Begin typing your search above and press return to search.

నీ పాసుగాల.. ఇదేందయ్యా ఇదీ ఫుట్‌బాల్‌ ను వదలని ట్రంప్!

రాజకీయం, వ్యాపారం, వైట్ హౌస్ వ్యవహారాలు.. ఇవన్నీ ఒకెత్తు, డోనాల్డ్ ట్రంప్ ‘సొంత స్టైల్’ ఒకెత్తు.. ప్రపంచంలో ఎక్కడ ఏ పంచాయితీ జరిగినా అందులో ఆయన ముద్ర ఉండాల్సిందే.

By:  A.N.Kumar   |   7 July 2026 1:14 PM IST
నీ పాసుగాల.. ఇదేందయ్యా ఇదీ ఫుట్‌బాల్‌ ను వదలని ట్రంప్!
X

రాజకీయం, వ్యాపారం, వైట్ హౌస్ వ్యవహారాలు.. ఇవన్నీ ఒకెత్తు, డోనాల్డ్ ట్రంప్ ‘సొంత స్టైల్’ ఒకెత్తు.. ప్రపంచంలో ఎక్కడ ఏ పంచాయితీ జరిగినా అందులో ఆయన ముద్ర ఉండాల్సిందే. అయితే ఈసారి ట్రంప్ ఏకంగా ఫుట్‌బాల్ మైదానంలో దూరి ‘రిఫరీ’ అవతారం ఎత్తడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పూయిస్తోంది. క్రీడా ప్రపంచంలో రిఫరీ నిర్ణయమే అంతిమం, శాసనం. కానీ ట్రంప్ ముందు ఆ రూల్స్ బచ్చా అనిపించాయి.

రిఫరీ వేశాడు 'రెడ్ కార్డ్'.. ట్రంప్ తీశాడు 'ట్రంప్ కార్డ్'!

అసలేం జరిగిందంటే.. బోస్నియాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా స్టార్ ఫార్వర్డ్ ఫోలారిన్ బలోగన్ కాస్త ఓవరాక్షన్ చేసి ప్రత్యర్థి ఆటగాడిని గట్టిగా టాకిల్ చేశాడు. అంతే రిఫరీ ఏమాత్రం మొహమాటం లేకుండా జేబులోంచి ‘రెడ్ కార్డ్’ తీసి బయటకు పొమ్మన్నాడు. దీంతో తదుపరి జరిగే రౌండ్ ఆఫ్-16 బెల్జియం మ్యాచ్‌కు బలోగన్ దూరం కావాల్సి వచ్చింది. అమెరికా టీమ్ గాల్లో దీపమై కూర్చుంది.

ఇక మన ట్రంప్ ఊరుకుంటారా? "నా దేశ ఆటగాడికి రెడ్ కార్డా? ఎంత ధైర్యం!" అన్నట్టుగా నేరుగా ఫిఫా బాస్ జియాని ఇన్ఫాంటినోకే ఫోన్ చేసేశారట. "కాస్త చూసి నిబంధనలు మార్చండయ్యా" అని ట్రంప్ స్టైల్ లో ఆర్డర్ వేసేసరికి ఫిఫా డిసిప్లినరీ కమిటీకి కూడా చెమటలు పట్టాయి. ఇంకేముంది రూల్స్ బుక్ పక్కన పెట్టి, ప్రత్యేక అధికారాలు వాడి బలోగన్ పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేశారు.

సోషల్ మీడియాలో మీమ్స్ పండగ!

ఈ విచిత్ర పరిణామంపై నెటిజన్లు ఊరుకుంటారా? సోషల్ మీడియాను మీమ్స్‌తో ముంచెత్తారు. "మైదానంలో రిఫరీ కార్డ్ కంటే.. వైట్ హౌస్ ‘ట్రంప్ కార్డ్’ చాలా పవర్‌ఫుల్ గురూ!" అంటూ ఒకరు.. "ఇకపై ఫుట్‌బాల్‌లో ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్‌తో పాటు ‘ట్రంప్ కార్డ్’ అనే కొత్త రూల్ పెట్టాలి" అంటూ మరొకరు సెటైర్లు వేస్తున్నారు.

మాజీ ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ కూడా ఈ తతంగాన్ని చూసి తట్టుకోలేక "రాజకీయ ఫోన్ కాల్స్‌తో రెడ్ కార్డులు రద్దు కావు బాస్, రూల్స్ అందరికీ ఒకటే" అంటూ ట్విట్టర్‌లో నీతులు చెప్పారు. కానీ, వినే మూడ్‌లో ఎవరున్నారు చెప్పండి?

ట్విస్ట్ ఏంటంటే

ఇంతా చేసి ట్రంప్ రికమండేషన్‌తో బెల్జియం మ్యాచ్‌లో బలోగన్ బరిలోకి దిగాడు. తీరా చూస్తే అమెరికా 1-3 తేడాతో ఘోరంగా ఓడిపోయి ఇంటిబాట పట్టింది. అంటే ట్రంప్ గారు అంత కష్టపడి రూల్స్ మార్పించినా ఫలితం మాత్రం మారలేదు.

చివరగా చెప్పేదేంటంటే.. ట్రంప్ తలుచుకుంటే రెడ్ కార్డ్ అయినా వైట్ కార్డ్ అవ్వాల్సిందే కానీ బంతిని గోల్ పోస్ట్‌లోకి నెట్టే టాలెంట్ మాత్రం ఆటగాళ్ల కాళ్లలోనే ఉండాలి కదా ట్రంప్ గారూ.. ఏదేమైనా "నీ పాసుగాల.. ఇదేందయ్యా ఇదీ" అని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.