ఇంకా చల్లారని ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ మంటలు..ఇక బీసీసీఐ వంతు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ కొట్టి నాలుగు రోజులైంది.. 18వ సీజన్ లో తన కల నెరవేర్చుకున్న ఆనందం ఆ జట్టకు 18 గంటలైనా నిలవలేదు
By: Tupaki Desk | 7 Jun 2025 7:40 PM ISTరాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ కొట్టి నాలుగు రోజులైంది.. 18వ సీజన్ లో తన కల నెరవేర్చుకున్న ఆనందం ఆ జట్టకు 18 గంటలైనా నిలవలేదు. దీనికి కారణం.. ఆర్సీబీ సొంత నగరం బెంగళూరులో విజయోత్సవం విషాదానికి దారితీయడమే. 35 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న బెంగళూరులోని ప్రఖ్యాత చిన్నస్వామి మైదానం ఎదుట 3 లక్షల మంది గుమిగూడడం తొక్కిసలాటకు దారితీసిందీ. దీంతో 11 నిండు ప్రాణాలు పోయాయి. 50 మంది గాయపడ్డారు.
వాస్తవానికి ఐపీఎల్ నిర్వహణ (ఫైనల్ మ్యాచ్)తోనే ఐపీఎల్ పాలక మండలి బాధ్యత ముగిసింది. ఆ తర్వాత ఏం జరిగినా ఫ్రాంచైజీ బాధ్యతనే. లేదా ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఏమైనా కార్యక్రమాలు చేపడితే దాని బాధ్యత. లేదా కప్ గెలిచిన రాష్ట్రానికి చెందిన జట్టు ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తే దాని బాధ్యత. ఈ లెక్కన బెంగళూరు విషాదంతో బీసీసీఐకి గానీ, ఐపీఎల్ పాలక మండలికి గానీ సంబంధం లేదు. కానీ, జరిగిన దుర్ఘటనను మాత్రం అలా వదిలేయం కదా..?
అందుకనే చిన్నస్వామి మైదానం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను బీసీసీఐ తీవ్రంగా తీసుకుంది. ముందుముందు ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో ఏవైనా విజయోత్సవాలు నిర్వహించాలంటే మార్గదర్శకాలు జారీ చేయాలని ఆలోచిస్తోంది.
అయితే, బెంగళూరు దుర్ఘటనను కేవలం ఆర్సీబీకి ఫ్రాంచైజీకి సంబంధించిన వ్యవహారంగానే బీసీసీఐ చూస్తోంది. కానీ, దేశంలో క్రికెట్ కు సంబంధించిన వ్యవహారాలు ఏం జరిగినా బోర్డుకు బాధ్యత ఉంటుందని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏం మార్గదర్శకాలు విడుదల చేస్తుందో చూడాలి.
కాగా బెంగళూరు దుర్ఘటన దెబ్బతో కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్ సీఏ) కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జైరాం పదవుల నుంచి తప్పుకొన్నారు. పైగా ఆర్సీబీ మేనేజ్ మెంట్, కేఎస్ సీఏ చీఫ్ రఘురామ్ భట్, ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ డీఏన్ఏ ఎంటర్ టైన్ మెంట్ పై కేసు నమోదైంది. బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.