Begin typing your search above and press return to search.

22 ఏళ్లకే 5 గ్రాండ్ స్లామ్ లు.. కాబోయే టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ అతడే

ఇలాంటి సమయంలో నేనున్నానంటూ ఒక కుర్రాడు వచ్చాడు.. భవిష్యత్ టెన్నిస్ స్టార్ తానేనని సత్తా చాటుతున్నాడు. కేవలం 22 ఏళ్లకే ఐదు గ్రాండ్ స్లామ్ లు.. వీటిలో మూడు వేర్వేరు వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి తానేమిటో ప్రపంచానికి చాటాడు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 4:09 PM IST
22 ఏళ్లకే 5 గ్రాండ్ స్లామ్ లు.. కాబోయే టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ అతడే
X

కొన్నేళ్లుగా ప్రపంచ టెన్నిస్ కళ తప్పుతోంది.. హోరాహోరీ మ్యాచ్ లు లేక గ్రాండ్ స్లామ్ లు వెలవెలబోతున్నాయి.. దిగ్గజ ఆటగాళ్లు ముర్రే, ఫెదరర్, నాదల్ రిటైర్ కావడం.. జకోవిచ్ గాయాలు, వైఫల్యంతో అభిమానుల్లోనూ అనాసక్తి ఏర్పడుతోంది.. గ్రేటెస్ట్ ఆఫ్ ల్ టైమ్ (జీవోవీటీ –గోట్)ల టైమ్ ముగిసిందనే అభిప్రాయం కలుగుతోంది.. ఇలాంటి సమయంలో నేనున్నానంటూ ఒక కుర్రాడు వచ్చాడు.. భవిష్యత్ టెన్నిస్ స్టార్ తానేనని సత్తా చాటుతున్నాడు. కేవలం 22 ఏళ్లకే ఐదు గ్రాండ్ స్లామ్ లు.. వీటిలో మూడు వేర్వేరు వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి తానేమిటో ప్రపంచానికి చాటాడు.

సంప్రాస్, అగస్సీ శకం ముగిశాక.. ఫెదరర్, నాదల్ ప్రాభవం తగ్గాక.. ముర్రే కూడా తప్పుకొన్నాక.. జకోవిచ్ కెరీర్ చరమాంకంలో ఉండగా.. ఇప్పుడు అల్కరాజ్ రాజ్యం నడుస్తోంది. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ఈ 22 ఏళ్ల స్పెయిన్ కుర్రాడు.. కెరీర్ లో ఐదో గ్రాండ్ స్లామ్ సాధించాడు. మరీ ముఖ్యంగా ఆదివారం నాటి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అతడు గెలిచిన తీరును ఇప్పుడు ప్రపంచం అంతా అద్భుతం అని అంటోంది. అల్కరాజ్ ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా కొట్టేస్తే టెన్నిస్ లోని నాలుగు గ్రాండ్ స్లామ్ లు (వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్) గెలిచి.. ఆల్ రౌండ్ ఆటగాడిని అని నిరూపించుకుంటాడు.

ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఇటలీ ఆటగాడు సినెర్ ను అల్కరాజ్ మట్టికరిపించిన తీరు నభూతో అని చెప్పాలి. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 5.29 గంటల పాటు సాగిన ఈ ఫైనల్ చరిత్రకెక్కింది. 43 ఏళ్ల కిందట 1982లో మాట్స్ విలాండర్-విలాస్ మధ్య మ్యాచ్ 4.42 గంటల పాటు జరగ్గా.. ఇప్పుడు దానికంటే దాదాపు 47 నిమిషాలు అదనంగా సాగింది. ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను 4-6తో, రెండో సెట్ ను ట్రైబ్రేకర్ లో 6-7(4-7)తో కోల్పోయిన అల్కరాజ్.. తర్వాత 6-4, 7-6(7-3), 7-6(10-2)తో మూడు సెట్లు గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ చక్రవర్తిగా అవతరించాడు. ఇప్పటివరకు ఫ్రెంచ్ ఓపెన్ అంటే నాదల్ పేరే గుర్తుకొచ్చేది. ఇకమీదట అల్కరాజ్ పేరూ వినిపించనుంది. నాదల్, గుస్తావో కుయెర్టన్ తర్వాత ఈ గ్రాండ్ స్లామ్ ను నిలబెట్టుకున్నది అల్కరాజే కావడం మరో విశేషం. 2022లో 19 ఏళ్ల వయసులో యూఎస్ ఓపెన్ నెగ్గడం ద్వారా అల్కరాజ్ శకం మొదలైంది. 2023, 2024 వింబుల్డన్, 2024, 205 ఫ్రెంచ్ ఓపెన్ కైవసంతో అల్కరాజ్ భవిష్యత్ ఆల్ టైమ్ గ్రేట్ కాగల సత్తా తనకు ఉందని నిరూపించుకున్నాడు. తర్వలో జరగబోయే వింబుల్డన్ లో ఎలా చెలరేగుతాడో చూడాలి మరి..