జూ.క్రికెటర్లకు బోన్ మ్యారో..ఏజ్ ఫ్రాడ్ చెల్లదు..బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడల్లో ప్రధానమైన మోసం.. వయసు దాచడం.. ఎక్కువ వయసు వారైనా.. తక్కువ వయసును చూపి ఎంపికకు వెళ్తుంటారు.
By: Tupaki Desk | 18 Jun 2025 2:00 AM ISTక్రీడల్లో ప్రధానమైన మోసం.. వయసు దాచడం.. ఎక్కువ వయసు వారైనా.. తక్కువ వయసును చూపి ఎంపికకు వెళ్తుంటారు. ఇది అత్యధికంగా క్రికెట్ లోనే జరుగుతుంది. అత్యంత ఆదరణ ఉన్న క్రీడ కాబట్టి ఇది సహజం అనుకోవాలి. జాతీయ స్థాయికి ఎదిగిన ఆటగాళ్ల విషయంలోనూ గతంలో ఏజ్ ఫ్రాడ్ ఆరోపణలు రావడం గమనార్హం. తాజాగా కుర్ర సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా దీనికి అతీతుడు కాదు.
కొందరు ఆటగాళ్లు వయసు ధ్రువీకరణకు సంబంధించి నకిలీ పత్రాలు సమర్పిస్తుండడం తరచూ సమస్యలు తెస్తోంది. ఇది వారి ఎంపిక తర్వాత బయటపడుతుండడంతో విమర్శలకు తావిస్తోంది. అందుకనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ క్రికెట్ లో ఆయా వయసు విభాగాల క్రికెటర్లకు బోన్ మ్యారో (ఎముక వయసు నిర్ధారణ) పరీక్ష చేయనుందని సమాచారం. ఈ పద్ధతిలో అయితే కచ్చితంగా వయసు నిర్ధారణ అవడమే కారణం.
ఇప్పుడు టీడబ్ల్యూ3 పద్ధతిని అవలంబిస్తున్నారు. దీంతోపాటు ఏ+1 విధానం కూడా తెచ్చింది. బాలుర అండర్-16లో ఎముక పరీక్ష కటాఫ్ ను 16.5 ఏళ్లు (ఎముక వయసు 16.4 ఏళ్లు)గా నిర్ణయించింది. బాలికల అండర్ 15లో 15 ఏళ్లుగా నిర్ధారించగా.. ఎముక పరీక్ష సమయంలో 14.9 ఏళ్లు మాత్రమే ఉండాలి.
ఏ ప్లస్ 1 విధానంలో బాలుర విభాగంలో అండర్- 16లో ఆటగాడు ప్రస్తుత సీజన్ లో బోన్ మ్యారో టెస్టుకు హాజరై ఫలితం 15.4 ఏళ్లుగా తేలితే.. మరుసటి ఏడాది పరీక్షకు హాజరవ్వాల్సిన అవసరం ఉండదు. బోన్ ఏజ్ 15.5 కావడమే దీనికి కారణం. ఇది బాలికల విభాగంలోనూ వర్తిస్తుంది.
ఇక వైభవ్ సూర్యవంశీ తాజా ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. నిరుడు నవంబరులో మెగా వేలం సమయానికి అతడి వయసు 13 ఏళ్ల 288 రోజులే. కానీ, వైభవ్ కు 15 ఏళ్లని ఆరోపణలు వచ్చాయి. దీంతో వైభవ్ తండ్రి వివరణ ఇచ్చాడు. తమ అబ్బాయికి 8 ఏళ్ల వయసులో బీసీసీఐ బోన్ మ్యారో టెస్టుకు హాజరైనట్లు చెప్పాడు. తద్వారా ఆరోపణలు నిజం కాదని తేల్చిచెప్పాడు. ఈలోగానే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
