ఐపీఎల్ ఫైనల్లో చాహల్ చెత్త రికార్డు.. ఆర్సీబీకి మాజీ భార్య కంగ్రాట్స్
టీమ్ ఇండియా మణికట్టు స్పిన్నర యుజ్వేంద్ర చాహల్ కు వ్యక్తిగతంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది..
By: Tupaki Desk | 5 Jun 2025 5:00 PM ISTటీమ్ ఇండియా మణికట్టు స్పిన్నర యుజ్వేంద్ర చాహల్ కు వ్యక్తిగతంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది.. ఇటీవలి ఐపీఎల్ సీజన్ కు ముందు అతడికి భార్య ధనశ్రీతో విడాకులు అయ్యాయి. ఈ కేసు తెమిలేందుకు టైమ్ పట్టడంతో చహల్ కాస్త ఆలస్యంగా లీగ్ లోకి వచ్చాడు. అయినప్పటికీ తనను కొనుక్కున్న పంజాబ్ కింగ్స్ కు న్యాయం చేశాడు. మంచి బౌలింగ్ తో పంజాబ్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, ఫైనల్లో ఓటమితోనే చాహల్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది.
2013 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్న చహల్ ఇప్పటివరకు మూడు ఫైనల్స్ ప్రాతినిధ్యం వహించాడు. కానీ, అతడి జట్టు ఏదీ కూడా టైటిల్ కొట్టలేదు. విచిత్రం ఏమంటే.. 2016లో చాహల్ ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి పంజాబ్ పై గెలిచింది. ఇక చాహల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడాడు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ కప్ కొట్టింది. తాజాగా మణికట్టు స్పిన్నర్ పంజాబ్ కు ఆడగా.. ఈ జట్టు ఫైనల్లో ఓడిపోయింది. ఇలా మూడు ఫ్రాంచైజీలకు ఫైనల్స్ ఆడినా ఒక్కసారీ కప్ అందుకోని ఆటగాడిగా చాహల్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా గతలో మూడు ఐపీఎల్ ఫైనల్స్ ఆడినా అది బెంగళూరుకు మాత్రమే. కానీ, చాహల్ మూడు జట్లకు ఆడాడు.
ఇంకో విశేషం ఏమంటే.. చాహల్ ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. 174 మ్యాచ్ లలో 221 వికెట్లు పడగొట్టాడు అతడు. తాజా సీజన్ లో 14 మ్యాచ్ లాడి 16 వికెట్లు తీశాడు.
చాహల్ ను ఉడికించాలని అనుకుందో ఏమో, అతడి మాజీ భార్య, నటి-కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ.. ఐపీఎల్ టైటిల్ కొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును అభినందిస్తూ పోస్ట్ పెట్టింది. విరాట్ కోహ్లి ఐపీఎల్ టైటిల్ పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ఎట్టకేలకు 18కి (కోహ్లి జెర్సీ నంబరు) 18 (ఐపీఎల్ 18వ సీజన్ టైటిల్)‘‘.., ’’కంగ్రాట్స్ విరాట్ కోహ్లి, అండ్ ద టీమ్’’.. అంటూ ధనశ్రీ వర్మ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ పై బెంగళూరు గెలిచిన సంగతి తెలిసిందే. అంటే.. తన మాజీ భర్త ఆడిన టీమ్ ఓటమిని ధనశ్రీ ఇలా పండుగ చేసుకుందన్నమాట.
