Begin typing your search above and press return to search.

'అయ్యారే..' వంద రోజుల్లోనే బీసీసీఐకి అంత చేదయ్యారే

టీమిండియా 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం నంబర్ 4లో సరైన బ్యాట్స్ మన్ లేకపోవడం

By:  Tupaki Desk   |   29 Feb 2024 5:30 PM GMT
అయ్యారే.. వంద రోజుల్లోనే బీసీసీఐకి అంత చేదయ్యారే
X

సరిగ్గా వంద రోజుల కిందట అతడు ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ లో ఆడాడు. జట్టును ఫైనల్ చేరడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు.. కీలకమైన సెమీఫైనల్లో అదికూడా ప్రమాదకర ప్రత్యర్థి న్యూజిలాండ్ పై కేవలం 70 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఫైనల్లో విఫలం అయినప్పటికీ.. టోర్నీ మొత్తం 11 మ్యాచ్ లు ఆడిన అతడు 530 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. దీంతో టీమిండియాకు గొప్ప మిడిలార్డర్ బ్యాట్స్ మన్ దొరికాడని ఖరారైంది. కానీ, చివరకు చూస్తే అంతా తలకిందులైంది. దీనిపై కేవలం 100 రోజుల్లో ఎంత మార్పు? అని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రేయస్కరమేనా?

టీమిండియా 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం నంబర్ 4లో సరైన బ్యాట్స్ మన్ లేకపోవడం. అయితే, ఆ లోటును తీర్చాడు ముంబై బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్. 2023 ప్రపంచ కప్ లో అయితే లోటు కనిపించనతగా ఆడాడు. దీంతోనే టీమిండియా సునాయాసంగా ఫైనల్ చేరింది. ప్రపంచ కప్ లొ రెండు సెంచరీలు కూడా కొట్టాడు అయ్యర్. అలాంటివాడు టెస్టుల్లోనూ కొంత కాలంగా నిలకడగా ఆడుతున్నాడు. ఐదో నంబరు బ్యాట్స్ మన్ గా కీలకమైన పరుగులు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ లోనూ చోటుదక్కించుకున్నాడు. తొలి రెండు టెస్టులు ఆడినప్పటికీ వెన్నుగాయంతో మూడో మ్యాచ్ నుంచి జట్టుకు దూరమయ్యాడు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ జరిగింది.

పాత వెన్ను నొప్పితో

అయ్యర్ కు గాయాలు కొత్త కాదు. ప్రపంప చకప్ ముందు కూడా అతడు గాయపడ్డాడు. వెన్నునొప్పి కొంతకాలంగా వేధిస్తోంది. దీంతోనే పలుసార్లు జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో వెన్నునొప్పి అని చెప్పడంతో సెలక్టర్లు, టీమ్ మేనేజ్ మెంట్ నమ్మింది. కానీ, అయ్యర్ కు అంతా ఓకేనని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సర్టిపికెట్ ఇవ్వడంతోనే కథ అడ్డం తిరిగింది. అంతా బాగానే ఉన్నప్పుడు.. రంజీ ట్రోఫీ ఆడాలంటూ బీసీసీఐ కోరింది. రిస్క్ ఎందుకు అనుకున్నాడేమో..? దీనిని అయ్యర్ పెడచెవిన పెట్టాడు. ముంబైలో జరిగే డీవై పాటిల్ టి20 సిరీస్ కు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. దీనికిముందు ముంబై ఆడిన రంజీ క్వార్టర్ ఫైనల్లో మాత్రం పాల్గొనలేదు. ఇది బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. బుధవారం ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అయ్యర్ ను తప్పించింది.

బి గ్రేడ్ నుంచి బయటకు

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో అయ్యర్ మొన్నటివరకు ‘బి’ గ్రేడ్ లో ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీలో ఉన్నాడు. ఇప్పుడు పూర్తిగా కాంట్రాక్టే లేదు. అయితే, మళ్లీ కాంట్రాక్ట్‌ దక్కించుకోవాలంటే శ్రేయస్‌ చాలా కష్టపడాలి. దేశవాళీ క్రికెట్ లో తరచూ ఆడాలి. ఫామ్‌, ఫిట్‌నెస్‌ కీలకం. అన్నిటికి మించి బీసీసీఐ షరతులను అంగీకరించాలి. ఇక ఐపీఎల్‌ లో అద్భుతంగా ఆడితే టి20 ప్రపంచ కప్‌ నాటికి అయ్యర్ కు మళ్లీ పిలుపురావొచ్చు. ఇతడితో పాటే కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ కు కూడా ఇదే వర్తిస్తుంది.