Begin typing your search above and press return to search.

డేవిడ్ 'పుష్పరాజ్' హర్ట్... సన్ రైజర్స్ పై సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్.. ఇండియన్ క్రికెట్ & సినిమా ఫ్యాన్స్ కి అత్యంత సుపరిచితుడనే సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   9 May 2024 10:28 AM GMT
డేవిడ్ పుష్పరాజ్ హర్ట్... సన్ రైజర్స్ పై సంచలన వ్యాఖ్యలు!
X

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్.. ఇండియన్ క్రికెట్ & సినిమా ఫ్యాన్స్ కి అత్యంత సుపరిచితుడనే సంగతి తెలిసిందే. ప్రధానంగా తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌ కు అస్సలు పరిచయం అక్కర్లేని పేరని చెప్పినా అతిశయోక్తి కాదు! మైదానంలో ఉండగా కూడా ఇండియన్స్ సినిమా సాంగ్స్ వస్తే.. కాలు కదపందే మనోడికి కుదరదు! ఇటీవల పుష్పా సాంగ్ వినిపిస్తే.. తగ్గేదేలే!

ఈ డేవిడ్ వార్నర్ తాను హర్ట్ అయిన విషయాన్ని తాజాగా వెల్లడించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరమైన అనంతరం తనను సోషల్ మీడియా వేదికగా బ్లాక్ చేశారని.. ఇది తనకు తీవ్ర ఆవేదనకు కలిగించిందని చెప్పుకొచ్చాడు. ఆ జట్టు తరఫున ప్లేయర్‌ గా, కెప్టెన్‌ గా సుదీర్ఘ కాలం ఆడానని, ఛాంపియన్‌ గా కూడా నిలబెట్టానని, ఆ గౌరవం కూడా లేకుండా బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు!

వివరాళ్లోకి వెళ్తే... ఐపీఎల్ 2024 సీజన్‌ కు ముందు జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్‌ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. దీంతో వార్నర్.. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపే ప్రయత్నం చేశాడు. అయితే సన్‌ రైజర్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా తన అకౌంట్‌ ను బ్లాక్ చేసిందనే విషయం అప్పుడు తనకు తెలిసిందంట. దీంతో... వార్నర్ షాకయ్యాడట!

తాజాగా రవిచంద్రన్ అశ్విన్‌ తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వార్నర్... ఆ వ్యవహారంపై స్పందించాడు. ఇందులో భాగంగా... సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియాలో తనను బ్లాక్ చేయడం చాలా బాధకు గురి చేసిందని.. ఆ బాధకు కారణం సన్‌ రైజర్స్ హైదరాబాద్ అభిమానులతో తనకున్న ప్రత్యేక అనుబంధమే అని అన్నాడు. ఇదే సమయంలో అసలు తనను ఎందుకు బ్లాక్ చేశారో తెలియదని తెలిపాడు!

కాగా 2009లో ఐపీఎల్ లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌.. సుమారు ఐదేళ్లపాటు ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2014 లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మారాడు. ఈ క్రమంలోనే 2016లో ఆ జట్టును విజేతగా నిలిపాడు. మొత్తంగా 2014 నుంచి 2021 వరకు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడాడు వార్నర్.

అయితే... ఐపీఎల్ - 2021 సీజన్‌ లో అతని పేలవ ప్రదర్శనతో సీజన్ మధ్యలోనే అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన సన్‌ రైజర్స్ యాజమాన్యం.. ఆ తర్వాత తుది జట్టులోకి కూడా తీసుకోలేదు. అనంతరం 2022 వేలానికి ముందు అతడిని జట్టు నుంచి రిలీజ్ చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి వార్నర్‌ ను తమ జట్టులోకి తీసుకుంది.