Begin typing your search above and press return to search.

మాట్లాడక 3 నెలలు.. చూడక ఏడాది.. గబ్బర్ కు ఫ్యామిలీ కష్టాలు

ఇన్‌ స్టా పేజీలో ధావన్‌ భావోద్వేగభరిత పోస్ట్‌ పెట్టాడు. నెలల కిందట కుమారుడితో వీడియోకాల్‌ లో మాట్లాడిన ఫొటోను షేర్‌ చేస్తూ.. "నిన్ను నేరుగా చూసి ఏడాదైంది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 3:47 AM GMT
మాట్లాడక 3 నెలలు.. చూడక ఏడాది.. గబ్బర్ కు ఫ్యామిలీ కష్టాలు
X

డ్రెస్సింగ్ రూమ్ లో ఎంతో హుషారుగా ఉంటూ గబ్బర్ గా పేరు తెచ్చకున్న ఆ క్రికెటర్.. మైదానంలో క్యాచ్ పట్టి తొడ కొట్టి మీసం మెలేసే ఆ క్రికెటర్ వ్యక్తిగత జీవితం మాత్రం కలతలతో సాగుతోంది. మంచి ఫామ్ లో ఉండగా.. జట్టులో తిరుగులేని స్థానంలో ఉండగా.. అనూహ్య రీతిలో తనకంటే పదేళ్లు పెద్దదైన మహిళను వివాహం చేసుకున్న ఆ క్రికెటర్ ఇప్పుడు ఆ వివాహం కారణంగా వచ్చిన ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. వయసు మీదపడి.. ఫామ్ కోల్పోయి.. అటు జాతీయ జట్టులో చోటు కూడా దక్కక ఓ రకంగా నాలుగు రోడ్ల కూడలిలో నిలిచాడు.

2006 అండర్ 19 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన శిఖర్ ధావన్ జాతీయ జట్టుకు మాత్రం ఐదేళ్ల తర్వాత కానీ ఎంపిక కాలేకపోయాడు. సచిన్, సెహ్వాగ్, గంభీర్ వంటి దిగ్గజాలు ఉండడంతో ధావన్ కు చాన్స్ తొందరగా రాలేదు. అయితే, 2013 నాటికి అతడి దశ తిరిగింది. ఏ సెహ్వాగ్, గంభీర్ కారణంగా అయితే పరోక్షంగా టీమిండియాకు ఎంపిక కాలేకపోయాడో.. వారిద్దరూ ఫామ్ కోల్పోవడంతో ధావన్ కు కలిసివచ్చింది. ఇక ఆ తర్వాత అతడు వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఓ అయిదేళ్ల పాటు టెస్టు జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగాడు.

వన్డేల్లో సూపర్ హిట్

టీమిండియా వన్డే ఓపెనర్ లలో ఉత్తమమైన వాడిగా ధావన్ రికార్డుల్లో నిలిచిపోతాడు. టి20ల్లోనూ అతడు మెరుగైన ప్రదర్శనే చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 ప్రపంచ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీల్లో ధావన్ అత్యధిక పరుగులు సాధించాడు. ఈ నెల 5వ తేదీతో 38 ఏళ్లు పూర్తి చేసుకున్న ధావన్.. జాతీయ జట్టు తరఫున చివరి వన్డేను సరిగ్గా ఏడాది కిందట ఆడాడు. రెండున్నరేళ్ల నుంచి టి20 జట్టులోకి ఎంపికవడం లేదు. 167 వన్డేల్లో 44 సగటుతో 6,793 పరుగులు సాధించిన ధావన్.. 34 టెస్టుల్లో 40.61 సగటుతో 2,315 పరుగులు, 68 టి20ల్లో 1,759 (సగటు27.92) పరుగులు సాధించాడు. రెండేళ్ల కిందటి వరకు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడిన ధావన్ ఆ తర్వాత సొంత నగరం ఢిల్లీ డేర్ డెవిల్స్ కు వెళ్లాడు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ గా వ్యవహరిస్తున్నాడు.

పదేళ్లు పెద్దదైన మహిళతో..

టీమిండియా రెగ్యులర్ సభ్యుడు కాకమునుపే, 2012లో ధావన్ భారత్ లో పుట్టి ఆస్ట్రేలియాలో స్థిరపడిన కిక్ బాక్సర్ ఆయేషా ముఖర్జీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటికి అతడికి 27 ఏళ్లు కాగా.. ఆమెకు 37. అప్పటికే ఆయేషాకు పెళ్లయింది. మొదటి భర్తతో ఇద్దరు పిల్లలు అబ్బాయి ఆలియా, అమ్మాయి రియా ఉన్నారు. అతడి నుంచి విడాకులు పొంది.. 2012లో ధావన్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ 2014లో జొరావర్ పుట్టాడు. అయితే, ధావన్, ఆయేషా మధ్యన విభేదాలు రావడంతో 2021లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. గత అక్టోబరులో కోర్టు విడాకులు మంజూరు చేసింది. జొరావర్‌ తల్లి వద్ద ఆస్ట్రేలియాలోనే ఉంటున్నాడు. అయితే, అతడి పుట్టినరోజు సందర్భంగా ఇన్‌ స్టా పేజీలో ధావన్‌ భావోద్వేగభరిత పోస్ట్‌ పెట్టాడు. నెలల కిందట కుమారుడితో వీడియోకాల్‌ లో మాట్లాడిన ఫొటోను షేర్‌ చేస్తూ.. "నిన్ను నేరుగా చూసి ఏడాదైంది. నాకు నిన్ను పూర్తిగా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 3 నెలలుగా మాట్లాడనివ్వకుండా నన్ను బ్లాక్‌ చేస్తున్నారు" అని ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. టెలీపతితో ఎప్పటికీ నీకు దగ్గరగానే ఉంటానని.. నువ్వు ఉన్నతంగా ఎదుగుతావని తెలుసని.. ఈ పాపా ఎప్పుడూ నిన్ను మిస్‌ అవుతూనే ఉంటాడని చెప్పుకొచ్చాడు. నీ నవ్వు కోసం ఎదురుచూస్తుంటానని అన్నాడు. దేవుడి దయ వల్ల మళ్లీ మనం కలుస్తామని ఆశిస్తున్నానని చెప్పాడు. ధైర్యంగా ఉండు. దయ, వినయం, సహనంతో మెలుగు అని సూచించాడు.

కాగా, జొరావర్ ను తన వద్దే ఉంచుకునేలా ధావన్‌ అభ్యర్థించగా తీర్పు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వీడియో కాల్‌ లో మాట్లాడేందుకు మాత్రం అనుమతించింది. పాఠశాల సెలవుల్లో ఆయేషా కుమారుడిని భారత్‌ తీసుకొచ్చి ధావన్‌ కుటుంబంతో సమయం గడిపేలా చూడాలని కోర్టు ఆదేశించింది. కానీ, గత మూడు నెలలుగా కుమారుడి నుంచి తనను పూర్తిగా బ్లాక్‌ చేశారని ధావన్‌ ఇన్ స్టాగ్రామ్ లో ఆరోపించాడు.