Begin typing your search above and press return to search.

హైదరాబాద్ నుంచి కాటేరమ్మ పంపింది.. పెద్ద కొడుకును కరాచీ కెప్టెన్ గా..

పాన్ ఇండియా సినిమా సలార్ లో మోస్ట్ పాపులర్ డైలాగ్ గుర్తుందా..?

By:  Tupaki Desk   |   14 April 2025 9:59 AM IST
David Warner Joins Pakistan Super League After IPL Snub
X

పాన్ ఇండియా సినిమా సలార్ లో మోస్ట్ పాపులర్ డైలాగ్ గుర్తుందా..? అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్న విలన్ ను హీరో నరికి చంపే సీన్ గుర్తుందా..? ఆ సమయంలో అమ్మాయిలు.. ‘కాటేరమ్మ రాలేదు.. తన కొడుకును పంపింది’ అని ఓ డైలాగ్ చెబుతారు.. సినిమాకే హైలైట్ గా నిలిచింది ఈ మాట. ఇప్పుడు కాటేరమ్మ తన పెద్ద కొడుకును పాకిస్థాన్ లోని కరాచీకి పంపింది..

పైన చెప్పుకొన్నదంతా సినిమాటిక్.. ఇప్పుడు చెప్పుకొనేది క్రికెట్ గురించి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నిరుడు సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) ఊచకోతతో 300 కొట్టేసినంత పనిచేసింది. జట్టు బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డిల బ్యాటింగ్ దూకుడు చూసిన తర్వాత తెలుగు ఫ్యాన్స్ అంతా వీరికి ’కాటేరమ్మ కొడుకులు’ అని ముద్దుగా పిలుచుకోవడం మొదలుపెట్టారు.

గత సీజన్ ముగిసినా కాటేరమ్మ కొడుకులు అంటూ సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ కు ముద్ర పడిపోయింది. ఈసారి కూడా వారి ఊచకోత మొదటి మ్యాచ్ లోనే చూపించారు. మధ్యలో వెనుకబడినా.. శనివారం ఉప్పల్ లో మళ్లీ పాత ఆట బయటకు తీశారు.

అయితే, కాటేరమ్మకు వీరేకాక అంతకుముందు పెద్ద కొడుకు ఉండేవాడు. అతడు జట్టును చాంపియన్ గానూ నిలిపాడు. ఇప్పుడు మాత్రం ఐపీఎల్ లోనే లేడు. అతడే ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్. 2009లో దక్కన్ చార్జర్స్ గా ఉన్నప్పుడు తప్ప 2016 వరకు హైదరాబాద్ మళ్లీ చాంపియన్ గా నిలవలేదు. అయితే, సన్ రైజర్స్ కు 2016లో టైటిల్ అందించాడు వార్నర్. కెప్టెన్ గా ఉంటూ 848 పరుగులు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన 2009 నుంచి 2013 వరకు వార్నర్ అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) కు ఆడాడు. అయితే, 2014 నుంచి హైదరాబాద్ కు మారాడు. 2022 నుంచి మళ్లీ ఢిల్లీకి మారాడు. గత సీజన్ లో ఫామ్ తగ్గడంతో పక్కకుపెట్టారు. అంతర్జాతీయ క్రికెట్ కూ రిటైర్మెంట్ ఇవ్వడంతో, ఈసారి సీజన్ కు మెగా వేలంలో ఏ జట్టు కూడా కొనుక్కోలేదు.

అలాంటి వార్నర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడుకుంటున్నాడు. అక్కడి కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్ అతడే. 2.58 కోట్ల పాకిస్థాన్ రూపాయిలు (3 లక్షల డాలర్లు)కు అతడిని కరాచీ కింగ్స్ కొనుక్కుంది. ఇది ఆ లీగ్ లో రికార్డు ధర కావడం గమనార్హం.

ఇక పీఎస్ఎల్ లో శనివారం కరాచీలో జరిగిన మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్స్ 234 పరుగుల భారీ స్కోరు చేయగా.. కెప్టెన్ వార్నర్ (12) విఫలమైనా మరో నాలుగు బంతులు ఉండగానే 236 పరుగులు చేసి గెలిచింది కరాచీ. అబ్బాస్ ఆఫ్రిదీ విన్నింగ్ షాట్ గా సిక్స్ కొట్టాక డగౌట్ లో వార్నర్ గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇదీ కాటేరమ్మ పెద్ద కొడుకు కథ..

కొసమెరుపు: 2019లో ఐపీఎల్ లో రికార్డు ధర రూ.12.50 కోట్లకు సన్ రైజర్స్ వార్నర్ ను రిటైన్ చేసుకుంది. 2025 సీజన్ కు రూ.2 కోట్ల బేస్ ప్రైస్ కు కూడా ఎవరూ కొనలేదు. దీంతో పీఎస్ఎల్ కు వెళ్లిపోయాడు.