Begin typing your search above and press return to search.

ఆ యాడ్ కదిలించిందా..? నిప్పులు చెరిగిన టెన్నిస్ రాకెట్

మరొకరు వాటిని అందుకోగలరా? అంటే అసాధ్యమేనేమో..? అలాంటి టెన్నిస్ స్టార్ ఓ అడ్వర్టయిజ్ మెంట్ చూసి ఆసాంతం చలించిపోయారు.

By:  Tupaki Desk   |   2 March 2024 7:47 AM GMT
ఆ యాడ్ కదిలించిందా..? నిప్పులు చెరిగిన టెన్నిస్ రాకెట్
X

క్రికెట్ తప్ప మరో క్రీడకు ప్రాధాన్యం లేని భారత దేశంలో.. జాతీయ క్రీడ హాకీ ఎప్పుడో కనుమరుగైన భారత దేశంలో.. బ్యాడ్మింటన్ రాజ్యం ఏలుతున్న భారత దేశంలో.. అమ్మాయిలకు టెన్నిస్ సాధ్యమా..? అంతర్జాతీయ స్థాయికి ఎదగడం సాధ్యమా? అనే అభిప్రాయం ఉన్న దశలో టెన్నిస్ రాకెట్ పట్టి దూసుకెళ్లిందో ధ్రువతార. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత్ కు గర్వకారణంగా నిలిచింది. వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎలా ఉన్నా.. ఆమె సాధించిన విజయాలు మామూలు స్థాయివి కాదు. మరొకరు వాటిని అందుకోగలరా? అంటే అసాధ్యమేనేమో..? అలాంటి టెన్నిస్ స్టార్ ఓ అడ్వర్టయిజ్ మెంట్ చూసి ఆసాంతం చలించిపోయారు. బహుశా అది తన ప్రయాణాన్ని పోలి ఉందేమో..? ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియో వైరల్ అవుతోంది.

సానియా..ఈ దూకుడు చూడలేదయా...

భారత టెన్నిస్ సానియా మీర్జా వ్యక్తిగత జీవితం ఇటీవల మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తో వైవాహిక బంధం తెగిపోవడం సానియా జీవితంలో పెద్ద దెబ్బగానే చెప్పాలి. ఈ విషయంలో పూర్తి తప్పు షోయబ్ దే అని తెలుస్తోంది. దానిని తట్టుకుని నిబ్బరంగా నిలిచే స్థైర్యం సానియాకు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఖరీదైన టెన్నిస్ క్రీడను కెరీర్ గా ఎంచుకుని శిఖరాలను అధిరోహించడం అంటే ఎంతో మానసిక స్థైర్యం ఉండాల్సిందే. అలాంటి సానియా తాజాగా ఓ అడ్వర్టయిజ్ మెంట్ కు బాగా కనెక్ట్ అయినట్టున్నారు. సమాజంలో మహిళ విజయానికి విలువ కట్టడం ఎలా అన్నదానిని ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ మొదలుపెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. స్త్రీ, పురుష భేదాలు ఇంకా ఉండడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళల విజయంపై ఓ సంస్థ రూపొందించిన యాడ్‌ పై ఈ విధంగా స్పందించారు.

ఇంతకూ ఏం జరిగింది..?

అర్బన్ కంపెనీ.. వివిధ నగరాల్లో ప్రజలకు దైనందిన సేవలు అందించే సంస్థ. ఇటీవల చోటీ సోచ్‌ (సంకుచిత ఆలోచనలు) పేరిట ఓ అడ్వర్టయిజ్ మెంట్ విడుదల చేసింది. బ్యుటీషియన్ గా పనిచేసే మహిళ కారు కొనడం.. ఇరుగుపొరుగు ఆమె ప్రొఫెషన్ ను చులకనగా చూడడం దీనిలోని పాయింట్. బ్యుటీషియన్ తమ్ముడు ఇరుగుపొరుగు ప్రవర్తనను అవమానంగా భావిస్తాడు. దీనికి సమాధానంగా ఆమె.. ప్రతి ఒక్కరూ తాను కొన్న కారును చూస్తారని, తన కష్టాన్ని పట్టించుకోరనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. మహిళలు గెలిచిన ప్రతిసారీ.. వారిని కించపర్చాలనే సమాజం చూస్తుందని.. ఇలాంటివారి మాటలను పట్టించుకుని జీవితాన్ని వదులుకోవాలా? కష్టపడి ముందుకెళ్లాలా? అనేది మన నిర్ణయమే అని చెబుతుంది. ‘అందరికీ తాము చేస్తున్న పని పట్ల గర్వంగా ఉంటుంది. దాన్ని ఇతరులు కూడా గౌరవించాలి’ అనేది ఇందులో మోటివేషనల్ థాట్. ఇది సానియా మీర్జాను కదిలించినట్లుంది. ఆ వీడియోకు స్పందిస్తూ ఉద్వేగంగా పోస్ట్ పెట్టారు. తన క్రీడా విజయాలను ఏకరువు పెట్టారు.

2005లో డబ్ల్యూటీఏ టైటిల్‌ గెలవడం ద్వారా ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళను అయ్యానని.. అది గొప్పదే కదా? అని సానియా ప్రశ్నించారు. ఇక డబుల్స్‌ లో ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉన్నప్పుడు.. తాను ఎప్పుడు స్థిరపడతానా అని ప్రజలు ఆసక్తిగా చూశారని.. 6 గ్రాండ్‌ స్లామ్‌లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదని తప్పుబట్టారు. కెరీర్‌ లో తనకు ఎంతోమంది మద్దతిచ్చారని.. అయితే.. మహిళగా విజయం సాధించినప్పుడు నైపుణ్యాలు, శ్రమకు బదులుగా అసమానతలు, ఆహార్యం గురించే ఎందుకు చర్చిస్తారనేది అంతుపట్టడం లేదని వాపోయారు. అర్బన్ కంపెనీ అడ్వర్టయిజ్ మెంట్ చూసిన తర్వాత తన మనసులో ఎన్నో భావాలు మెదిలాయని పేర్కొన్నారు. సమాజంలో వాస్తవాల గురించి మాట్లాడడం కష్టమేనని తెలుసంటూ మహిళ సాధించిన విజయానికి ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని.. అది ఎప్పటికి జరుగుతుందో? అని వ్యాఖ్యానించారు.