Begin typing your search above and press return to search.

చిన్నస్వామి దుర్ఘటన..ఇక విజయోత్సవాలు లేనట్లే.. బీసీసీఐ కొత్త రూల్స్?

ఐపీఎల్ వేరే బీసీసీఐ వేరు కాకున్నా.. బెంగళూరు దుర్ఘటనలో తమ పాత్ర లేదు అనేది బీసీసీఐ సమాధానంగా ఉంది.

By:  Tupaki Desk   |   5 Jun 2025 4:26 PM IST
చిన్నస్వామి దుర్ఘటన..ఇక విజయోత్సవాలు లేనట్లే.. బీసీసీఐ కొత్త రూల్స్?
X

సరిగ్గా ఏడాది కిందట టీమ్ ఇండియా టి20 ప్రపంచ కప్ గెలిచింది. 2007 నాటి తొలి ప్రపంచ కప్ తర్వాత భారత్ మళ్లీ టి20 ప్రపంచ కప్ గెలవడం అదే మొదటిసారి. దీంతో విశ్వవిజేతగా ముంబై చేరుకున్న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియాకు ఘనంగా స్వాగతం పలికారు. అంతర్జాతీయ ఈవెంట్ లో జాతీయ జట్టు విజేతగా నిలవడంతో బీసీసీఐ కూడా భాగం తీసుకుంది. నిరుడు ముంబై వంటి మహా నగరంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా టీమ్ ఇండియా విజయ యాత్ర సాగింది. కానీ, బుధవారం బెంగళూరులో తొలి ఐపీఎల్ టైటిల్ తో దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భవిష్యత్ లో విక్టరీ పరేడ్ లకు బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనే ప్రశ్న వచ్చింది.

బుధవారం జరిగింది ఫ్రాంచైజీ కార్యక్రమం అనేది బీసీసీఐ ఉద్దేశంగా ఉంది. అంటే.. తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. ఐపీఎల్ విజేతగా నిలిచిన ఫ్రాంచైజీ జట్టు తమ సొంత నగరంలో వేడుక జరుపుకొందని.. దీనికి బీసీసీఐకి సంబంధం ఏమిటని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

ఐపీఎల్ వేరే బీసీసీఐ వేరు కాకున్నా.. బెంగళూరు దుర్ఘటనలో తమ పాత్ర లేదు అనేది బీసీసీఐ సమాధానంగా ఉంది. కాకపోతే.. అసలు పరిస్థితిని బోర్డు అర్థం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇకమీదట విజయోత్సవాలపై నిబంధనలు విధించనున్నట్లు తెలుస్తోంది.

తమ బాధ్యత లేకున్నా.. బెంగళూరు ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నామని, ఆర్సీబీ ఫ్రాంచైజీతో సంప్రదింపుల్లోనే ఉన్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఇక తాజా పరిణామాల రీత్యా భవిష్యత్ లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు బీసీసీఐ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. విజయోత్సవాలకు కొత్త నియమాలు తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అసలు విజయోత్సవాలకు పూర్తిగా అనుమతి ఇవ్వకపోవచ్చని కూడా అంటున్నారు. పూర్తిస్థాయి నిర్ణయాలు బయటకు వస్తే గాని.. అసలు విషయం ఏమిటన్నది తెలియదు.