0.. 8.. 13.. 17.. 18.. ఐపీఎల్ సూపర్ స్టార్ కెప్టెన్ కెరీర్ క్లోజ్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మొదటి సీజన్ నుంచి ఉన్న ఓ స్టార్ బ్యాట్స్ మన్ కెరీర్ కు ఈ సీజన్ తో ముగింపు కార్డు పడనుందా..?
By: Tupaki Desk | 14 April 2025 2:00 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మొదటి సీజన్ నుంచి ఉన్న ఓ స్టార్ బ్యాట్స్ మన్ కెరీర్ కు ఈ సీజన్ తో ముగింపు కార్డు పడనుందా..?
తమ జట్టుకు రికార్డు స్థాయిలో ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ కథ ఈ ఏడాదితో సమాప్తం కానుందా..?
అద్భుతమైన బ్యాటింగ్ తో ఎన్నో మ్యాచ్ లను గెలిపించిన ఆ స్టార్ క్రికెటర్ వచ్చే సీజన్ కు లీగ్ లో కనిపించడా?
జట్టుకు అత్యంత భారంగా మారిన, ఇప్పటికే కెప్టెన్సీ నుంచి తీసేసిన అతడిని వచ్చే సీజన్ కు ఫ్రాంచైజీ వదిలించుకోవడం ఖాయమేనా?
ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కువమంది ఔననే సమాధానం ఇస్తున్నారు. ఇంతకూ ఆ క్రికెటర్ ఎవరో కాదు.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. దేశానికి టి20 ప్రపంచకప్ అందించి సగర్వంగా రిటైర్ అయిన ఏడాదిలోపే రోహిత్ టి20 ఫామ్ పడిపోయింది. చాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టైటిల్ అందించి నెల లోపే అతడి బ్యాటింగ్ దిగజారింది.
0.. 8.. 13.. 17.. 18.. ఇవీ ప్రస్తుత సీజన్ లో రోహిత్ బ్యాట్ నుంచి వచ్చిన పరుగులు. మంచి ఫామ్ లో ఉంటే ఒక్క ఓవర్ లో 25 పరుగులు చసే రోహిత్.. ఇప్పుడు 5 మ్యాచ్ లలో 56 పరుగులు చేశాడు. దీన్నిబట్టే అతడి పరిస్థితి ఏమిటో చెప్పొచ్చు.
ఇప్పటికే రోహిత్ శర్మను ఒక మ్యాచ్ లో పక్కనపెట్టారు. కాకపోతే గౌరవంగా ఉంటుందని ప్రాక్టీస్ లో అతడి మోకాలికి బంతి తగలడంతో రెస్ట్ ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే మూడుసార్లు ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపారు. అయినా, రోహిత్ పరుగులు చేయడమే లేదు.
ఈ నెల 30వ తేదీకి 38 ఏళ్లు నిండనున్న రోహిత్ ను ప్రస్తుత సీజన్ లో మరింత భరించడం ముంబైకి కష్టమే. ఇక కెప్టెన్ గా ఉన్నప్పటికీ వచ్చే జూన్ లో ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు కూడా రోహిత్ ఎంపిక కష్టమే. దారుణ వైఫల్యాలతో ఇప్పటికే ఆస్ట్రేలియాతో జనవరిలో జరిగిన ఐదో టెస్టులో రోహిత్ పై వేటు వేసిన సంగతి తెలిసిందే. అదే జరిగితే రోహిత్ టీమ్ ఇండియా తరఫున ఇప్పటికే ఆఖరి మ్యాచ్ ఆడేసినట్లు.
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 76 పరుగుల మ్యాచ్ విన్నింగ్సే రోహిత్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అనుకోవాలి.