ఆర్సీబీదే ఐపీఎల్ టైటిల్..రూ.11 కోట్ల బెట్..ఎవడీ లక్కీ ర్యాపర్ డ్రేక్?
మరికొద్దిసేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తుది అంకం మొదలుకానుంది.
By: Tupaki Desk | 3 Jun 2025 5:33 PM ISTమరికొద్దిసేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తుది అంకం మొదలుకానుంది. ఇంకొన్ని గంటల్లో 18వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది.. ఆపై ఏడాది పాటు కొత్త చాంపియన్ పేరు రికార్డుల్లో కొనసాగనుంది. ఐపీఎల్ మొదలవుతుంటూనే బెట్టింగ్ ల సీజన్ కూడా మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాలు సహా భారత్ లోని చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్ పై నిషేధం ఉంది. అయినా, దొంగచాటుగా బెట్టింగ్ నడుస్తూనే ఉంది. రూ.కోట్ల మొత్తం చేతులు మారుతోంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ ఫైనల్ లో ఎవరు గెలుస్తారని కూడా పందేలు పెద్దఎత్తున సాగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే.. అన్ని బెట్టింగ్ లలోకి తాత అన్నట్లు ఒక వ్యక్తి పెద్ద బెట్టింగ్ కాశాడు. అతడు తెలుగువాడో.. ఇండియనో కాదు.. కెనడా వాడు. ఆ దేశానికి చెందిన ప్రముఖ ర్యాపర్ డ్రేక్ గ్రాహమ్ ఆర్సీబీ టైటిల్ కొడుతుందంటూ 7.5 లక్షల డాలర్ల పందెం కాశాడు. ఇది భారత కరెన్సీలో రూ.6.5 కోట్లు. ఒకవేళ ఆర్సీబీ టైటిల్ కొడితే డ్రేక్ కు రూ.11 కోట్లు (రూపాయికి రూపాయి) వస్తాయన్నమాట.
లక్కీ ర్యాపర్ డ్రేక్
ఈ డ్రేక్ మామూలు వాడు కాదు. బాగా పాపులర్. వయసు 38 ఏళ్లు. అబ్రే డ్రేక్ గ్రాహమ్ ఇతడి పూర్తి పేరు. నటుడు, గాయకుడు కూడా. హిప్ హాప్ సంగీతంలో ఎప్పటికప్పుడు కొత్త స్టయిల్స్ తో ప్రజలను ఆకట్టుకుంటుంటాడు. ఇక డ్రేక్ ది లక్కీ హ్యాండ్ అనే చెప్పాలి. గత ఏడాది ఇతడు కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ కొడుతుందని పందెం కాశాడు. ఆ జట్టే నెగ్గడంతో డబ్బులు జేబులో పోసుకున్నాడు.
మూడు రెట్లు అధికంగా..
కేకేఆర్ పై నిరుడు డ్రేక్ బెట్ కట్టింది 2.5 లక్షల డాలర్లే. అప్పుడు 5 లక్షల డాలర్లు పొందాడు అనుకోవాలి. ఈసారి ఆర్సీబీపై మాత్రం మూడు రెట్లు (7.5 లక్షల డాలర్లు) పందెం కాశాడు. బహుశా ఆ జట్టు జోరును చూసి ఇంత పెద్ద పందేనికి దిగాడేమో? ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే డ్రేక్ పంట పండినట్లే.
