో ఓడడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు మిస్ అయింది. దక్షిణాఫ్రికా తొలిసారిగా ఫైనల్ చేరింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఇక కొత్త సైకిల్ విషయానికి వస్తే భారత్ కు పెద్ద పరీక్షే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండానే ఆడుతున్నందున కొత్త కెప్టెన్ శుబ్ మన్ గిల్ పై తీవ్ర ఒత్తిడి ఉండనుంది. అందులోనూ బ్యాట్స్ మన్ గానూ గిల్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. రోహిత్, విరాట్ స్థానాలను భర్తీ చేయగల ఆటగాళ్లను వెదుక్కోవాలి.

కాగా, జూన్ 20 నుంచి ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు ఇప్పటికే 18 మందితో టీమ్ ఇండియాను ప్రకటించారు. కుర్రాళ్లతో కూడిన ఇండియా ఏ జట్టు.. ఇంగ్లండ్ లయన్స్ (ఇంగ్లండ్ ఏ)తో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. రెండో మ్యాచ్ శుక్రవారం నుంచి జరగనుంది. చాలామంది టెస్టు జట్టులోని ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు.

కాగా, ఇంగ్లండ్ మాత్రం తొలి టెస్టుకు 14 మందితో తమ జట్టును ప్రకటించింది. హెడింగ్లీలో జరిగే ఈ మ్యాచ్ కు కీలక పేసర్ గస్ ఆట్కిన్సన్ గాయంతో దూరమయ్యాడు.

తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, షోయబ్ బషీర్, బ్రైడెన్ కార్సే, జాకబ్ బెథెల్, ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, సామ్ కుక్.