6 జట్లు.. అందులో అమెరికా.. 128 ఏళ్లకు ఒలింపిక్స్ లో క్రికెట్ మజా
అయితే, మరో మూడేళ్లలో జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లో క్రికెట్ కనువిందు చేసింది. అంటే.. 128 ఏళ్ల తర్వాత అన్నమాట.
By: Tupaki Desk | 10 April 2025 3:01 PM ISTటి20లు, వన్డేలకు ప్రపంచ కప్.. టెస్టులకు ప్రపంచ చాంపియన్ షిప్.. ఇవికాక మరెన్నో టోర్నీలు.. కానీ, విశ్వ క్రీడలు ఒలింపిక్స్ లో మాత్రం క్రికెట్ ఎప్పుడు..?
ప్రపంచ యుద్ధాలకు ముందు.. ఎప్పుడో 1900 సంవత్సరంలో.. పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో క్రికెట్ భాగమైంది.. మళ్లీ ఆ తర్వాత ఆధునిక ఒలింపిక్స్ లో క్రికెట్ మాటే వినిపించలేదు.
అయితే, మరో మూడేళ్లలో జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లో క్రికెట్ కనువిందు చేసింది. అంటే.. 128 ఏళ్ల తర్వాత అన్నమాట. వచ్చే ఒలింపిక్స్ ను అమెరికా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులోనే క్రికెట్ భాగమైంది.
కాగా, ఒలింపిక్స్ లో అన్నీ తక్కువ సమయంలో ముగిసే క్రీడలే. క్రికెట్ ఒక్కటే ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. కాబట్టి టి20 ఫార్మాట్లోనే నిర్వహించే వీలుంది. జట్ల సంఖ్య కూడా తక్కువే. ఆరు మాత్రమే పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ప్రపంచ క్రికెట్ లో అమెరికా చాలా చిన్న జట్టు. కానీ, ఆతిథ్య దేశం హోదాంలో అమెరికాకు ఒలింపిక్స్ ఎంట్రీ దక్కనుంది.
ఇక ఆరు జట్లు పురుషులు, మహిళల విభాగాల్లో పోటీ పడనున్నాయి. అర్హత ప్రక్రియను ఇంకా నిర్ణయించలేదు. ఆతిథ్య అమెరికా పోగా ఐదు జట్లు ఏవనేది చూడాలి. బహుశా టి20 ర్యాంకింగ్స్ లో టాప్ 5లో ఉన్నవాటికి చోటు దక్కుతుందేమో? టి20 ప్రపంచ చాంపియన్ అయిన టీమ్ ఇండియాకు కచ్చితంగా చోటు ఉంటుంది.
లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ ఈవెంట్ ప్రోగ్రామ్ ఆమోదం పొందింది. మొత్తం 351 మెడల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. క్రికెట్ తో పాటు బేస్ బాల్- సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లక్రాస్ (సిక్సస్), స్క్వాష్ కూడా ఈసారి క్రీడల జాబితాలో ఉన్నాయి.
ఒలింపిక్స్ లో క్రికెట్ 1900లో మొదటిసారే కాదు.. చివరిసారి కూడా. అప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ 1, 2 స్థానాల్లో నిలిచాయి.
