Begin typing your search above and press return to search.

గ్రౌండ్ లో క్రికెట‌ర్..గుండెపోటుతో తండ్రి..5 సిక్సులను మించిన బాధ‌

దునిత్ వెల్ల‌లాగే 22 ఏళ్ల ఎడ‌మ‌చేతి వాటం స్పిన్ బౌల‌ర్. ఒక టెస్టు, 31 వ‌న్డేలు, గురువారం నాటి మ్యాచ్ తో క‌లిపి 5 టి20లు ఆడాడు.

By:  Tupaki Desk   |   19 Sept 2025 3:20 PM IST
గ్రౌండ్ లో క్రికెట‌ర్..గుండెపోటుతో తండ్రి..5 సిక్సులను మించిన బాధ‌
X

ఏ స్థాయి క్రికెట్ లో అయినా ఒక ప్లేయ‌ర్ బౌలింగ్ లో మ‌రో ప్లేయ‌ర్ ఒక‌టీ రెండు సిక్సులు కొట్ట‌డం కాస్త ఇబ్బందిక‌రంగానే ఉంటుంది. ఒకే ఓవ‌ర్లో మూడు, నాలుగు సిక్సులు కొట్టించుకోవ‌డం బాధాక‌రంగా మారుతుంది. వ‌రుస‌గా ఐదు సిక్సులు ఇస్తే ఇక అత‌డికి అవ‌మాన‌మే.. అది కూడా ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్లో భారీగా ప‌రుగులు వ‌దిలితే ఆ బౌల‌ర్ ను ప‌క్క‌న‌పెట్ట‌డం ఖాయం. కానీ, ఆసియా క‌ప్ లో ఓ బౌల‌ర్ వ‌రుస‌గా ఐదు సిక్సులు ఇచ్చినా అత‌డిపై కోపం కంటే జాలి ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

లంక అవ‌కాశం ఇవ్వ‌లేదు...

ఆసియా క‌ప్ బి గ్రూప్ నుంచి సూప‌ర్ 4 చేరేది ఎవ‌రో తేలిపోయింది. గురువారం నాటి అఫ్ఘానిస్థాన్ తో మ్యాచ్ లో చెల‌రేగి ఆడిన శ్రీలంక గ్రూప్ టాప‌ర్ ప్లేస్ కొట్టేసింది. వాస్త‌వానికి ఈ మ్యాచ్ లో గ‌నుక అఫ్ఘాన్ నెగ్గి ఉంటే సూప‌ర్ 4 చేరేది. బంగ్లాదేశ్ తో స‌మానంగా 4 పాయింట్లే వ‌చ్చినా మెరుగైన ర‌న్ రేట్ దీనికి కార‌ణం. అయితే, లంక మాత్రం అవ‌కాశం ఇవ్వ‌లేదు.

అఫ్ఘాన్ ను ల‌క్ వ‌రించ‌లేదు...

తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ 20 ఓవ‌ర్ల‌లో 169 ప‌రుగులు చేసింది. అయితే, 19వ ఓవ‌ర్ వ‌ర‌కు ఆ జ‌ట్టు స్కోరు కేవ‌లం 137 మాత్ర‌మే. దునిత్ వెల్ల‌లాగే వేసిన చివ‌రి ఓవ‌ర్ లో మొహ‌మ్మ‌ద్ న‌బీ చెల‌రేగి వ‌రుస‌గా ఐదు సిక్సులు కొట్ట‌డంతో ఏకంగా 32 ప‌రుగులు వ‌చ్చాయి. వెల్లలాగే 4 ఓవ‌ర్ల కోటాలో 49 ప‌రుగులు ఇచ్చాడు. కాగా, శ్రీలంక 18.4 ఓవ‌ర్ల‌లోనే ఈ ల‌క్ష్యాన్ని అందుకుంది. కుశాల్ మెండిస్ 52 బంతుల్లో 74 నాటౌట్ రాణించాడు.

మ్యాచ్ లో ఉండ‌గానే తండ్రికి గుండెపోటు

దునిత్ వెల్ల‌లాగే 22 ఏళ్ల ఎడ‌మ‌చేతి వాటం స్పిన్ బౌల‌ర్. ఒక టెస్టు, 31 వ‌న్డేలు, గురువారం నాటి మ్యాచ్ తో క‌లిపి 5 టి20లు ఆడాడు. లోయ‌రార్డ‌ర్ లో బ్యాటింగ్ కూడా చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. తండ్రి సురంగ వెల్ల‌లాగే కూడా క్రికెటరే. అత‌డి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఆడిన దునిత్ శ్రీలంక జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. అయితే, గురువారం అబుదాబిలో అఫ్ఘాన్ తో మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే సురంగ గుండెపోటుతో చ‌నిపోయాడు. ఈ విష‌యాన్ని గ్రౌండ్ లో ఉన్న దునిత్ కు తెలియ‌నీయ‌లేదు. మ్యాచ్ అనంతరం చెప్ప‌గా.. అత‌డు క‌న్నీరుమున్నీర‌య్యాడు.

-శ్రీలంక హెడ్ కోచ్ స‌న‌త్ జ‌య‌సూర్య‌.. దునిత్ వెల్ల‌లాగేను ఓదార్చుతున్న విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. విచిత్రం ఏమంటే.. జ‌య‌సూర్య‌తో పాటు గురువారం మ్యాచ్ కామెంటేట‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన ర‌సెల్ ఆర్నాల్డ్ లు దునిత్ తండ్రి సురంగ‌తో క‌లిసి ఆడారు. జ‌య‌సూర్య‌ సెయింట్ పీట‌ర్స్, సురంగ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ స్కూల్స్ త‌ర‌ఫున ఆడారు. అయితే సురంగ జాతీయ జ‌ట్టు స్థాయికి చేర‌లేదు.

బ్యాట‌ర్ కూడా విషాదంలో...

దునిత్ బౌలింగ్ లో వ‌రుస‌గా ఐదు సిక్సులు కొట్టిన ఉత్సాహంలో ఉన్న మొహ‌మ్మ‌ద్ న‌బీకి మ్యాచ్ అనంత‌రం ఓ రిపోర్ట‌ర్... న‌బీకి సురంగ మ‌ర‌ణం తెలిపాడు. వీరిద్ద‌రి సంభాష‌ణ కూడా వైర‌ల్ అవుతోంది.