Begin typing your search above and press return to search.

ఓడినా తిలక్ వర్మ మెరుపులు మాత్రం గుర్తుండిపోతాయ్

ఈ మ్యాచ్ లో తన అద్భుత ఆటతీరుతో అందరిలోనూ హైలెట్ అయ్యాడు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:24 AM GMT
ఓడినా తిలక్ వర్మ మెరుపులు మాత్రం గుర్తుండిపోతాయ్
X

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవటం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో తన అద్భుత ఆటతీరుతో అందరిలోనూ హైలెట్ అయ్యాడు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ. తాను ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ లోనూ తన ఆటతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. బ్యాటింగ్ చేయటానికి ముందు కళ్లు చెదిరే క్యాచ్ ను అందుకున్న అతను.. టీమిండియాకు సరికొత్త అస్త్రమన్న అభిప్రాయాన్ని కలిగించాడు.

బ్యాట్ తో చెలరేగిపోయి.. అందరికి గుర్తుండిపోయేలా చేశాడు. అరంగ్రేటంలోనే అదరేసిన అతను.. తాను ఎదుర్కొన్న రెండో బంతిని సిక్సుగా మలిచిన అతను.. తర్వాతి బంతిని సిక్సుగా మలచటం అందరి చేత వావ్ అనేలా చేశాడు. తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లో తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లో రెండింటిని సిక్సులుగా మలిచిన వైనం అందరిని వావ్ అనేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్.. ఇషాన్ కిషన్.. సూర్యకుమార్ యాదవ్.. హార్దిక్ పాండ్యా లాంటి బ్యాటర్లు ఫెయిల్ అయితే.. అందుకు భిన్నంగా తాను ఎదుర్కొన్న 22 బంతుల్లో 39 పరుగుల్ని సాధించటం ద్వారా అదరగొట్టాడు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లో రెండు సిక్సుల్ని సాధించిన అతను నాలుగో బంతిని ఫోర్ గా మలిచాడు. మొత్తంగా మూడు సిక్సులు.. రెండు ఫోర్లు బాది మాంచి ఊపు మీద ఉన్నప్పటికీ.. చిన్నపాటి తప్పిదంతో ఔట్ అయ్యాడు. అయినప్పటికీ అందరి మదిలో మాత్రం రిజిస్టర్ అయ్యాడు.

బ్యాటింగ్ కు ముందు ఫీల్డింగ్ లోనూ తిలక్ వర్మ అదరగొట్టాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో వెస్టిండీస్ బ్యాటర్ జాన్సన్ చార్ల్స్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టారు. అయితే.. బంతి గాల్లో ఎత్తుగా వెళ్లటంతో క్యాచ్ పట్టే అవకాశం లభించింది. మెరుపు వేగంతో స్పందించిన తిలక్ వర్మ.. దాదాపు పది మీటర్ల దూరం పరుగెత్తుకుంటూ వచ్చి.. డ్రైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్న వైనం వావ్ అనేలా మారింది. దీనికి సంబంధించిన చిట్టి వీడియో అందరిని ఆకట్టుకుంది. అద్భుతమైన క్యాచ్ తో ఒకసారి.. బ్యాట్ తో మరోసారి తన తొలి మ్యాచ్ లో తన ఆటతో పలువురి మనసుల్ని గెలుచుకున్నాడీ హైదరాబాదీ క్రికెటర్.