Begin typing your search above and press return to search.

రాఠీపై ’లాఠీ’.. ఈ ఐపీఎల్ లో సస్పెండైన తొలి క్రికెటర్.. ఎవరితడు?

అతడేమీ మేటి బౌలర్ గా పేరు తెచ్చుకోలేదు.. మొన్నటివరకు కనీసం జట్టు సభ్యుడు కూడా కాదు. ఈ ఐపీఎల్ లోనే తుది జట్టులో చోటు దొరుకుతోంది.

By:  Tupaki Desk   |   20 May 2025 4:38 PM IST
రాఠీపై ’లాఠీ’.. ఈ ఐపీఎల్ లో సస్పెండైన తొలి క్రికెటర్.. ఎవరితడు?
X

అతడేమీ మేటి బౌలర్ గా పేరు తెచ్చుకోలేదు.. మొన్నటివరకు కనీసం జట్టు సభ్యుడు కూడా కాదు. ఈ ఐపీఎల్ లోనే తుది జట్టులో చోటు దొరుకుతోంది. కానీ, తన ప్రవర్తనతో తొలి సీజన్ లోనే బీసీసీఐ నుంచి సస్పెన్షన్ కు గురయ్యాడు. క్లిప్ పెట్టి వెనక్కునెట్టిన పొడవాటి జట్టు.. బంతిని దాచిపెట్టుకుంటూ వస్తూ వెస్టిండీస్ లెజెండ్ సునీల్ నరైన్ ను పోలిన బౌలింగ్ శైలితో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తనదైన ముద్ర వేశాడు దిగ్వేష్ రాఠీ. 25 ఏళ్ల ఈ లెగ్ బ్రేక్ బౌలర్.. గత ఏడాది ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ తరఫున రాణించాడు. తమ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని మెగా వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్ కు లక్నో కొనుక్కుంది. మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చింది. లీగ్ లో తొలిసారిగా బరిలో దిగినా మెరుగ్గానే ప్రదర్శన చేశాడు రాఠీ. 10 మ్యాచ్ లలో 14 వికెట్లు తీశాడు. ఎకానమీ 7.83 మాత్రమే. కానీ, ప్రవర్తన మాత్రం చాలా చెడ్డ పేరు తెచ్చింది.

టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లి గతంలో వెస్టిండీస్ బౌలర్ బౌలింగ్ లో షాట్ కొట్టి చేసిన సిగ్నేచర్ టిక్ స్టైల్ ను.. వికెట్ తీసిన సందర్భంలో కాపీ కొడుతున్న రాఠీ.. తన ఓవరాక్షన్ కు పలుసార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో బ్యాట్స్ మన్ అభిషేక్ శర్మతో వివాదానికి దిగాడు. దీంతో బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. ఈ సీజన్ లో బీసీసీఐ నుంచి నిషేధం ఎదుర్కొన్నది దిగ్వేష్ రాఠీనే కావడం గమనార్హం. అంతేకాదు.. అసలు బీసీసీఐ చర్య తీసుకున్న కొద్ది మంది భారతీయ క్రికెటర్లలో ఇతడు ఒకడు అనుకోవచ్చేమో?

వికెట్ తీసిన ఆనందంలో రాఠీ సంబరాలు హద్దులు దాటుతోంది అనే అభిప్రాయం మొదటినుంచి ఉంది. తొలి సీజన్ లోనే అతడికి ఇది చెడ్డ పేరు తెచ్చింది. ఇప్పటికే రెండుసార్లు ఫైన్ లు పడినా దిగ్వేశ్ తీరు మార్చుకోలేదు. మూడోసారి కూడా క్రమశిక్షణ తప్పడంతో వేటు పడింది. దీంతో గురువారం గుజరాత్ టైటాన్స్ తో జరగాల్సిన మ్యాచ్ ఆడలేడు. మ్యాచ్ ఫీజులోనూ 50 శాతం కోత పెట్టారు. దిగ్వేశ్ ఖాతాలో ఇప్పటికే ఐదు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి.