Begin typing your search above and press return to search.

చిరకాల కోరిక తీరకుండానే దిగ్గజం వీడ్కోలు..

సచిన్ టెండూల్కర్ తర్వాత భారత క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మన్ ఎవరు..? సునీల్ గావస్కరా..? కానీ, అతడ వన్డేలు పెద్దగా ఆడలేదు. ఆడినా చెప్పుకోదగ్గ చరిత్ర లేదు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 9:17 AM GMT
చిరకాల కోరిక తీరకుండానే దిగ్గజం వీడ్కోలు..
X

సచిన్ టెండూల్కర్ తర్వాత భారత క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మన్ ఎవరు..? సునీల్ గావస్కరా..? కానీ, అతడ వన్డేలు పెద్దగా ఆడలేదు. ఆడినా చెప్పుకోదగ్గ చరిత్ర లేదు. మరి టెస్టులు.. వన్డేలు ఆడి.. పదివేల పరుగులు పైనే సాధించి.. ఓ దశలో సచిన్ ను మించిన పేరు తెచ్చుకున్న ఆటగాడు ఎవరు..? తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గం ఉన్న బ్యాట్స్ మన్ ఎవరు? దీనికి సమాధానం సెహ్వాగ్.. ధోనీ.. కోహ్లి.. అని చెబుతారేమో? కానీ, వీరెవరూ కాదు.

టీమిండియా చరిత్రలో గొప్ప బ్యాట్స్ మన్ సచిన్ అయితే తర్వాతి స్థానం రాహుల్ ద్రవిడ్ ది. ఒకవేళ సచిన్ కాలంలో గనుక అతడు ఆడకపోయి ఉంటే.. ద్రవిడ్ కు మరింత పేరు వచ్చేది అనడంలో సందేహం లేదు. మేటి టెస్టు క్రికెటర్ గా అలరించిన ద్రవిడ్.. వన్డేల్లోనూ పదివేల పరుగులు సాధించాడు. ఓ దశలో వన్డేల నుంచి వేటుకు గురైనా, జట్టులో చోటు కావాలంటే వికెట్ కీపింగ్ చేయాల్సి వచ్చినా సిద్ధమయ్యాడు. అలాంటి ద్రవిడ్ కెప్టెన్ గా ప్రపంచ కప్ అందుకోలేకపోయాడు. సరికదా.. అతడు సారథిగా ఉన్న 2007 ప్రపంచ కప్ లో జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆ సమయంలోనే భారత క్రికెట్ లో పెను సంక్షోభం నెలకొంది. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) వంటి లీగ్ ఏర్పాటుకు 2007 నాటి పరాజయమే కారణమైంది. ఇదంతా పరోక్షంగా ద్రవిడ్ పైన పడిన మరకనే. వీటన్నిటినీ మౌనంగా భరిస్తూ.. కెప్టెన్సీ వదిలేసి మరో ఐదేళ్లు సాధారణ బ్యాట్స్ మన్ గా కొనసాగాడు అతడు. ఇక 1999, 2003 ప్రపంచ కప్ లలో ద్రవిడ్ కీలక బ్యాట్స్ మన్ గా ఉన్నప్పటికీ జట్టు కప్ కొట్టలేకపోయింది.

కుర్రాళ్ల గురువుగా..

బ్యాట్స్ మన్, కెప్టెన్ గా సాధించలేని ప్రపంచ కప్ ను కోచ్ గా అందుకున్నాడు ద్రవిడ్. అయితే, అది అండర్ 19 కోచ్ గా ఉన్నప్పుడు. 2018లో శుబ్ మన్ గిల్, ప్రథ్వీ షా వంటి ప్రతిభావంతులతో కూడిన జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు ద్రవిడ్. ఆ సమయంలోనే న్యూజిలాండ్ లో జరిగిన టోర్నీని భారత్ గెలుచుకుంది. తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), జూనియర్ జట్టు కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. రెండేళ్ల కిందట జాతీయ జట్టు కోచ్ గా నియమితుడయ్యాడు. ఈ క్రమంలో భారత జట్టు టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు, టి20 ప్రపంచ కప్ సెమీస్ వరకు వచ్చింది.

చిరకాల వాంఛ అలాగే..

ఎన్ని గెలిచినా.. వన్డే ప్రపంచ కప్ విజయమే అత్యంత కీలకం. అందులోనూ సొంతగడ్డపై జరుగుతున్నందున ఈ కప్ గెలిస్తే ద్రవిడ్ కు లోటు లేకుండా పోయేది. కానీ, చివరి మెట్టుపై జట్టు బోల్తాకొట్టడంతో ద్రవిడ్ నిరాశ చెంది ఉంటాడనడంల సందేహం లేదు. ఈ నేపథ్యంలో అతడి భవిష్యత్ పై చర్చ జరుగుతోంది. ప్రపంచ కప్ తో కాంట్రాక్టు కూడా ముగియడంతో కొనసాగుతాడా? లేడా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అతడిని కొనసాగిస్తారనే వాదనా ఉంది. కనీసం ఒక్క ఫార్మాట్‌లోనైనా జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం వస్తే స్వీకరిస్తారా? అని మీడియా అడగ్గా..

‘‘ఇప్పటి వరకు అలాంటి ఆలోచనే లేదు. ఆ తీరికా లేదు. ప్రపంచ కప్ పైనే దృష్టిసారించాం. సమయం ఉంటే ఆలోచించేవాడినేమో? బాధ్యతలను ఎలా నిర్వర్తించానని స్వయంగా విశ్లేషించుకుంటా’’ అని వివరించాడు. 2024లో అమెరికా, వెస్టిండీస్‌ ఆతిథ్యంలో జరిగే టీ20 ప్రపంచకప్‌ నకు కూడా కోచింగ్‌ చేపట్టేందుకు సిద్ధమేనా? అని ప్రశ్నించగా.. ‘‘ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పటికైతే ప్రణాళికలు లేవు’’ అని పేర్కొన్నాడు. అయితే, మొత్తంగా చూస్తే.. ద్రవిడ్ కొనసాగేది అనుమానమే.