భారత క్రికెట్ లో ఓ శకం ముగిసింది... దిగ్గజ క్రికెటర్ రిటైర్మెంట్
భారత క్రికెట్ లో వాల్ అంటే రాహుల్ ద్రవిడ్.. 16 ఏళ్లు అతడు జట్టు బ్యాటింగ్ కు ఓ మూలస్తంభంగా నిలబడ్డాడు.
By: Tupaki Desk | 24 Aug 2025 3:49 PM ISTభారత క్రికెట్ లో వాల్ అంటే రాహుల్ ద్రవిడ్.. 16 ఏళ్లు అతడు జట్టు బ్యాటింగ్ కు ఓ మూలస్తంభంగా నిలబడ్డాడు. అతడు రిటైర్మెంట్ సమయానికి అలాంటి మరొక బ్యాట్స్ మన్ దేశానికి అవసరమయ్యాడు. కానీ, ఎవరు దొరుకుతారు..? అని చూస్తే.. ద్రవిడ్ స్థానం తనదేనంటూ ఓ క్రికెటర్ ముందుకొచ్చాడు. పదేళ్లకు పైగా బ్యాటింగ్ భారాన్ని మోశాడు. నాలుగేళ్లుగా జట్టుకు దూరమైన అతడు ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అచ్చం ద్రవిడ్ తరహాలోనే చెక్కుచెదరని డిఫెన్స్ తో జట్టుకు పెట్టని కోటలా నిలిచిన అతడు ఇక ఆట చాలించాడు.
నయ వాల్ తొలగింది...
టెస్టు బ్యాట్స్ మన్ చతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు. అన్ని ఫార్మాట్లకు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. వాస్తవానికి పుజారా టెస్టుల్లో మాత్రమే ఉన్నాడు. వన్డేలకు అతడిని ఎప్పుడూ పరిగణించలేదు. ఒకటీ, రెండు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పుడు టెస్టుల నుంచి కూడా తప్పుకొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు ఆదివారం ప్రకటన చేశాడు. టీమ్ ఇండియా జెర్సీ ధరించడం, మైదానంలో జాతీయగీతం ఆలాపన, జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం తన జీవితంలో మధురానుభూతలని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
రాజ్ కోట్ నుంచి...
గుజరాత్ లోని రాజ్ కోట్ నగరానికి చెందిన పుజారా సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఇప్పుడు అదే సంగతి గుర్తుచేసుకుంటూ.. రాజ్ కోట్ కుర్రాడు దేశానికి ఆడాడు అనే కల నెరవేరిందని, రాష్ట్రం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం అని పేర్కొన్నాడు. తన కెరీర్ ఎదుగుదలకు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఎంతో సాయం చేసిందని చెప్పుకొచ్చాడు. ఇక మీదట మరింత సమయం కుటుంబానికి కేటాయిస్తానని తెలిపాడు.
వందకు పైగా టెస్టుల్లో...
పుజారా దేశానికి 103 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2010లో ఆస్ట్రేలియాపై తొలి టెస్టు ఆడాడు. 22 సెంచరీలు (ఇందులో మూడు డబుల్ సెంచరీలు), 35 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 7,195 పరుగులు చేశాడు. పూర్తిగా టెస్టు బ్యాట్స్ మన్ గా ముద్ర పడిన పుజారా ఐదు వన్డేలే ఆడాడు. 51 పరుగులు సాధించాడు. 2023లో ఆస్ట్రేలియాపైనే చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.
ఫామ్ కోల్పోయి.. జట్టుకు దూరమై..
2018-19 ఆస్ట్రేలియా టూర్ లో 1200 పైగా బంతులను ఎదుర్కొని మూడు సెంచరీలు సహా అద్భుతంగా రాణించిన పుజారా ఆ తర్వాత 2021-21 టూర్ లోనూ రాణించాడు. ఓ టెస్టులో 200 పైగా బంతులు ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ రెండు సిరీస్ లను భారత్ గెలుచుకోవడం గమనార్హం. అయితే, పుజారా బ్యాటింగ్ మరీ నెమ్మదిగా సాగుతుండడం, ఇటీవలి కాలంలో దూకుడైన ఆట ఉన్న కుర్రాళ్లు దూసుకురావడంతో పుజారాకు జట్టులో చోటు కష్టమైంది. రెండేళ్ల కిందట ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఆడిన పుజారాను మళ్లీ సెలక్టర్లు కరుణించలేదు. దీంతో 37 ఏళ్ల పుజారా క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
నాలుగో క్రికెటర్...
ఈ ఏడాది జనవరిలో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు పుజారా వంతు.
