ఆసీస్ కు ఇంగ్లండ్ బాక్సింగ్ డే కిక్.. 15 ఏళ్ల తర్వాత టెస్టు గెలుపు
5,468 రోజులు.. అంటే, సరిగ్గా 15 సంవత్సరాలు...! 16 పరాజయాలు, రెండు డ్రాలు.. ఐదారుగురు కెప్టెన్లు మార్పు.. మేటి పేస్ బౌలర్లు.. గొప్ప బ్యాటర్లు.. కానీ, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ గెలవలేకపోయింది ఇంగ్లండ్..!
By: Tupaki Desk | 27 Dec 2025 6:06 PM IST5,468 రోజులు.. అంటే, సరిగ్గా 15 సంవత్సరాలు...! 16 పరాజయాలు, రెండు డ్రాలు.. ఐదారుగురు కెప్టెన్లు మార్పు.. మేటి పేస్ బౌలర్లు.. గొప్ప బ్యాటర్లు.. కానీ, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ గెలవలేకపోయింది ఇంగ్లండ్..! తాజాగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లోనూ వరుసగా మూడు టెస్టుల్లో ఘోర పరాజయాలు. ఇప్పటికే ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 0-3తో వెనుకబాటు. కీలక ఓపెనర్ తప్పతాగిన మైకంలో హోటల్ రూం దారి మర్చిపోయి విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్ అనూహ్యం చేసింది. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. 5,468 రోజుల తర్వాత ఆసీస్ ను వారి స్వదేశంలో ఓడించింది. బాక్సింగ్ డే టెస్టు (క్రిస్మస్ మరుసటి రోజు మొదలయ్యే టెస్టు) మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోపే ముగియడం గమనార్హం. అంతేకాదు, శుక్రవారం తొలి రోజు రికార్డు స్థాయిలో 94,199 మంది హాజరయ్యారు. ప్రపంచంలో రెండో పెద్ద క్రికెట్ స్టేడియం అయిన మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఓ మ్యాచ్ కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇదే. అయితే, శనివారం దాదాపు 92 వేల మంది వరకు హాజరైనట్లు చెబుతున్నారు. అదే నిజమైతే ఇదే రికార్డు అవుతుంది.
852 బంతుల్లో...
యాషెస్ బాక్సింగ్ డే టెస్టు కేవలం 852 బంతుల్లో ముగిసింది. పెర్త్ లో జరిగిన మూడో టెస్టు 847లో పూర్తయింది. కాగా, ఈ సిరీస్ లో రెండు టెస్టులు రెండు రోజుల్లోనే ముగిశాయి. మొత్తం 13 రోజుల వ్యవధిలో నాలుగు టెస్టులూ పూర్తయ్యాయి. అయితే, యాషెస్ ప్రారంభం నుంచి దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ కు మాత్రం బాక్సింగ్ డే టెస్టు ఊపిరి పోసింది. చివరిదైన ఐదో టెస్టు జనవరి 4 నుంచి సిడ్నీలో జరగనుంది.
ఇద్దరిని తప్పించి.. మంచి పని..
పేసర్ జోఫ్రా ఆర్చర్, వన్ డౌన్ బ్యాటర్ ఒలి పోప్ లేకుండా బాక్సింగ్ డే టెస్టులో దిగింది ఇంగ్లండ్. వాస్తవానికి ఆర్చర్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నా.. మూడో టెస్టులో కెప్టెన్ స్టోక్స్ తో మైదానంలోనే వాదనకు దిగాడు. అందుకని నాలుగో టెస్టుకు గాయం పేరిట తప్పించినట్లు స్పష్టం అవుతోంది. పోప్.. తీవ్రంగా విఫలం అవుతున్నాడు. అతడి తప్పించి జాకబ్ బెతెల్ ను తీసుకున్నారు. ఫుల్ గా మద్యం తాగిన ఆరోపణలున్నప్పటికీ ఓపెనర్ డకెట్ ను కొనసాగించారు. అయితే, ఆర్చర్ స్థానంలో వచ్చిన టంగ్, పోప్ బదులు ఆడిన బెతెల్ రాణించి ఇంగ్లండ్ కు విజయం అందించారు. టంగ్ తొలి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీశాడు. బెతెల్ రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన 40 పరుగులు చేశాడు.
-ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 152 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, ఇంగ్లండ్ 110కే ఆలౌట్ కావడంతో 42 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 132 పరుగులే చేసింది. 175 పరుగుల టార్గెట్ ను ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. డకెట్ (34), మరో ఓపెనర్ క్రాలీ (37)లు 51 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బెతెల్ 40 పరుగులు చేశాడు. టంగ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు 20, రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి.ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు.
