Begin typing your search above and press return to search.

బీసీసీఐ త‌దుప‌రి చీఫ్ సెల‌క్ట‌ర్ గా మ‌రోసారి మాజీ పేస్ బౌల‌ర్!

భార‌త క్రికెట్ లో బీసీసీఐ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శుల త‌ర్వాత అత్యంత కీల‌క‌మైన‌ది చీఫ్ సెల‌క్ట‌ర్ ప‌ద‌వి.

By:  Tupaki Political Desk   |   5 March 2026 5:00 PM IST
బీసీసీఐ త‌దుప‌రి చీఫ్ సెల‌క్ట‌ర్ గా మ‌రోసారి మాజీ పేస్ బౌల‌ర్!
X

భార‌త క్రికెట్ లో బీసీసీఐ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శుల త‌ర్వాత అత్యంత కీల‌క‌మైన‌ది చీఫ్ సెల‌క్ట‌ర్ ప‌ద‌వి. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ లో ఉన్న అజిత్ అగార్క‌ర్ ముంబైకి చెందిన పేస్ బౌల‌ర్. టీమ్ ఇండియాకు 1998 నుంచి 2007 వ‌ర‌కు దాదాపు ద‌శాబ్ద కాలం ప్రాతిన‌ధ్యం వ‌హించారు. 196 వ‌న్డేలు, 26 టెస్టులు, 4 టి20 మ్యాచ్ ల‌లో ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ కాలంలో ఎక్కువ‌గా జ‌రిగే వ‌న్డేల‌లో కీల‌క బౌల‌ర్ గా సేవ‌లందించాడు. త‌ర‌చూ గాయాల‌తో కేవ‌లం 30 ఏళ్ల వ‌య‌సుకే టీమ్ ఇండియాకు దూర‌మ‌య్యాడు. రిటైర్మెంట్ త‌ర్వాత అగార్క‌ర్ కామెంటేట‌ర్ గా ప‌నిచేశాడు. త‌ర్వాత 2023 జూలైలో చీఫ్ సెల‌క్ట‌ర్ అయ్యాడు. గ‌త ఏడాది జూలైతోనే అత‌డి ప‌ద‌వీ కాలం ముగిసినా, ఏడాది పొడిగింపు ఇచ్చారు. మ‌రికొద్ది నెల‌ల్లో ఈ గ‌డువు కూడా ముగియ‌నుంది.

పొడిగింపు లేదు..

టీమ్ ఇండియా అగార్క‌ర్ చీఫ్ సెల‌క్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టాక టెస్టుల్లో ఘోర ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. టి20ల్లో ప్ర‌పంచ క‌ప్, ఆసియా క‌ప్, వ‌న్డేల్లో చాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచింది. కానీ, ద్వైపాక్షిక సిరీస్ ల‌లో శ్రీలంక చేతిలో ఓడింది. అది కూడా దాదాపు 27 ఏళ్ల త‌ర్వాత‌. ఇక న్యూజిలాండ్ పై చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనివిధంగా స్వ‌దేశంలో వ‌న్డే సిరీస్ చేజార్చుకుంది. అంత‌కుముందు టెస్టు సిరీస్ లో 0-3తో స్వీప్ అయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో అగార్క‌ర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కొంద‌రు ఆట‌గాళ్ల ఎంపికను త‌ప్పుబ‌ట్టారు. సీనియ‌ర్ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ ష‌మీని తిరిగి ఎంపిక చేయ‌క‌పోవ‌డం మీద కూడా అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏ విధంగా చూసినా అగార్క‌ర్ ప‌ద‌వీ కాలాన్ని స‌గం మేర‌కు మాత్ర‌మే స‌క్సెస్ అని చెప్ప‌గ‌లం. నిబంధ‌న‌ల ప్ర‌కారం అజిత్ కు మ‌ళ్లీ చాన్స్ లేన‌ట్లే.

కొత్త‌గా మ‌రి ఎవ‌రు?

బీసీసీఐ చీఫ్ సెల‌క్ట‌ర్ గా ఎవ‌రు వ‌చ్చినా ఎంతో బాధ్య‌త. త‌దుప‌రి త‌రం భార‌త జ‌ట్టును తీర్చిదిద్దే ఇది. అగార్క‌ర్ హ‌యాంలోనే దిగ్గ‌జ ఆట‌గాళ్లు రోహిత్, కోహ్లి, పుజారా, అశ్విన్ టెస్టుల నుంచి రిటైర‌య్యారు. జ‌డేజా టి20ల నుంచి త‌ప్పుకొన్నాడు. కోహ్లి, రోహిత్ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ వ‌ర‌కు ఆడాల‌ని చూస్తున్నారు. మ‌రి వీరిని ఎంపిక చేసే అవ‌కాశం కూడా కొత్త చీఫ్ సెల‌క్ట‌ర్ చేతుల్లోనే ఉంటుంది. ఆ బాధ్య‌త‌ల్లోకి వ‌చ్చేది ఎవ‌రు? అంటే, మాజీ పేస్ బౌల‌ర్ జ‌హీర్ ఖాన్ పేరు వినిపిస్తోంది. భార‌త్ నుంచి వ‌చ్చిన అత్యుత్త‌మ పేస్ బౌల‌ర్ల‌లో ఒక‌డైన జ‌హీర్.. 92 టెస్టుల్లో దేశానికి ప్రాతినిధ్యం వ‌హించాడు. ఏకంగా 200 వ‌న్డేలు ఆడాడు. 17 టి20ల్లో బ‌రిలో దిగాడు. బ్యాట‌ర్ గా త‌ప్ప మిగ‌తా ఏవిధంగా చూసినా అగార్క‌ర్ కంటే మెరుగైన ఆట‌గాడే. మ‌రి.. చీఫ్ సెల‌క్ట‌ర్ గా అవ‌కాశం ద‌క్కుతుందా? దానికి ఏ మేర‌కు న్యాయం చేస్తాడో చూడాలి.