Begin typing your search above and press return to search.

ఆసియాకప్ లో పాక్ తో క్రికెట్ బంద్.. బీసీసీఐ సంచలన ప్రకటన

ప్రస్తుతం ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ)కి పాకిస్థాన్‌ మంత్రి, పీసీబీ ఛైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ అధ్యక్షుడిగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది.

By:  Tupaki Desk   |   19 May 2025 8:00 PM IST
ఆసియాకప్ లో పాక్ తో క్రికెట్ బంద్..  బీసీసీఐ సంచలన ప్రకటన
X

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌ టోర్నీ నుంచి టీమ్‌ఇండియా వైదొలగాలని నిర్ణయించినట్లు వచ్చిన వార్తలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఖండించింది.

ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే పురుషుల ఆసియా కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన టీమ్‌ఇండియా ఆడే అవకాశాలు లేవని ఆంగ్ల మీడియాలో కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. అంతేకాకుండా, జూన్‌ నెలలో జరిగే మహిళల ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ నుంచి కూడా బీసీసీఐ వైదొలగాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ)కి పాకిస్థాన్‌ మంత్రి, పీసీబీ ఛైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ అధ్యక్షుడిగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది.

అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీసీఐ బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఉదయం నుంచి ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీల్లో పాల్గొనకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు జరుగుతున్న ప్రచారం మా దృష్టికి వచ్చింది. అటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటి వరకు బీసీసీఐ ఏసీసీ ఈవెంట్‌ల గురించి చర్చించలేదు’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం తమ దృష్టి అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను సజావుగా నిర్వహించడం, ఆ తర్వాత టీమ్‌ఇండియా పురుషుల, మహిళల జట్ల ఇంగ్లాండ్ పర్యటనపైనే ఉందని ఆయన అన్నారు. ఆసియా కప్ విషయం లేదా మరేదైనా ఏసీసీ ఈవెంట్ గురించి ఏ స్థాయిలోనూ చర్చ జరగలేదని స్పష్టం చేశారు. దీని గురించి ఏవైనా వార్తలు వస్తే అవన్నీ పూర్తిగా ఊహాజనితమని ఆయన కొట్టిపారేశారు. ఏసీసీ ఈవెంట్‌ గురించి ఏదైనా చర్చగాని, ముఖ్యమైన నిర్ణయంగాని తీసుకుంటే తప్పకుండా మీడియాకు వెల్లడిస్తామని దేవజిత్ సైకియా తెలిపారు.