Begin typing your search above and press return to search.

బీసీసీఐ కాంట్రాక్టులు.. ఆ ఇద్దరూ ఔట్.. హైదరాబాదీలకు అప్ గ్రేడ్

గత కాంట్రాక్టులో బి గ్రేడ్ లో ఉన్న అయ్యర్, ‘సి’లో ఉన్న కిషన్ ఇటీవల బోర్డు ఆదేశాలను ధిక్కరించారు. దీంతో రూ.2 కోట్లు, రూ.కోటి ప్యాకేజీని కోల్పోయారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 5:22 PM GMT
బీసీసీఐ కాంట్రాక్టులు.. ఆ ఇద్దరూ ఔట్.. హైదరాబాదీలకు అప్ గ్రేడ్
X

ఏడాదికి రూ.3 కోట్లు.. రూ.2 కోట్లు.. రూ.కోటి.. ఇదేదో ఐఐటీయన్ల క్యాంపస్ రిక్రూట్ మెంట్ ప్యాకేజీ కాదు.. బిజినెస్ మెన్ శాలరీ అంతకన్నా కాదు.. కేవలం ఓ క్రికెటర్ కు గ్రేడ్ ల వారీగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చెల్లించే మొత్తం. మేటి ఆటగాళ్లకు, మెరుగైన ప్రతిభ కనబరిచిన వారికి, వర్ధమాన క్రికెటర్లకు ఇచ్చే ప్యాకేజీ. ఈసారి 2023-24 సీజన్ కు సంబంధించి బోర్డు కాంట్రాక్టులను ప్రకటించింది. ఇందులో విశేషం ఏమంటే.. వన్డే ప్రపంచ కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడిన ఇద్దరు ఆటగాళ్లపై వేటు పడింది.

వారు లేకుండా..

భారత్ వేదికగా మూడు నెలల కిందట జరిగిన ప్రపంచ కప్ లో ఆడిన ఆటగాళ్లు వచ్చే ఏడాదికి కాంట్రాక్టులో లేకుండా పోవడం అంటే విచిత్రమే. అయితే, ఇది శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ చేజేతులా చేసుకున్నదే. గత కాంట్రాక్టులో బి గ్రేడ్ లో ఉన్న అయ్యర్, ‘సి’లో ఉన్న కిషన్ ఇటీవల బోర్డు ఆదేశాలను ధిక్కరించారు. దీంతో రూ.2 కోట్లు, రూ.కోటి ప్యాకేజీని కోల్పోయారు. మానసిక అలసట అంటూ డిసెంబరులో దక్షిణాప్రికా సిరీస్ నుంచి మధ్యలో వచ్చేసిన కిషన్.. ఆ తర్వాత కూడా జట్టు మేనేజ్ మెంట్ విశ్వాసాన్ని చూరగొనలేదు. కేవలం తుది జట్టులో ఆడించనందుకే జాతీయ జట్టును వీడిన అతడు.. రంజీల్లో సొంత రాష్ట్రం జార్ఖండ్ కు ఆడమని చెప్పినా వినలేదు. ఇక అయ్యర్ ప్రస్తుత ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో రెండో టెస్టు వరకు ఆడాడు. ఈ మ్యాచ్ లలో విఫలమైన అతడు వెన్నునొప్పి అంటూ సాకు చెప్పాడు. అయితే, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) మాత్రం అదేమీ లేదని తేల్చింది. దీంతో ముంబై రంజీ జట్టుకు ఆడమని బోర్డు కోరినా.. అతడు పెడచెవిన పెట్టాడు. కిషన్ అయితే ఏకంగా అటు జార్ఖండ్ జట్టు రంజీమ్యాచ్ ఆడుతుంటే.. ఐపీఎల్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు అతడు బోర్డుకు చెప్పకుండా దుబాయ్ లో పార్టీల్లో పాల్గొన్నాడు.

హైదరాబాదీలకు లక్..

కొన్నాళ్లుగా టీమిండియా ప్రధాన పేసర్ రాణిస్తున్న హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ ఈసారి ఏకంగా ‘ఎ’ గ్రేడ్ లోకి వచ్చాడు. బ్యాటింగ్ లో భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్న హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మకు ‘సి’ గ్రేడ్ దక్కింది. టి20ల్లో సుస్థిర స్థానంగా దిశగా ఆడుతున్న హిట్టర్ రింకూ సింగ్ కూ ‘సి’ గ్రేడ్ లో చోటిచ్చారు. కాగా, ‘ఎ ప్లస్’ కేటగిరీలో ఉన్న ఆటగాళ్ల సంఖ్య ఈసారి తగ్గింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మాత్రమే ఈ టాప్ కేటగిరీలో ఉన్నారు.

గ్రేడ్ ల వారీగా ఇలా..

అశ్విన్, షమీ, సిరాజ్, రాహుల్, గిల్, పాండ్యాలకు ఎ గ్రేడ్ ఇచ్చారు. రాహుల్‌, గిల్‌ తో పాటు సిరాజ్‌ కు ప్రమోషన్ దక్కింది. 360 డిగ్రీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, స్పిన్నర్ల కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బ్యాటింగ్ నయా సంచలనం యశస్వి జైస్వాల్ గ్రేడ్ ‘బి’లో ఉన్నారు.

రింకూ, తిలక్ తో పాటు రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేష్ కుమార్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, తెలుగు వికెట్ కీపర్ కేఎస్‌ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్ లకు ‘సి’ గ్రేడ్ లో చోటు దక్కింది.