Begin typing your search above and press return to search.

ప్రపంచ చదరంగానికి కొత్త మహా‘రాణి’.. ఎవరీ ‘దివ్య’మైన అమ్మాయి?

తెలుగు తేజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలూ దానిని సాధించలేకపోయారు. కానీ, ఇప్పుడు దివ్య దేశ్‌ముశ్‌ రూపంలో ఓ కొత్త మహా‘రాణి’ పుట్టుకొచ్చింది.

By:  Tupaki Desk   |   29 July 2025 12:18 AM IST
ప్రపంచ చదరంగానికి కొత్త మహా‘రాణి’.. ఎవరీ ‘దివ్య’మైన అమ్మాయి?
X

మొన్న గుకేశ్‌ దొమ్మరాజు... నేడు దివ్య దేశ్‌ముఖ్‌.. ప్రపంచ చదరంగ వేదికపై భారత కీర్తి పతాకం రెపరెపలాడింది.. ఎన్నో దశాబ్దాలుగా భారత అమ్మాయిలు, మహిళలు చదరంగంలో గొప్ప విజయాలు సాధిస్తున్నా.. ప్రపంచ చాంపియన్లుగా మాత్రం నిలవలేకపోయారు. తెలుగు తేజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలూ దానిని సాధించలేకపోయారు. కానీ, ఇప్పుడు దివ్య దేశ్‌ముశ్‌ రూపంలో ఓ కొత్త మహా‘రాణి’ పుట్టుకొచ్చింది. ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌గా నిలిచిన దివ్య కేవలం 19 ఏళ్ల వయసుకే అత్యంత గొప్ప విజయం సాధించినట్లైంది. దీంతో ఆమె గురించి ఆరా తీయడం మొదలైంది.

తెలుగు తేజం కోనేరు హంపికి నిరాశ...

ఎవరు గెలిచినా చరిత్రే.. ఎవరు గెలిచినా మన దేశానికి రికార్డే.. కానీ, అందులో ఒకరు తెలుగమ్మాయి కావడంతో సహజంగానే మనవాళ్లంతా కోనేరు హంపి విజయం సాధించాలని కోరుకున్నారు. అయితే, రెండు గేమ్‌లు డ్రా కావడంతో ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌ ఫైనల్‌ టై బ్రేక్‌కు దారితీసింది. ఇందులో దివ్య దేశ్‌ముఖ్‌దే పైచేయి అయింది. తొలి ర్యాపిడ్‌ టై బ్రేకర్‌ డ్రా అయింది. రెండో గేమ్‌లో 75 ఎత్తుల్లో దివ్య గెలుపొందింది. ఈ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన ఆమె చరిత్ర సృష్టించారు. దీంతో హంపీకి నిరాశ తప్పలేదు.

అనేక రికార్డులు..?

ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌ ఫైనల్స్‌ చేరిన తొలి భారత క్రీడాకారిణి దివ్యనే. అనంతరం హంపి కూడా ఫైనల్‌ చేరడంతో పతకం మన దేశానికే ఖాయమైంది. ఇక విజేతగా నిలవడం ద్వారా దివ్య.. ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌ అయిన తొలి భారతీయురాలిగానూ రికార్డులకెక్కింది. ఫైనల్‌ స్కోరు చూస్తేఏ... దివ్య 1.5, హంపి 0.5 పాయింట్లు సాధించారు. కాగా, హంపి ఇప్పటికే గ్రాండ్‌ మాస్టర్‌. దివ్య మాత్రం ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌ కావడం ద్వారా గ్రాండ్‌ మాస్టర్‌ కానున్నారు. ఇప్పటివరకు భారత్‌ లో గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కిన 88వ చెస్‌ ప్లేయర్‌ దివ్య.

దివ్య మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందినది. 19 ఏళ్ల ఈ అమ్మాయి పుట్టక మునుపే లేదంటే, బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడే హంపి గ్రాండ్‌ మాస్టర్‌ అయింది. అలాంటి దివ్య నేడు అద్భుత విజయంతో భారత చెస్‌ చరిత్రలో కొత్త అధ్యాయం రాసింది. సీనియర్‌ స్థాయిలో టోర్నీలు ఆడకున్నా.. హంపి వంటి ప్లేయర్‌ను ఒత్తిడికి గురిచేసింది. నాలుగేళ్ల కిందటే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదా సాధించింది దివ్య. 2023లో ఆసియా చాంపియన్‌గా నిలిచింది. ఒలింపియాడ్‌లో మూడు గోల్డ్‌లు గెలుపొందింది. నిరుడు తొలిసారి 2,500 ఎలో రేటింగ్‌ సాధించింది. ఆటలో దూకుడు దివ్య బలం. ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌లోనూ దానిని ఆయుధంగా మలుచుకుని.. తనకంటే మెరుగైన రేటింగ్‌ ఉన్న ద్రోణవల్లి హారిక (క్వార్టర్స్‌), జు జినర్‌ (ప్రి క్వార్టర్స్‌)లను మట్టికరిపించింది. ప్రపంచ మాజీ చాపియన్‌ జాగ్‌యిను సెమీఫైనల్లో చిత్తు చేసింది.