Begin typing your search above and press return to search.

అండర్ 19లో ఓ సచిన్.. ఇతడూ అక్కడినుంచే.. చెప్పుకోవాల్సిందే

భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ ఓ దేవుడు. ఆ దిగ్గజం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు

By:  Tupaki Desk   |   8 Feb 2024 2:30 AM GMT
అండర్ 19లో ఓ సచిన్.. ఇతడూ అక్కడినుంచే.. చెప్పుకోవాల్సిందే
X

245 పరుగుల టార్గెట్.. అదీ ప్రపంచ కప్ సెమీఫైనల్లో.. అంతేకాక ప్రత్యర్థి సొంతగడ్డపై.. ఛేజింగ్ లో ప్రారంభం చూస్తే 4-32.. ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో ఒక జట్టు గెలవడం సాధ్యమా...? అదికూడా అండర్ 19 స్థాయిలో..కానీ, సాధ్యమే అని నిరూపించాడు ఆ కుర్రాడు. తీవ్ర క్లిష్ట సందర్భంలో క్రీజులోకి దిగి.. బౌండరీల మీద బౌండరీలు కొడుతూ ముందుగా ఒత్తిడిని పోగొట్టాడు. ఆపై నిలకడగా ఆడుతూ గెలుపు తీరానికి చేర్చాడు. అందుకే ఎవరా కుర్రాడు? అని ఇప్పుడు దేశమంతా వెదుకుతోంది.

భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ ఓ దేవుడు. ఆ దిగ్గజం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 24 ఏళ్ల పాటు జట్టును భుజాలపై మోశాడు. బహుశా ఆయన మీద ఇష్టంతోనే ఏమో..? ఆ తల్లిదండ్రులు తమ కుమారుడికీ సచిన్ అనే పేరు పెట్టుకున్నారు. అతడిలాగే క్రికెటర్ ను చేయాలనుకున్నారు. ఆ కుర్రాడు కూడా తన పేరును నిలబెట్టేలా ఆడుతూ అదరగొడుతున్నాడు. ఇదంతా అండర్ 19 భారత జట్టు మిడిలార్డర్ బ్యాట్స్ మన్ సచిన్ దాస్ గురించి.

ఆ ఇన్నింగ్స్ సెంచరీ కంటే ఎక్కువే..

దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 245 టార్గెట్ ఛేదనలో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్ కూడా ఔటయిపోయారు. ఇంకేం.. మన జట్టు ఇంటి బాట పట్టడం ఖాయం అనిపించింది. కానీ, కెప్టెన్ ఉదయ్ సహారన్ తో కలిసి సచిన్ దాస్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఐదో వికెట్ కు 171 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. వాస్తవానికి ఆరో స్థానంలో దిగిన సచిన్ వస్తూనే బౌండరీలు బాది పరిస్థితిని తేలిక చేశాడు. ఉదయ్ ఓవైపు వికెట్ ను కాచుకుంటూ ఉండగా.. సచిన్ చెలరేగాడు. రన్ రేట్ పెరగకుండా ఉండేందుకు బౌండరీలు కొడుతూ పోయాడు. 95 బంతుల్లో 96 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్, 11 ఫోర్లు ఉండడం విశేషం. అయితే, జట్టు విజయం ఖాయమైన దశలో సెంచరీ ముంగిట సచిన్ ఔటయ్యాడు. లేదంటే వరుసగా రెండో సెంచరీ సాధించినవాడు అయ్యేవాడు. సచిన్ నేపాల్ మీద కూడా సెంచరీ (116) కొట్టాడు.

సచిన్‌ స్వస్థలం మహారాష్ట్రలోని బీడ్‌. ఈయన తండ్రి సంజయ్‌ దాస్‌. మొదట సునీల్ గావస్కర్ ను అనంతరం సచిన్‌ టెండూల్కర్ ను ఇష్టపడేవాడు. అందుకే కుమారుడికి సచిన్‌ పేరు పెట్టాడ. సచిన్ ధరించిన 10వ నంబర్ జెర్సీనే వేసుకునేవాడు కుర్ర సచిన్‌ దాస్‌. స్ఫూర్తి కోసం ఇలా చేసేవాడు. అయితే, సంజయ్‌ దాస్ యూనివర్సిటీ స్థాయి క్రికెట్ దాటి ముందుకువెళ్లలేకపోయాడు.. కుమారుడిని మాత్రం గొప్ప క్రికెటర్‌గా చూడాలని ఆశ పడ్డాడు. అప్పు చేసి మరీ టర్ఫ్ పిచ్‌ తయారు చేయించాడు. దానిపై నీరు చల్లించేందుకు రెండు లేదా మూడు రోజులకోసారి వాటర్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేశాడు. ఇక సచిన్ దాస్‌ చిన్ననాటి కోచ్ అజహర్‌. అతడు కూడా సంజయ్‌ కష్టాన్ని గుర్తించేవాడు. కాగా, సచిన్‌ దాస్‌ మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్ లో కొల్హాపుర్‌ టస్కర్స్‌ తరఫున మెరుగైన ప్రదర్శన చేయడమే అండర్ 19 వరల్డ్‌ కప్‌ వరకు తీసుకొచ్చింది.