Begin typing your search above and press return to search.

రుతు రాజ్ స్థానంలో మోస్ట్ అండర్ టాలెంటెడ్ ప్లేయర్.. తెలుగోడికి చాన్సుందా?

రుతురాజ్ దూరమైన నేపథ్యంలో చెన్నై ఎవరిని తీసుకుంటుందా? అని ఆసక్తి నెలకొంది. దీనిప్రకారం అయితే, ముంబైకి చెందిన టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్ మన్ పృథ్వీ షాను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 April 2025 5:36 PM IST
రుతు రాజ్ స్థానంలో మోస్ట్ అండర్ టాలెంటెడ్ ప్లేయర్.. తెలుగోడికి చాన్సుందా?
X

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం తీవ్ర కష్టాల్లో ఉంది. గెలిపించే బ్యాట్స్ మెన్ లేరు.. మ్యాచ్ ను మలుపుతిప్పే బౌలర్లు లేరు.. ఆల్ రౌండర్లు ఆదుకోవడం లేదు.. వీటికితోడు కెప్టెన్ ఏకంగా గాయంతో లీగ్ నుంచే ఔట్ అయ్యాడు. మరి అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? తెలుగు కుర్రాడికి చాన్సుందా?

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయంతో ఐపీఎల్ 18వ సీజన్ మిగతా మ్యాచ్ లకు దూరమయ్యాడు. అసలే బ్యాటింగ్ బలహీనత వేధిస్తున్న చెన్నైకి రుతురాజ్ లేకపోవడం పెద్ద లోటు.

రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే ప్రస్తుతం చెన్నై జట్టు ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. వాస్తవానికి రుతురాజ్ స్వయంగా ఓపెనర్. అయితే జట్టు అవసరాల రీత్యా అతడు వన్ డౌన్ లో వస్తున్నాడు. సరైన ఓపెనర్ ఉంటే రచిన్ ను నాలుగో స్థానంలో ఆడించేందుకు చెన్నై యోచన చేస్తుందేమో?

రుతురాజ్ దూరమైన నేపథ్యంలో చెన్నై ఎవరిని తీసుకుంటుందా? అని ఆసక్తి నెలకొంది. దీనిప్రకారం అయితే, ముంబైకి చెందిన టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్ మన్ పృథ్వీ షాను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అతడిని మెగా వేలంలో ఎవరూ కొనలేదు. రూ.75 లక్షలే అయినప్పటికీ ఫామ్ లో లేకపోవడం, ప్రవర్తన బాగోకపోవడంతో షాను ఏ జట్టూ తీసుకోలేదు. రుతురాజ్ బదులు చెన్నై షాను తీసుకుంటుందని చెబుతున్నారు.

ఇక రుతురాజ్ స్థానాన్ని షాతో భర్తీ చేసినా తుది జట్టులో మాత్రం అతడికి చోటు కష్టమే. ఎందుకంటే చెన్నై చూపంతా 17 ఏళ్ల ముంబై కుర్రాడు ఆయుష్ మాత్రేపై ఉందట. ఓపెనింగ్ బ్యాటర్ అయిన మాత్రేను చెన్నై గత వారమే తమ ప్రాక్టీస్ లో చేర్చింది. మెగా వేలంలో అతడిని ఎవరూ కొనలేదు. అయితే, చిన్న వయసులోనే ప్రతిభావంతుడైన బ్యాటర్ గా పేరుతెచ్చకున్న మాత్రేను ఆడించే యోచనలో ఉంది.

ఇక చెన్నై జట్టులో ఉన్న తెలుగోడు షేక్ రషీద్. రూ.30 లక్షల ధరకు అతడిని చెన్నై రెండేళ్లుగా తీసుకుంటోంది. మ్యాచ్ మాత్రం ఆడించడం లేదు. ఇప్పుడు రషీద్ కు అవకాశం దొరుకుతుందా? అనేది చూడాలి. అచ్చమైన క్రికెట్ షాట్లు ఆడే రషీద్ టి20ల్లో ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరం.