Begin typing your search above and press return to search.

"జులాయి"లో డైలాగ్ ని నిజం చేస్తోన్న ఐపీఎల్ బెట్టింగ్... షాకింగ్ అమౌంట్!

ఈ విషయంలో ప్రధానంగా యువత పూర్తిగా తవ్వుదోవపడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   6 April 2024 10:30 AM GMT
జులాయిలో  డైలాగ్  ని నిజం చేస్తోన్న ఐపీఎల్  బెట్టింగ్... షాకింగ్  అమౌంట్!
X

ఇండియాలో క్రికెట్ అంటే ఒక క్రీడ మాత్రమే కాదు.. అంతకు మించి! పైగా ఇండియాలో క్రికెట్ పరంగా నడిచే వ్యాపారం అత్యధికం అని అంటుంటారు! క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ లో కంటే ఇండియాలోనే ఈ క్రీడకు ఆధరణ ఎక్కువ అని చెప్పినా అతిశయోక్తి కాదు! ఈ క్రమంలో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. దీంతో... బెట్టింగ్ రాయళ్ల సందడి ఆన్ లైన్, ఆఫ్ లైన్ లలో చెలరేగిపోతోందని అంటున్నారు. తాజాగా వెలుగులోకి వస్తోన్న లెక్కలు ఇవే విషయాన్ని వెల్లడిస్తున్నాయి!

అసలు బెట్టింగ్ అనేది భారత్ లో లీగలా.. కాదా? అంటే... దానికి వచ్చే సమాధానం... అవును, కాదు అని! ఇండియాలో బెట్టింగ్‌ కు సంబంధించి 1867 పబ్లిక్‌ గేమింగ్‌ చట్టాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. ఆ చట్టం ప్రకారం భారత్ లో బెట్టింగ్‌ చట్టవిరుద్ధం!! అయితే నైపుణ్యానికి సంబంధించిన గేమ్స్‌ లో బెట్టింగ్‌ లీగలే అని ఇదే చట్టం చెబుతోందని.. 1996లో గుర్రపు పందేలపై బెట్టింగ్‌ ను సుప్రీంకోర్టు చట్టబద్ధం చేసిందని గుర్తుచేస్తున్నారు!!

దీంతో... ఈ పాయింట్‌ నే హైలైట్‌ చేస్తూ ప్రస్తుతం లీగల్‌ బెట్టింగ్‌ పేరుతో భారత్ లో ఎన్నో ఆన్‌ లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యాపారాలు నడుస్తున్నాయని చెబుతుంటారు! పైగా క్రికెట్‌ ఆటలో అదృష్టం కంటే నైపుణ్యానికి సంబంధించిన గేమ్‌ కావడంతో దీనిపై బెట్టింగ్‌ లీగలే అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో... అనేక రకాల క్రికెట్ బెట్టింగ్ యాప్ లు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా ఐపీఎల్ లో భారీ సందడి చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో... ప్రస్తుతానికి చట్టబద్ధంగా ఆన్ లైన్ లో నడుస్తున్న క్రికెట్ బెట్టింగ్ విలువ సుమారు 500 కోట్ల డాలర్ల పైమాటే అని అంచనా వేస్తున్నారంట! అంటే... దాదాపు 40,000 కోట్ల రూపాయల పైమాటే అన్నమాట! అయితే... ఆఫ్ లైన్ లో జరిగే బెట్టింగ్ అమౌంట్ తో పోలిస్తే... ఇది చాలా చిన్న అమౌంట్ అని అంటున్నారు. కారణం... ఆ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ ఫర్ కాకపోవడమేనట! దీంతో.. ఆఫ్ లైన్ లో పాల్గొనేవారి సంఖ్య కూడా షాకింగ్ గా ఉందని అంటున్నారు!

ప్రస్తుతం తెరపైకి వస్తోన్న అంచనాల ప్రకారం... భారత్ లో బెట్టింగులు కాసేవారి సంఖ్య సుమారు 15 - 20 కోట్ల వరకూ ఉంటుందని.. ఇక క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే... వీరి సంఖ్య రెంట్టింపుకంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు! ఈ క్రమంలో... దేశంలో చట్టవిరుద్ధంగా ఆఫ్ లైన్ లో నడిచే బెట్టింగ్ విలువ సుమారు 15,000 కోట్ల డాలర్లని ఒక అంచనా! అంటే... దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట!

గ్రామాల నుంచి మెట్రోపాలిటన్ల వరకూ!:

ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే... గ్రామాల్లో సైతం లక్షల్లో బెట్టింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఆగడు సినిమాలో చెప్పినట్లుగా... "గేములు తక్కువే స్కీములు ఎక్కువ అన్నట్లుగా... స్కిక్స్ కొట్టిన కొహ్లీ చీర్ గర్ల్స్ కి సైట్ కొడతాడా కొట్టడా.. ఆడియన్స్ లో కూర్చున్న అంబానీ కొడుకు చిప్స్ తింటాడా, పప్స్ తింటాడా.. ఇలా వాళ్లు మ్యాచ్ లో వేసే బాల్స్ కంటే, బెట్టింగ్ లో స్కీములే ఎక్కువ" అన్నట్లుగా ఈ బెట్టింగ్ వ్యవహారం సాగుతుందని అంటున్నారు!

ఈ విషయంలో ప్రధానంగా యువత పూర్తిగా తవ్వుదోవపడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అప్పు చేస్తున్నారో, ఇంట్లో అడిగి తీసుకుంటున్నారో.. లేక, ఆ డబ్బులు సంపాదించడానికి తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారో తెలియదు కానీ.. చిన్న చిన్న గ్రామాల్లో, మండల హెడ్ క్వార్టర్స్ లో సైతం వందల రోజులు పోయి.. వేలు, లక్షల వరకూ కాలేజీ యువత బెట్టింగులు చేస్తున్నారని చెప్పడం ఇప్పుడు ఆందోళన కరంగా ఉంది!

చిన్న చిన్న గ్రామాల్లోనూ, మండలాల్లోనూ, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోనూ, చిన్న చిన్న మున్సిపాలిటీల్లోనే పరిస్థితి పీక్స్ కి చేరుతుందని అంటున్న దశలో... ఇక విశాఖ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ మొదలైన భారీ నగరాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది సామాన్యుడి ఊహకు అందని విషయం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇలా సాగుతున్న బెట్టింగులు ప్రధానంగా యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఫలితంగా పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయమంలో తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. కోరుకుంటున్నారు!!

సుమారు 12 ఏళ్ల క్రితం వచ్చిన ఒక తెలుగు సినిమాలో డైలాగ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు... "వైజాగ్ లో అంత బెట్టింగ్ జరుగుతుందా..?.. ఏంటిసర్ మాట్లాడుతున్నారు.. ఈస్ట్ వైజాగ్ లోని ఒక పబ్ లో ఈ ఒక్కరాత్రికి స్టేట్ బడ్జెట్ కి సరిపోయేటంత డబ్బు ఆడతారు!" అని!! తాజా అంచనాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంటుంది!

అయితే... అత్యాశకు, తప్పుడు అలవాట్లకు పోతున్న యువత మాత్రం పూర్తిగా తమ తమ జీవితాలను నాశనం చేసుకుంటుందనేది మాత్రం అక్షర సత్యం అనేది పరిశీలకుల మాట!