Begin typing your search above and press return to search.

చెపాక్ లో చెక్.. చెన్నై కోట కూలుతోంది.. సూపర్ కింగ్స్ కు రెడ్ అలర్ట్

ఐపీఎల్ లో ఏ జట్టుకైనా సొంతగడ్డే అడ్డా. తమకు అలవాటైన గ్రౌండ్ లో చెలరేగిపోవడం ఆయా జట్లకు మొదటినుంచి ఉన్నదే.

By:  Tupaki Desk   |   7 April 2025 3:40 AM
చెపాక్ లో చెక్.. చెన్నై కోట కూలుతోంది.. సూపర్ కింగ్స్ కు రెడ్ అలర్ట్
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ దిగ్గజ జట్లకు పీడకలే. ఐదుసార్లు చాంపియన్లు అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లకు గడ్డు కాలమే. ఈ రెండు జట్లూ సమానంగా టైటిల్ కొట్టినా.. రెండింటిలో మేటి ఏదంటే చెన్నైనే. కానీ, ఇప్పుడు సూపర్ కింగ్స్ ఫ్లాప్ కింగ్స్ గా మిగిలిపోతారా? అనిపిస్తోంది.

ఐపీఎల్ లో ఏ జట్టుకైనా సొంతగడ్డే అడ్డా. తమకు అలవాటైన గ్రౌండ్ లో చెలరేగిపోవడం ఆయా జట్లకు మొదటినుంచి ఉన్నదే. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ గురించి మరింతగా చెప్పుకోవాలి. వారి హోం గ్రౌండ్ అంటే చెన్నై చెపాక్ మైదానం.

ధనాధన్ లీగ్ లో చెపాక్ మైదానానిది ప్రత్యేకత. ఇక్కడ స్పిన్ దే రాజ్యం. చెన్నై రవీంద్ర జడేజా నుంచి నూర్ అహ్మద్ వరకు స్పిన్ నే నమ్ముకుంది. చాలాసార్లు గెలుస్తూ వస్తోంది. ఈసారి మాత్రం చెపాక్ లో చెక్ పడుతోంది.

స్లో వికెట్ అయిన చెపాక్ లో ధోనీ టీమ్ గతంలో ఎన్నో మ్యాచ్ లను తమవైపు తిప్పుకొంది. ఈ సీజన్ లో మాత్రం గుక్క తిప్పుకోలేకపోతోంది. వరుస ఓటములుతో అసలు ఇది సూపర్ కింగ్స్ జట్టేనా అనిపిస్తోంది.

చెన్నైని చెన్నైలో ఓడించడం అంటే ఏ జట్టుకైనా ఇప్పటివరకు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చేరినంత గొప్ప. కానీ, ప్రస్తుతం చెపాక్ లో సూపర్ కింగ్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్టు కూడా అలవకోగా కొట్టేసింది.

ఎప్పుడో లీగ్ మొదలైన 2008లో చెన్నైని చెపాక్ లో ఓడించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. మళ్లీ ఈ సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని జట్టుకు ఓటమి రుచి చూపించింది. అది కూడా 50 పరుగుల తేడాతో.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాదిరే ఇక 18 సీజన్లుగా లీగ్ లో ఆడుతూ ఒక్కసారీ టైటిల్ కొట్టని జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. తెలుగు వారి భాగస్వామ్యం ఉన్న ఏకైక ఐపీఎల్ టీమ్ అయిన ఢిల్లీ 2019కి ముందు ఢిల్లీ డేర్ డెవిల్స్ గా ఉంది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ గా మారింది.

ఇన్నేళ్లలో చెన్నైలో సూపర్ కింగ్స్ ను ఓడించినది ఒకే ఒక్కసారి. అది కూడా 15 ఏళ్ల కిందట. శనివారం జరిగిన మ్యాచ్ లో మాత్రం చెన్నైని కొట్టేసింది. ఈ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది అనడంలో సందేహం లేదు.

కంచుకోట అంటే.. ప్రత్యర్థిని అవలీలగా ఓడించే చోటు. చెన్నైకి చెపాక్ అలాంటిదే. ఇక్కడ గెలిచిన మ్యాచ్ లతోనే ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ, ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్ లలో చెపాక్ లో చెక్ పడింది.

చెన్నై ప్రస్తుత పరిస్థితికి కారణం.. ఆ జట్టు కూర్పే. నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లు ఉండి కూడా చెపాక్ లో ఓడిపోతుండడానికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధానం. చెన్నై ఓపెనర్లు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే లేదా రుతురాజ్ గైక్వాడ్ నుంచి మిడిలార్డర్ లోని విజయ్ శంకర్, శివమ్ దూబె, ధోనీ ఎవరూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే పరిస్థితిలో లేరు. సొంతగడ్డపైనే ఇలా ఉంటే ప్రత్యర్థి జట్ల గ్రౌండ్ లో ఏమాత్రం రాణిస్తారో..?

ఐపీఎల్ -18లో ఇప్పటివరకు చెన్నై ఆడిన తీరు చూస్తుంటే ఈ సీజన్ పై ఆశలు వదులుకోవాల్సిందే. ఆ జట్టును వచ్చే సీజన్ కు ప్రక్షాళన చేసుకోవాల్సిందే.