ఐపీఎల్ 2026: సంక్షోభంలో 'సూపర్ కింగ్స్'.. పసుపు సైన్యం పతనానికి కారణమేంటి?
ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి 'హ్యాట్రిక్ ఓటములను' మూటగట్టుకోవడమే కాకుండా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.
By: A.N.Kumar | 6 April 2026 11:16 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన నిలకడైన జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రస్తుతం తన ఉనికిని చాటుకోవడానికి పోరాడుతోంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచి వ్యూహాలకు మారుపేరుగా నిలిచిన ఈ జట్టు.. 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో కుదేలైంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి 'హ్యాట్రిక్ ఓటములను' మూటగట్టుకోవడమే కాకుండా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితి కోట్లాది మంది చెన్నై అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
నాయకత్వ లోపం.. గందరగోళంలో గైక్వాడ్ సేన
మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజం నుంచి పగ్గాలు అందుకున్న రుతురాజ్ గైక్వాడ్ జట్టును నడిపించడంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపిస్తోంది. మైదానంలో ఫీల్డ్ సెట్టింగ్స్ నుంచి బౌలింగ్ మార్పుల వరకు ప్రతి నిర్ణయంలోనూ అస్పష్టత కనిపిస్తోంది. ఒకప్పుడు ధోనీ హయాంలో క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండి మ్యాచ్‌లను మలుపు తిప్పిన సీఎస్కే ఇప్పుడు చిన్నపాటి ఒత్తిడికే తలవంచుతోంది.
పవర్ ప్లేలో పవర్ లేని ఓపెనింగ్
జట్టు పరాజయాలకు ప్రధాన కారణం ఓపెనింగ్ జోడీ వైఫల్యం. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నప్పటికీ పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకోవడంలో వారు పూర్తిగా విఫలమవుతున్నారు. వేగంగా పరుగులు రాబట్టాల్సిన సమయంలో బంతులను వృథా చేస్తూ వికెట్లు పారేసుకుంటున్నారు. దీంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై అదనపు భారం పడుతోంది.
బౌలింగ్ విభాగం.. పరుగుల వరద!
సీఎస్కే బౌలింగ్ విభాగం ఈ సీజన్‌లో అత్యంత బలహీనంగా తయారైంది. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ఏకంగా 600కి పైగా పరుగులు సమర్పించుకోవడం వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో కానీ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కానీ బౌలర్లు ఎటువంటి ప్రణాళికను అమలు చేయలేకపోతున్నారు. ఒకప్పుడు స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను వణికించిన చెన్నై, ఇప్పుడు పరుగులను ధారాళంగా ఇచ్చేస్తోంది.
మధ్యవరుసలో కొరవడిన స్థిరత్వం
యువ ఆటగాళ్లు అయుష్ మాథ్రే, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్‌లపై టీమ్ మేనేజ్మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. సర్ఫరాజ్ ఖాన్ కొన్ని ఇన్నింగ్స్‌ల్లో పోరాడుతున్నా మిగిలిన వారి నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదు. సమిష్టి ప్రదర్శన లేకపోవడం వల్ల భారీ స్కోర్లు సాధించలేకపోవడం లేదా లక్ష్యాలను ఛేదించలేకపోవడం జట్టుకు శాపంగా మారింది.
ధోనీ రాకతోనే మోక్షమా?
ప్రస్తుతం జట్టు ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మైదానంలో ఆయన ఉంటే ఉండే ఆత్మవిశ్వాసమే వేరు. త్వరలోనే ధోనీతో పాటు యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ జట్టుతో చేరతారని సమాచారం ఉన్నప్పటికీ అప్పటికే సీజన్ చేజారిపోతుందేమో అన్న భయం అభిమానుల్లో నెలకొంది. "చెన్నై సూపర్ కింగ్స్ అంటే కేవలం ఒక క్రికెట్ జట్టు మాత్రమే కాదు.. అదొక ఎమోషన్. ప్రస్తుతం జట్టు క్లిష్ట దశలో ఉన్న మాట వాస్తవమే.. కానీ పసుపు సైన్యం పుంజుకుంటుందని ఆశిస్తున్నాం." అని ఒక అభిమాని ఆవేదన చెందారు..
మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ తన అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే తక్షణమే వ్యూహాలను మార్చుకోవాలి. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో క్రమశిక్షణ, బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించాల్సి ఉంది. వచ్చే మ్యాచ్‌ల్లో గెలిచి విజయపథంలోకి రాకపోతే ఈ సీజన్ సీఎస్కే చరిత్రలోనే అత్యంత దారుణమైన సీజన్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. చెన్నై మళ్లీ గర్జిస్తుందా? లేక ఈ పతనం కొనసాగుతుందా? అన్నది వేచి చూడాలి.
