బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్.. కెప్టెన్సీ..అతడు 4డి ప్లేయర్
క్రికెట్‌లో ఆల్ రౌండర్లు చాలామంది ఉంటారు.. నిఖార్సయిన ఆల్‌రౌండర్లు చాలా తక్కువగా ఉంటారు.. ఇక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అరుదే.
By: Tupaki Desk | 18 July 2025 9:26 AM ISTక్రికెట్‌లో ఆల్ రౌండర్లు చాలామంది ఉంటారు.. నిఖార్సయిన ఆల్‌రౌండర్లు చాలా తక్కువగా ఉంటారు.. ఇక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అరుదే. ఉన్నా.. బౌలింగ్ ఆల్ రౌండర్లుగా ఉంటారు.. లేదా ఏదో ఒక ఫార్మాట్లో మాత్రమే ఆడుతుంటారు.. కానీ, అతడు మాత్రం.. అన్నీ కలిసిన కంప్లీట్ ప్లేయర్. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో జట్టుకు ఉపయోగపడే ఆటగాడిని త్రీ (3డీ) ప్లేయర్ అని అంటుంటారు. ఈ మాటను టీమ్ ఇండియా మాజీ చీఫ్ సెలక్టర్, తెలుగు వారైన ఎమ్మెస్కే ప్రసాద్ వాడుకలోకి తెచ్చారు. 2019 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా తెలుగు బ్యాట్స్‌మన్ అంబటి రాయుడిని కాదని తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంపిక చేసినందుకు ప్రశ్నలు రాగా.. విజయ్ 3డి ప్లేయర్ అని సమాధానం ఇచ్చారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఆటగాడు 4డి ప్లేయర్.
టీమ్ ఇండియా-ఇంగ్లండ్ మధ్య ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మూడో టెస్టు. ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ క్రీజులో పాతుకుపోవడంతో ఇంగ్లండ్ స్కోరుకు దీటుగా బదులిస్తోంది టీమ్ ఇండియా. ఇలాంటి సమయంలో సింగిల్ తీసేందుకు ప్రయత్నించిన పంత్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో నేరుగా ఆ త్రో విసిరింది ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. కేవలం చిన్న అవకాశాన్ని అతడు మ్యాచ్‌ను మలుపుతిప్పేలా సద్వినియోగం చేశాడు. ఇండియా కెప్టెన్ గిల్ కూడా టెస్టులో టర్నింగ్ పాయింట్ పంత్ రనౌట్ అని ఒప్పుకొన్నాడు.
ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేయడం.. రెండు వికెట్లు తీయడం.. రెండో ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేయడమే కాక.. రాహుల్‌ను ఎల్బీ చేయడం, మ్యాచ్ నాలుగో రోజు అద్భుత బంతితో ఆకాశ్‌దీప్‌ను బౌల్డ్ చేయడం.. ఇవన్నీ స్టోక్స్ ప్రతిభకు నిదర్శనం. వీటికితోడు అతడు కెప్టెన్ అనే సంగతి మర్చిపోవద్దు. అసలు టెస్టులో అవకాశాలు లేని పరిస్థితిలోనూ ఏమాత్రం పట్టు వదలకుండా స్టోక్స్ చూపిన పోరాట పటిమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్టోక్స్ నంబర్‌వన్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. కానీ, కొన్నాళ్ల కిందట గాయంబారిన పడడంతో బౌలింగ్ తగ్గించాడు. కొన్ని మ్యాచ్‌లలో బ్యాటింగ్ మాత్రమే చేశాడు. కానీ, టీమ్ ఇండియాతో ప్రస్తుత సిరీస్‌లో కీలక పేసర్లు అందుబాటులో లేకపోవడంతో స్టోక్స్ బంతిని అందుకున్నాడు. జట్టుకు స్ఫూర్తిగా నిలిచాడు. లార్డ్స్ టెస‍్టులో అయితే ఏకధాటిగా 10కి పైగా ఓవర్లు వేశాడు. అందుకే అతడిని 4డి ప్లేయర్ అంటున్నారు. నిజంగా ఇది అతడికి తగినదే.
