Begin typing your search above and press return to search.

చెన్నై సూప‌ర్ కింగ్స్ కు కొత్త కెప్టెన్...! రాజ‌స్థాన్ కు కూడా..?

అయితే, వీరంద‌రిలోకీ ఒకే ఒక్క ఆట‌గాడు జ‌ట్టు మార‌డ‌మే విప‌రీత‌మైన ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఏకంగా అత‌డి కోసం త‌మ జ‌ట్టులోని కీల‌క ఆల్ రౌండ‌ర్లు ఇద్ద‌రిని చెన్నై సూప‌ర్ కింగ్స్ త్యాగం చేయ‌డం అంద‌రినీ ఆలోచింప‌జేస్తోంది.

By:  Tupaki Entertainment Desk   |   15 Nov 2025 5:43 PM IST
చెన్నై సూప‌ర్ కింగ్స్ కు కొత్త కెప్టెన్...! రాజ‌స్థాన్ కు కూడా..?
X

వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మ‌న్ తోనే త‌మ జ‌ట్టుకు అచ్చి వ‌స్తుంద‌ని ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ చెన్నూ సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) భావిస్తున్న‌దేమో..? ఐదుసార్లు టైటిల్ కొట్టిన ఈ మాజీ చాంపియ‌న్ ఈసారి కూడా త‌మ కెప్టెన్ ను వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ లో చూసుకుంటోంది. వ‌చ్చే సీజ‌న్ కు సంబంధించి శ‌నివారంతో రిటైనింగ్, రిలీజింగ్ ఆట‌గాళ్ల జాబితా స‌మ‌ర్పించాల్సి ఉంది. ఈ క్ర‌మంలో కొంద‌రు ఆట‌గాళ్లు టీమ్ లు మార‌డం ఖాయ‌మైంది. వీరిలో క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ నుంచి సీనియ‌ర్ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ ష‌మీ వ‌ర‌కు ప‌లువురు క్రికెట‌ర్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే, వీరంద‌రిలోకీ ఒకే ఒక్క ఆట‌గాడు జ‌ట్టు మార‌డ‌మే విప‌రీత‌మైన ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఏకంగా అత‌డి కోసం త‌మ జ‌ట్టులోని కీల‌క ఆల్ రౌండ‌ర్లు ఇద్ద‌రిని చెన్నై సూప‌ర్ కింగ్స్ త్యాగం చేయ‌డం అంద‌రినీ ఆలోచింప‌జేస్తోంది.

ఆ ఇద్ద‌రి త్యాగం.. ఈ ఒక్క‌డి కోసం..

ఐపీఎల్ మొద‌టి, రెండో (2008, 2009) సీజ‌న్ ల‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ఆడాడు ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా. 2010లో లీగ్ లో లేడు. 2011లో కోచి ట‌స్క‌ర్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 2012 నుంచి చెన్నైకే ఆడుతున్నాడు. 2016, 2017లో చెన్నైపై వేటుప‌డిన‌ప్పుడు కూడా జ‌ట్టుతో లేడు. ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌స్థాన్ కు మార‌నున్నాడు. ఇత‌డితో పాటు ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆల్ రౌండ‌ర్ శామ్ క‌ర‌న్ కూడా రాజ‌స్థాన్ కు వెళ్ల‌నున్నాడు. ఇదంతా ఎందుకు అంటే సంజూ శాంస‌న్ కోసం అని చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు రెండు ఫ్రాంచైజీలు ట్రేడ్ ను ఖ‌రారు చేసుకున్నాయి. ఐపీఎల్ పాల‌క మండ‌లి దీనిని ధ్రువీక‌రించింది కూడా.

11 ఏళ్ల‌ బంధాన్ని వ‌దులుకుని..

2016, 2017ల‌లో త‌ప్ప 2013 నుంచి ఐపీఎల్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కే ఆడుతున్నాడు కేర‌ళ‌కు చెందిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూశాంస‌న్. 2021 నుంచి రాజ‌స్థాన్ కెప్టెన్ కూడా. నిరుడు రూ.18 కోట్ల‌కు రాజ‌స్థాన్ రిటైన్ చేసుకుంది. ఇంతే మొత్తానికి చెన్నై జ‌డేజాను అట్టిపెట్టుకుంది. రూ.2.40 కోట్లకు వేలంలో శామ్ క‌ర‌న్ ను తీసుకుంది. ఇప్పుడు శాంస‌న్ రూ.18 కోట్ల‌కే చెన్నైకి వెళ్ల‌నున్నాడు. జ‌డేజా రేటు మాత్రం రూ.14 కోట్ల‌కు త‌గ్గింది. క‌ర‌న్ కు అంతే మొత్తం చెల్లించ‌నున్నారు. ఇత‌డు 2019 నుంచి సీఎస్కే, పంజాబ్ ల‌కు ఆడుతున్నాడు.

కెప్టెన్లు ఎవ‌రు?

జ‌డేజా 2022లో చెన్నైకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించినా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో మ‌ళ్లీ ధోనీకి ప‌గ్గాలు ఇచ్చారు. రాజ‌స్థాన్ కు మారిన అత‌డిని కెప్టెన్ చేస్తారా? అన్న‌ది చూడాలి. ఇక సంజూ రాజ‌స్థాన్ ను వీడి చెన్నైకి వ‌స్తున్నందున అత‌డికే కెప్టెన్సీ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వెట‌ర‌న్ దిగ్గ‌జం ధోనీకి 45 ఏళ్లు వ‌చ్చినందున భ‌విష్య‌త్ అవ‌స‌రాల రీత్యా శాంస‌న్ ను కెప్టెన్ చేస్తార‌ని అంటున్నారు. అంటే, ధోనీ వార‌సుడిగా శాంస‌న్ ను చూస్తోంది చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజ‌మాన్యం.