Begin typing your search above and press return to search.

అటు ధోనీ.. ఇటు రేవంత్.. ఉప్పల్ స్టేడియం హోరెత్తనుంది

హైదరాబాద్ లో ధోనీని చూసేందుకు పది రోజుల కిందటి నుంచే అభిమానుల హడావుడి నెలకొంది.

By:  Tupaki Desk   |   5 April 2024 10:35 AM GMT
అటు ధోనీ.. ఇటు రేవంత్.. ఉప్పల్ స్టేడియం హోరెత్తనుంది
X

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్. ఏటా ఉండేదేగా..? ఇప్పుడే కొత్తదనం అనుకుంటున్నారా? కాదు.. కాదు..ఇందులో సమ్ థింగ్ స్పెషల్ ఉంది. సరిగ్గా మ్యాచ్ ముందు రోజు ఉప్పల్ మైదానానికి కరెంట్ కట్ చేసింది విద్యుత్తు శాఖ. ఈ టెన్షన్ నడుమ రాత్రివేళ సరఫరాను పునరుద్ధరించింది. ఇంతకుమించిన విషయం ఏమంటే.. ఐదేళ్ల తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. ఉప్పల్ మైదానంలో ఆడుతున్నాడు.

పది రోజుల కిందటి నుంచే సందడి

హైదరాబాద్ లో ధోనీని చూసేందుకు పది రోజుల కిందటి నుంచే అభిమానుల హడావుడి నెలకొంది. విజయవాడకు చెందిన ఓ కుర్రాడు అయితే తన అభిమాన క్రికెటర్ ను చూసేందుకు నాలుగు రోజుల కిందటే హైదరాబాద్ వచ్చేశాడు. ఎందుకంటే.. బహుశా ధోనీ మళ్లీ ఉప్పల్ ఆడడం చూడలేమేమో..? కెరీర్ చివరి దశలో ఉన్న అతడు వచ్చే సీజన్ కు మైదానంలోకి దిగకపోవచ్చు. అందుకనే విజయవాడ కుర్రాడు లాంటి వేలమంది ఉప్పల్ మైదానానికి పోటెత్తున్నారు. కాగా, గత బుధవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చితక్కొట్టింది. ఏకంగా 277 పరుగులు చేసింది. మరి ఈసారి సొంతగడ్డపై చెన్నైను ఎలా ఢీకొడుతుందో చూడాలని కూడా హైదరాబాదీలు ఆసక్తిగా ఉన్నారు.

మహీ క్రేజ్ ముంచెత్తింది

మ్యాచ్ ను మహీ క్రేజ్ ముంచేసింది అనడంలో సందేహం లేదు. తమకు కావాలంటే తమకు కావాలంటూ టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అభిమానులు పోటెత్తారు. వీరిలో ఉన్నతాధికారులు కూడా ఉండడం గమనార్హం. దీంతోనే సన్ రైజర్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు మహా డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా స్టేడియానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

అటు ధోనీ.. ఇటు రేవంత్..

తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రెండు నెలల కిందట ఇంగ్లండ్ తో టీమిండియా టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ సమయానికి రేవంత్ సీఎంగా ఉన్నప్పటికీ మైదానానికి రాలేదు. అది ఐదు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టు మ్యాచ్. కాగా, ఇప్పుడు మాత్రం ఐపీఎల్ మ్యాచ్ కు సీఎం రేవంత్ హాజరవుతుండడం ఆసక్తి రేపుతోంది. వేలాది మంది అభిమానుల సమక్షంలో సీఎం కూడా మ్యాచ్ ను చూసేందుకు రానుండడం ప్రత్యేకంగా నిలవనుంది.

కొసమెరుపు: గత మ్యాచ్ ను ధోనీ విశాఖపట్టణంలో ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఆ మ్యాచ్‌లో చివర్లో వచ్చి దుమ్ము రేపాడు. 16 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. దీంతో స్టేడియం దద్దరిల్లింది. ఢిల్లీ గెలిచినప్పటికీ.. ధోనీ ఆటను చూసిన ప్రేక్షులు థ్రిల్ అయ్యారు. హైదరాబాద్‌ లోనూ మహీ మెరిపిస్తాడని భావిస్తున్నారు.